శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యాధునిక సింక్రోట్రోన్ బీమ్‌లైన్‌ల అభివృద్ధి కోసం

ఇటలీలోని ఎలెట్ట్రా 2.0లో సహ-భాగస్వామిగా 7 మిలియన్ యూరోలకు పైగా నిధులు కేటాయించిన భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి రాబోయే ఐదేళ్లలో అధునాతన పరిశోధన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టనున్న భారత్

అప్‌గ్రేడ్ చేసిన ఈ సదుపాయాలతో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ బయాలజీ రంగాల్లో మరింత విస్తరించనున్న పరిశోధన అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 NOV 2026 3:10PM by PIB Hyderabad

'ఎలెక్ట్రా 2.0' కార్యక్రమం కింద ఇటలీకి చెందిన 'ఎలెక్ట్రా సింక్రోట్రోన్ ట్రైస్టే'తో పరిశోధన బీమ్‌లైన్‌ల పునరాభివృద్ధిలో సహ-భాగస్వామిగా పాల్గొననున్నట్లు భారత్ ప్రకటించింది. 2026-27 నుంచి రాబోయే ఐదేళ్లలో 7 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి అధునాతన శాస్త్రీయ సహకారం పట్ల తన నిబద్ధతను భారత్ మరోసారి చాటుకుంది.

నిన్న ఎలెట్రా సింక్రోట్రోన్ ట్రైస్టేను సందర్శించిన సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ప్రకటన చేశారు. పరిశోధన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల సామర్థ్యాల మెరుగుదలకు భారత్ భాగస్వామ్యం తోడ్పడుతుంది. ఇది భారత్-ఇటలీ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న శాస్త్రీయ భాగస్వామ్యంలో కీలకమైన నూతన దశను సూచిస్తుంది.

నవీకరించిన ఈ సదుపాయాలు... రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ బయాలజీ, ఇతర శాస్త్రీయ రంగాల్లో పరిశోధనకు నూతన మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తాయి. దీనివల్ల భారత్ సహా ఇతర దేశాల పరిశోధకులకూ ప్రయోజనం చేకూరుతుంది.

ఎలెక్ట్రా 2.0 కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యం... భారతీయ పరిశోధనా బృందాలు, ఇటాలియన్ కేంద్రానికి మధ్య 25 ఏళ్లకు పైగా ఉన్న శాస్త్రీయ సహకారానికి కొనసాగింపు. 1998 నుంచి భారతీయ శాస్త్రవేత్తలు ఎలెక్ట్రాలో పరిశోధన ప్రయోగాలు నిర్వహిస్తూ, ఇప్పటికీ ఇక్కడి సదుపాయాలను వినియోగించుకుంటున్నారు. ఇటలీ తర్వాత ఎలెక్ట్రాను అత్యధికంగా వినియోగించుకుంటున్న రెండో దేశంగా భారత్ కొనసాగుతోంది. ఇది ఈ కేంద్రంతో మన శాస్త్రీయ సమాజానికి ఉన్న నిరంతర అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది.

భారతీయ పరిశోధనా బృందాల నుంచి ఎలెక్ట్రాకు అందిన 1,100కు పైగా ప్రయోగాత్మక ప్రతిపాదనల ద్వారా ఈ సహకారం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ప్రతిపాదనల సమర్పణలో 54,140 ప్రతిపాదనలతో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. 1,098 ప్రతిపాదనలతో ఫ్రాన్స్ మూడో స్థానంలో ఉంది.

ఎలెక్ట్రా 2.0 కార్యక్రమం కింద... ప్రస్తుతం భారత్-కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్ఆర్‌డీ2, ఎక్స్‌ప్రెస్ బీమ్‌లైన్‌ల సేవలను నిలిపివేసి, వాటి స్థానంలో మెరుగైన సామర్థ్యాలతో కూడిన రెండు కొత్త బీమ్‌లైన్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మాక్రోమాలిక్యులర్ క్రిస్టలోగ్రఫీ కోసం 'మైక్రో-ఎక్స్ఆర్‌డీ' అనే మైక్రోఫోకస్ బీమ్‌లైన్, అధిక-పీడన వివర్తనం కోసం 'ఎక్స్‌ప్రెస్ సూపర్‌బెండ్ (ఎక్స్‌ప్రెస్-ఎస్‌బీ)' అనే బీమ్‌లైన్ అందుబాటులోకి రానున్నాయి.

