సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజా పరిపాలనలో విశేష ప్రతిభకు గుర్తింపుగా అందించే ప్రధానమంత్రి పురస్కారాలు-2026 కోసం వెబ్-పోర్టల్ ప్రారంభం

2026 సంవత్సరానికి, ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు అందించే 'ప్రధానమంత్రి పురస్కారాల' పథకం ద్వారా మూడు విభాగాల్లో ప్రభుత్వ అధికారులకు మొత్తం 16 పురస్కారాలను అందించడం లక్ష్యం

విభాగాలు, పురస్కారాల వివరాలు:

విభాగం-1: 12 ప్రాధాన్యతా రంగ కార్యక్రమాల కింద జిల్లాల సమగ్ర అభివృద్ధి (05 పురస్కారాలు)

విభాగం-2: ఆకాంక్షాత్మక మండలాల కార్యక్రమం (05 పురస్కారాలు)

విభాగం-3: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలు (06 పురస్కారాలు).

జిల్లాల సమగ్ర అభివృద్ధి విభాగం కింద, జిల్లాల పనితీరును అంచనా కోసం 9 కొత్త పథకాల జోడింపు

తమ సంబంధిత ఆవిష్కరణల విభాగంలో పాల్గొననున్న కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, జిల్లాలు

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 9:06PM by PIB Hyderabad

ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా అందించే 'ప్రధానమంత్రి పురస్కారాలు - 2026' కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం వెబ్-పోర్టల్ (https://pmawards.gov.in/) ను రూపొందించింది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) ఈ రోజు అధికారికంగా ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో... భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల అధికారులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన సంస్కరణల శాఖ ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు/జిల్లా మేజిస్ట్రేట్‌లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 750 వేర్వేరు ప్రాంతాల నుంచి 2,000 మందికి పైగా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా అందించే 'ప్రధానమంత్రి పురస్కారాలు - 2026' కింద... మొత్తం 16 పురస్కారాలను అందించనున్నారు. ఈ పురస్కారాల కోసం 2024 ఏప్రిల్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు కాలపరిమితిని పరిగణలోకి తీసుకుంటారు.

'జిల్లాల సమగ్ర అభివృద్ధి' విభాగాన్ని సమూలంగా పునరుద్ధరించారు. 'ప్రధానమంత్రి పురస్కారాలు - 2026' కోసం కొత్తగా చేర్చిన 9 పథకాల్లో — స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్), అమృత్, జ్ఞాన్ భారతం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, టీబీ ముక్త్ భారత్ అభియాన్, మూడు విభాగాల కింద పంటల వైవిధ్యీకరణ, పీఎం శ్రీ, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ), నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ఐగాట్ కింద సామర్థ్య నిర్మాణం భాగంగా ఉన్నాయి. ఇక పీఎంఏ-2025 నుంచి పీఎంఏ-2026కు కొనసాగించిన 3 పథకాల్లో హర్ ఘర్ జల్ యోజన, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, సాక్షమ్ అంగన్‌వాడీ-పోషణ్ 2.0 పథకాలు భాగంగా ఉన్నాయి.

'ప్రధానమంత్రి పురస్కారాలు - 2026' కోసం ఆమోదించిన పథకాలు 'ప్రధానమంత్రి పురస్కారాలు - 2027' కూ కొనసాగుతాయి.

ఆకాంక్షాత్మక మండలాలు గల జిల్లాలు ‘ఆకాంక్షాత్మక మండలాల కార్యక్రమం' విభాగంలో పాల్గొంటాయి. ఇది దేశంలోని 331 జిల్లాల పరిధిలో గల 513 ఆకాంక్షాత్మక మండలాలను కవర్ చేస్తుంది.

జిల్లాలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారంను రూపొందించడానికి... పీఎం పురస్కారాల పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి వీలుగా, మంత్రిత్వ శాఖలు తమ పరిమాణాత్మక, గుణాత్మక, పాలనాపరమైన ప్రమాణాలను ఈ నెల 17వ తేదీలోగా డీఏఆర్‌పీజీకి సమర్పించాలని కోరడమైనది.

'ప్రధానమంత్రి పురస్కారాలు - 2026' కింద వీటిని అందిస్తారు: (i) ట్రోఫీ (ii) ప్రశంసా పత్రం (iii) పురస్కారం పొందిన జిల్లా లేదా సంస్థకు రూ. 20 లక్షల ప్రోత్సాహక నగదు. ఈ మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏదైనా రంగంలో ప్రాజెక్టు/కార్యక్రమం అమలు కోసం లేదా వనరుల కొరతను భర్తీ చేయడానికి ఉపయోగించాలి.

***


(రిలీజ్ ఐడి: 2336381) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil