నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 1:18PM by PIB Hyderabad
అందరికీ శుభాభినందనలు!
గౌరవనీయులైన కర్ణాటక గవర్నర్ శ్రీ సుధాయాదవ్, ఆరెస్సెస్ అధిపతి- మాకు మార్గదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలె, ‘ఎస్-వ్యాస’ అధ్యక్షుడు శ్రీ హెచ్.ఆర్.నాగేంద్ర, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీ నాగరత్న, చాన్సలర్ శ్రీ హెచ్.ఆర్.దయానంద స్వామి, వైస్- చాన్సలర్ శ్రీ ఎన్.కె.మంజునాథ్, ఎంపీ శ్రీ సి.ఎన్.మంజునాథ్, దక్షిణ కొరియాలోని మిర్యాంగ్ నగర మేయర్, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా!
బెంగళూరులో నేడిక్కడ యోగాభ్యాస అసాధారణ సామర్థ్యాన్ని అనుభూతి చెందే అద్భుత అవకాశం నాకు దక్కింది. ఈ కర్ణాటక గడ్డ శతాబ్దాలుగా యోగా విద్యకు కేంద్రం... ఈ నేలపై జన్మించిన ఎందరో గొప్ప గురువులు, పండితులు యోగా సంప్రదాయాన్ని ఎంతో సుసంపన్నం చేశారు. కన్నడ చలనచిత్ర దిగ్గజం డాక్టర్ శ్రీ రాజ్‌కుమార్ కూడా యోగాభ్యాసకులలో ఒకరని, కళారంగంతో పాటు ఈ రంగం ప్రగతికీ ఆయనెంతో కృషి చేశారన్న వాస్తవం మనందరికీ తెలిసిందే.
మిత్రులారా!
కర్ణాటకకు గల ఈ సుసంపన్న వారసత్వ నేపథ్యంలో ‘ప్రశాంతి కుటీరం’ 50 ఏళ్ల ప్రస్థానానిది సేవ, అంకితభావంతో కూడిన అసాధారణ, అపూర్వ గాథ. కాబట్టి, దీని గురించి ప్రతి భారతీయుడూ తెలుసుకోవడం అవశ్యం. ఒక సాధారణ యోగ కేంద్రంగా ప్రారంభమై ఇంతటి భారీ ఉద్యమ స్థాయికి రూపాంతరం చెందడం అనితరసాధ్యమే కాకుండా ఎనలేని స్ఫూర్తిదాయక అంశం.
మిత్రులారా!
ఈ స్వర్ణోత్సవ సందర్భంలో అనేక కొత్త సదుపాయాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల నిర్వహణపై ‘ఎస్-వ్యాస’ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘ప్రశాంతి కుటీరం’ స్వర్ణోత్సవ సమయాన దీనితో ముడిపడిన లక్షలాది అభ్యాసకులు సహా మీకందరికీ అభినందనలు.
మిత్రులారా!
నేడు ఈ కుటీరం స్వర్ణోత్సవాలతో పాటు ఈ ఏడాది మనం పూజనీయ శ్రీ హెచ్.వి.శేషాద్రి శతజయంతి వేడుకను కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు సగౌరవ నివాళి అర్పిస్తున్నాను. ‘వ్యక్తి వికాసంతో దేశ ప్రగతి’ లక్ష్యం కోసం శ్రీ శేషాద్రి తన జీవితాన్ని అంకితం చేశారు. దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చే క్రమంలో అంకితభావం, సామర్థ్యం, క్రమశిక్షణ గల పౌరులు ఎంతో అవసరమని ఆయన గుర్తించారు. ఆ విధంగా వ్యక్తులను తీర్చిదిద్దడంలో తాను మమేకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో పనిచేస్తున్న వేళ ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాలు కోట్లాది స్వయంసేవకులకు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
మిత్రులారా!