ఎలెక్ట్రాలో ప్రత్యేక పరిశోధన మౌలిక సదుపాయాల కోసం భారత్ గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ పునరాభివృద్ధి ఒక కొనసాగింపు. ప్రస్తుతం ఉన్న ఎక్స్ఆర్‌డీ2, ఎక్స్‌ప్రెస్ బీమ్‌లైన్‌లనే రెండు అత్యాధునిక డిఫ్రాక్షన్ బీమ్‌లైన్‌ల నిర్మాణం కోసం ఇటలీతో కలిసి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) సుమారు రూ. 22 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. 2016 అక్టోబర్ 20న డీఎస్‌టీ కార్యదర్శి ఇటలీ పర్యటన సందర్భంగా ఈ రెండు బీమ్‌లైన్‌లను సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ బీమ్‌లైన్‌లు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ పరిశోధకులు వీటిని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 50 నుంచి 60 మంది భారతీయ శాస్త్రవేత్తలు ట్రైస్టేలోని ఈ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పరిశోధన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ఇండో-ఇటాలియన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ (ఈపీవోసీ) ద్వారా ఎలెక్ట్రా సదుపాయాలను భారతీయ పరిశోధకులు వినియోగించుకునేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తోడ్పాటునందించింది. ఈపీవోసీ 2022-2024 కింద... ఎలెక్ట్రా బీమ్‌లైన్‌లలో కేటాయించిన షిఫ్టుల్లో ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం 50 మంది భారతీయ పరిశోధకుల పర్యటనల కోసం (ప్రతి సెమిస్టర్‌లో 25 మంది చొప్పున) మూడేళ్లలో డీఎస్‌టీ రూ. 2 కోట్లు మంజూరు చేసింది.

ఈపీవోసీ 2025-2027 కార్యక్రమంలోనూ ఈ కేంద్రంలో ప్రయోగాలు నిర్వహించే భారతీయ పరిశోధకులకు మద్దతునిచ్చే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం రాబోయే మూడేళ్ల కాలానికి రూ. 1.5 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.

ఎలెక్ట్రా 2.0 కార్యక్రమం కింద భారత్-కేంద్రిత బీమ్‌లైన్‌ల పునరాభివృద్ధిలో పాల్గొనేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇప్పటికే తన అంగీకారాన్ని తెలిపింది. ఈ మేరకు ఒక అంగీకార పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) పై సంతకాలు పూర్తయ్యాయి. ఈ పర్యటన సందర్భంగా, రాబోయే ఐదేళ్లలో 7 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలెక్ట్రా 2.0 కార్యక్రమం పట్ల తన నిబద్ధతను భారత్ పునరుద్ఘాటించింది.

ప్రస్తుత బీమ్‌లైన్‌ల విజయవంతమైన అభివృద్ధి, వినియోగం ద్వారా పొందిన అనుభవంతో... భారత్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించనుంది. ఇరు దేశాల మధ్య తదుపరి దశ శాస్త్రీయ సహకారం కోసం ఉన్నతీకరించిన పరిశోధన మౌలిక సదుపాయాల కల్పనకు ఇది తోడ్పడుతుంది.

ఎలెక్ట్రా 2.0 కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారత్ ఈ ఇటాలియన్ పరిశోధనా కేంద్రంతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. అధునాతన, ప్రత్యేక శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో భారతీయ, అంతర్జాతీయ పరిశోధకులకు విస్తృత అవకాశాలను అందించడానికీ ఇది తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2336372) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil