నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 5:49PM by PIB Hyderabad
మాదక ద్రవ్యాల అంతర్జాతీయ ముఠాలపై భారీ దాడులలో భాగంగా సియెర్రా లియోన్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఒక విదేశీ మహిళ నుంచి 22 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదకద్రవ్యం అనేక కోట్ల రూపాయల విలువ చేస్తుందని వారు పేర్కొన్నారు. విమానాశ్రయంలో భద్రత తనిఖీ నుంచి తప్పించుకునే దిశగా ఆమె ఓ కొత్త మోసపు పద్ధతిలో నకిలీ దౌత్య పత్రాలతో అధికారులను బుకాయించేందుకు యత్నించింది.
ఈ మేరకు తానొక దౌత్య కొరియర్‌నని చెబుతూ- “డిప్లొమాటిక్ మెయిల్”, “డు నాట్ ఓపెన్ వితవుట్ అథారిటీ” అని రాసి ఉన్న ఓ బ్రీఫ్‌కేస్ వంటి పెద్ద పెట్టెతో విమానం నుంచి దిగింది. అటుపైన తనిఖీ నుంచి తప్పించుకునేందుకు తాను తెచ్చింది “ఐక్యరాజ్యసమితి దౌత్య కొరియర్‌కు చెందినద”ని పేర్కొంటూ నకిలీ ధ్రువ పత్రాలను కూడా సిబ్బందికి సమర్పించింది.
అయితే, ఈ ప్రయాణికురాలి గురించి పటిష్ట నిఘా సమాచారం ప్రాతిపదికన ‘డీఆర్‌ఐ’ అధికారులు సముచిత పద్ధతిలో ఆ బ్రీఫ్‌కేస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనేక పొరల ప్లాస్టిక్ ప్యాకింగ్‌తో గల 22 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తెల్లటి, ఇటుక ఆకారంలో గల పదార్థాన్ని నిశితంగా పరీక్షించాక ఇది కొకైన్ మాదకద్రవ్యంగా నిర్ధారించారు.
అనంతరం ‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్-1985’ చట్టం నిబంధనల ప్రకారం- ఈ 22 ప్యాకెట్ల నిషేధిత కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటుపైన 1985 నాటి ‘ఎన్‌డీపీఎస్’ చట్ట నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కట్టుదిట్టమైన తనిఖీ విధానాల నుంచి తప్పించుకోవడానికి రకరకాల కొత్త ఎత్తులతో అక్రమ రవాణా ముఠాలు అనుసరిస్తున్న మార్గాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘డీఆర్‌ఐ’ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిఘా ఆధారిత చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ సంస్థాగత లోపాల మాటున అక్రమ వ్యాపారానికి యత్నించే అంతర్జాతీయ సిండికేట్ల నిర్మూలనకు దృఢమైన చర్యలు తీసుకుంటోంది.
*****