శ్రీ శేషాద్రిని స్మరించుకున్నప్పుడల్లా మనకు తొలుత గుర్తుకొచ్చేది ఆయన సరళ వ్యక్తిత్వం. ఆ గొప్ప లక్షణం గురించి శ్రీ దత్తాజీ ఎంతో అద్భుతంగా వివరించారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం, విస్తృతానుభవం ఉన్నప్పటికీ, ఆయనెంతో వినమ్రంగా వ్యవహరించేవారు! తాను తెర వెనుకనే ఉంటూ, ఇతరులు ముందడుగు వేసేలా ప్రోత్సహించే వారు. అలాగే, ప్రజలను ఏకం చేసి, దేశ సేవకు సంసిద్ధులను చేయడం ఆయన జీవితంలోని గొప్ప క్రమశిక్షణకు నిదర్శనం. ఎవరితోనైనా సంభాషించే వేళ ఆయన తరచూ ఒక అంశాన్ని ఉదాహరించే వారు. ఈ మేరకు ఒక తల్లి తన బిడ్డ కోసం రాత్రంతా మేల్కొని సేవ చేయడం, లాలించి పెంచడం, నిస్వార్థంగా శ్రమించడం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఆయన అనేవారు. సమాజానికి సంబంధించి మనలో ఆ భావనను ప్రోది చేసుకుంటే అందరికీ ఎంత మేలు కలుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి!
మిత్రులారా!
ఒక తల్లి నిస్వార్థ సేవాభావనతో శ్రీ శేషాద్రి సమాజ సేవకు అంకితమయ్యారు. అటువంటి మహనీయుడి ఆప్యాయత, మార్గదర్శకత్వాలను నిరంతరం పొందే అదృష్టం నాకు లభించింది. శ్రీ శేషాద్రితో గడిపిన మధుర జ్ఞాపకాలు, ఆయన పలికిన మాటలు నేటికీ నాకెంతో విలువైనవేగాక నిత్య మార్గనిర్దేశాలు.
మిత్రులారా!
శ్రీ శేషాద్రి చెప్పిన మరో మాటను కూడా నేనెన్నటికీ మరువలేను. సమాజానికి మనం రెండు చేతులతో ఏది ఇస్తే, ఆ సమాజం మనకు లక్షలాది చేతులతో దాన్ని తిరిగి ఇస్తుందనేవారు. ఈ సూత్రం పదేపదే వాస్తవరూపు దాల్చడం నా జీవిత స్వీయానుభవం. ప్రజలకు… అంటే- ‘జన జనార్దను’లకు నా సేవలో వారు సదా నాపై ఆశీస్సులు కురిపిస్తూనే ఉన్నారు. నా జీవితంలో లభించిన గొప్ప సంపదలలో ఇదీ ఒకటి.
మిత్రులారా!
శ్రీ శేషాద్రి కుటుంబంలోనూ అలాంటి సేవా దృక్పథమే మనకు కనిపిస్తుంది. ఆయన ఆశయాన్ని డాక్టర్ శ్రీ నాగేంద్ర, డాక్టర్ నాగరత్న గారు తమ కార్యకలాపాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. వారి కృషిని ప్రశంసిస్తూ, శుభాభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
దేశం వలస పాలనలో బందీగా ఉన్నప్పుడు ఒకవైపు లక్షలాది యోధులు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. మరోవైపు స్వామి వివేకానంద వంటి మహనీయులు భారత ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పుతూ యువతకు యోగ మార్గం నిర్దేశించారు.
మిత్రులారా!
స్వామి వివేకానంద వంటి మహనీయుల స్ఫూర్తితోనే ‘ప్రశాంతి కుటీరం’ వంటి సంస్థలు ఉద్భవించాయి. ఇక్కడ యోగాను సామాన్యులకు చేరువ చేయడమేగాక ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలతో దానిపై కొత్త పరిశోధనల దిశగా కృషి చేశారు. ఈ సంస్థ కేవలం యోగాభ్యాసకులనే కాకుండా సమాజానికి అవసరమైన శిక్షకులను, తత్త్వవేత్తలను కూడా తీర్చిదిద్దింది. ఈ ఉపాధ్యాయులు, వైద్యులు, పరిశోధకులు యోగా ద్వారా దేశమంతటా మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రశాంతి కుటీరం నుంచి పరిణామం చెందిన ‘ఎస్-వ్యాస’ యోగ విద్య, శాస్త్రీయ పరిశోధన, ఆరోగ్య సేవల రంగాల్లో ఓ కీలక సంస్థగా ఎదిగింది. యోగతో పాటు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఆధునిక వైద్య శాస్త్ర సంబంధిత సదుపాయాలతో కూడిన సమగ్ర ఆరోగ్య వ్యవస్థను మీరు రూపొందించారు. ఒత్తిడి సమస్యలు, జీవనశైలి వ్యాధుల వంటి అంశాలపై మీ పరిశోధన యావత్ ప్రపంచానికీ ఎంతో ఉపయోగపడింది, ఈ అవిరళ కృషిపై ‘ప్రశాంతి కుటీరాన్ని’ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా!
భారత్ తన సంస్కృతిని, అస్తిత్వాన్ని, జ్ఞాన వ్యవస్థలను గత పుష్కర కాలం నుంచీ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ప్రపంచం ముందుంచుతోంది. ఓ బాధ్యతాయుత వ్యక్తిగా నేనీ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలను. భారత్ చొరవతో ప్రపంచమంతా ఇప్పుడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహించుకుంటోంది. యోగా దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా, అమెరికా దాకా అన్ని దేశాల్లోనూ యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో కోట్లాదిగా ప్రజలు పాల్గొంటున్నారు. అనేక దేశాల్లోని పాఠశాలలు, విద్యా సంస్థలు, కార్యాలయాలకు మన యోగా చేరువైంది. ఉదాహరణకు సౌదీ అరేబియాలో యోగాకు ఒక క్రీడగా గుర్తింపునిచ్చారు. అక్కడి క్రీడా మంత్రిత్వశాఖ యోగాను ప్రోత్సహించే దిశగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. విదేశీయులు యోగాను ప్రోత్సహిస్తున్న దృశ్యాలు నిత్యం మన కంటబడుతూనే ఉన్నాయి… ఇది నా స్వీయానుభవం.
ప్రపంచంలో నేనెక్కడికి వెళ్లినా విదేశీ అతిథులు లేదా దేశాధినేతలతో కలిసి భోజనం చేసేటప్పుడు యోగా ప్రస్తావన తప్పనిసరిగా వస్తూంటుంది. అలాంటి సందర్భాల్లో నేనేమీ యోగా నిపుణుడిని కాదని, కేవలం అభ్యాసకుడిని మాత్రమేనని వారికి వివరిస్తుంటాను. ఆ తర్వాత యోగా వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను వారికి విశదీకరిస్తాను. అప్పుడు వారెన్నో ప్రశ్నలు సంధిస్తుంటారు. తమ సతీమణులు ఏటా భారత్‌లో యోగా నేర్చుకుని, తమ దేశంలో ఇతరులకు నేర్పుతుంటారని పలువురు ప్రపంచ దేశాధినేతలు నాతో చెప్పారు. తమ కుమార్తెలు యోగా నేర్చుకుంటున్నారని కొందరు, పూర్తిగా దానికే అంకితమయ్యారని మరికొందరు చెబుతుంటారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దేశాధినేతల కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు యోగాతో అనుసంధానితులై ఉన్నారు. యోగా ద్వారా భారత ప్రతిష్ఠ ఎంత విస్తృత స్థాయికి వెళ్లిందో ఈ ఉదాహరణలు తెలియజేస్తాయి. భారత్‌ను అర్థం చేసుకోవడంలో యోగా ఒక ఉపకరణంగా మారిందంటే అతిశయోక్తి కానేకాదు. ఖతర్ రాచ కుటుంబికులైనా, ఇతర దేశాల వారైనా యోగాకు పూర్తిగా అంకితమైన ఎందరో విదేశీయులను నేను చూశాను. అటువంటి వ్యక్తులలో అనేకమందిని భారత్ ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించి, వారి ప్రతిష్టను ఇనుమడింపజేసింది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగా గురించి మరింత అవగాహన పొందుతున్న క్రమంలో... భారత్ గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో పెరుగుతోంది. మన సంస్కృతి, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థల పట్ల వారికి కొత్త ఆకర్షణ ఏర్పడుతోంది. ఇది భారత్‌కు, ప్రపంచానికి మధ్య పరస్పర సహకారానికి కొత్త అవకాశాలను కల్పిస్తోంది. మనందరి సమష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇక ఆయుర్వేదం గురించి మాట్లాడుకుంటే... ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో 150కి పైగా ఆయుర్వేద శిక్షణా కోర్సులకు గుర్తింపు లభించింది. ఆయుర్వేద విజ్ఞాన విస్తరణలో పరస్పర సహకారం కోసం 28 దేశాలతో అవగాహన ఒప్పందాలూ కుదిరాయి.
మిత్రులారా,
ఆయుర్వేదం, యోగా ప్రయోజనాలు దేశంలోని ప్రతి పౌరుడికీ అందేలా చూడటమే మా ప్రయత్నం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ నేడు ప్రపంచస్థాయి ఉద్యమంగా ఆవిర్భవించింది. దీని ఫలితంగా ఆయుర్వేదం, ప్రకృతి వైద్యానికి సహజంగానే ఆదరణ పెరుగుతోంది.
మిత్రులారా,
అంతటా ఇంత ప్రతిభ, ఉత్సాహం ఉన్న సందర్భంలో... యోగాను ప్రోత్సహించడం, దాని గురించి ప్రచారం చేయడంతో పాటు, అవసరాలకు అనుగుణంగా నిబంధనల్లోనూ మేం అనేక మార్పులు చేశాం. దేశంలో యోగాసనాలను ఒక క్రీడా పోటీగానూ గుర్తించాం. ఖేలో ఇండియా, జాతీయ క్రీడల వంటి పోటీల్లో యోగాసనాలకు కొత్త అవకాశాలు కల్పించాం. ఈ మార్పులు దేశానికి ఎంతో కీలకమైనవి. కొద్ది రోజుల కిందటే అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ యోగా పోటీలు జరిగాయి. అవి చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఇటీవల ఉజ్బెకిస్థాన్ వెళ్లినప్పుడు, యోగాలో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆ దేశం... తమ విజేతలు, స్వర్ణ పతక విజేతలందరినీ ఒకే చోట సమావేశపరిచింది. నేను ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా, ప్రతిచోటా యోగా ఒక చర్చనీయాంశంగా మారిందనడానికి ఇదే నిదర్శనం. ఇది యోగాతో అనుబంధం ఉన్నవారు క్రీడా పోటీల్లో పాల్గొనడానికి కొత్త మార్గాలనూ అందించింది.
మిత్రులారా,
యోగా మాదిరిగానే భారత ప్రభుత్వం ఆయుర్వేదాన్నీ నిరంతరం ప్రోత్సహిస్తోంది. మన దేశంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ... వాటిపై ఆసక్తి ఉన్నవారూ, వాటి గురించి బాగా తెలిసిన వారూ వాటికి తగినంత ప్రాధాన్యమివ్వడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత... తొలిసారిగా దేశంలో ఆయుష్ కోసం మేం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ఆయుర్వేదానికి సంబంధించిన పరిశోధనలను, ఆయుర్వేద ఆధారిత పేటెంట్లనూ మేం ప్రోత్సహించాం. నేడు ఆ కృషి ఫలితాలను మనం కళ్లారా చూస్తున్నాం. భారత్ నుంచి ఆయుష్, మూలికా ఉత్పత్తుల ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయి. ఆయుష్ రంగానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అనేక లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. భారతీయ కుటుంబాలు తరతరాలుగా తమ ఆహారపు అలవాట్లలో, ఇంటి సంప్రదాయాల్లో ఉపయోగిస్తున్న మన పసుపు కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఊహకైనా అందని స్థాయిలో... నేడు భారత్ పసుపును ఎగుమతి చేస్తోంది. పసుపు ఎగుమతులు నిరంతరం వృద్ధి చెందుతున్నాయి. పసుపు ఉత్పత్తి, నాణ్యత, ఎగుమతులకు కొత్త ఊపునిచ్చేందుకు మేం జాతీయ పసుపు బోర్డునూ ఏర్పాటు చేశాం.
మిత్రులారా,
మన ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలు, ఆధునిక పరిశోధనల ప్రయోజనాలను మానవాళికి అందించడంతో పాటు... ఈ రంగాల్లో మన యువతకు గల అవకాశాలనూ మనం అందిపుచ్చుకోవాలి. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం 'ఈ-ఆయుష్ వీసా' సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల విదేశీయులు వైద్య చికిత్స కోసం భారత్‌కు రావడం మరింత సులభతరం అవుతోంది. జామ్‌నగర్‌లో... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేశాం. ఈ కేంద్రం ద్వారా సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం.
మిత్రులారా,
నేడు దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఒకే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ లక్ష్యం 'వికసిత్ భారత్' నిర్మాణం! ప్రపంచ బ్యాంకు ఇటీవలి నివేదిక ఈ లక్ష్యానికి కొత్త ఊపునిచ్చింది. గత 12–13 సంవత్సరాల్లో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారనీ, ఇది చాలా పెద్ద సంఖ్య అని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఈ కోట్లాది కుటుంబాల ముందు ఇప్పుడు మెరుగైన జీవనం కోసం కొత్త అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి, తమ కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి వారికి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఒక ప్రాధాన్యతగా మార్చడమే మా ప్రయత్నం. ఇందులో యోగా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. యోగా మనల్ని రోగాల నుంచి విముక్తి చేస్తుందనీ... విపరీతమైన కోరికలు, వ్యసనాల నుంచీ విముక్తి చేస్తుందని నేను ఎప్పుడూ చెబుతుంటాను. పైసా ఖర్చు లేకుండా లభించే అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య సంజీవని యోగా.
'ప్రశాంతి కుటీరం' ఈ మహాయజ్ఞంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ సంస్థ ద్వారా అనేక కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ తగినంత సహకారం అందిస్తున్నారు. ఈ కృషిలో వారి సహకారం ఎంతో విలువైనది. మీరు ఇప్పటి నుంచే కొత్త లక్ష్యాల కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ప్రారంభించాలని నేను కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా... వెళ్లే ముందు డాక్టర్ నాగేంద్ర జీకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాను. నిజానికి, డాక్టర్ నాగేంద్ర జీ కొద్ది రోజుల కిందటే నాకు ఒక లేఖ రాశారు. తాను మునుపటి కంటే ఇప్పుడు మరింత యువకుడిలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన లేఖలో రాశారు. ఆయన యువశక్తి ప్రశాంతి కుటీరానికే పరిమితం కాకుండా యావత్ దేశానికీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రశాంతి కుటీరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మన దేశం 'వికసిత్ భారత్'గా మారేలా మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. 'వికసిత్ భారత్' దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, మీ రాబోయే 25 సంవత్సరాలు ఎలా ఉండాలో ఇప్పుడే మీరు ప్రణాళిక వేసుకోండి. ఈ లక్ష్యానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. తద్వారా మీరు అనుసరించే మార్గం దేశాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది, ప్రశాంతి కుటీరం 75వ ఏట అడుగుపెట్టే మీ రాబోయే 25 ఏళ్ల ప్రయాణం... 'వికసిత్ భారత్'కు ఒక శక్తిమంతమైన ఆధారంగా మారుతుంది. మీరంతా ఈ దిశగా ఆలోచించాలని నేను కోరుతున్నా. ఈ దృఢ విశ్వాసంతో... స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పూజ్యులు శేషాద్రి జీ పాదాలకు మరోసారి భక్తిపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***