గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జన్‌జాతీయ గౌరవ్ పఖ్‌వాడా - 2026’.. గిరిజన వారసత్వాన్ని గౌరవించడానికి, సమాజాలకు సాధికారతను కల్పించడానికి, సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారు వరకు చేర్చే దేశవ్యాప్త కార్యక్రమం

వారసత్వం నుంచి సాధికారత వరకు..
‘జన్ జాతీయ గౌరవ్ దివస్-2026’కు గుర్తుగా
300కు పైగా అభివృద్ధి పథకాలు, 2 జాతీయ డిజిటల్ వేదికలు,

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 7:45PM by PIB Hyderabad

‘జన్‌జాతీయ గౌరవ్ పఖ్‌వాడా’ను (గిరిజనుల గౌరవ పక్షోత్సవం) 2026 నవంబర్ 1 నుంచి పదిహేను రోజుల పాటు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ధర్‌తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న ఈ ఉత్సవ ముగింపు కార్యక్రమం ఉంటుంది.  ఈ పక్షోత్సవం ఒక స్మృతి ఉత్సవాని కన్నా మించిన విశిష్ట,  ప్రచార కార్యక్రమం. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి ప్రయోజనాలను చివరి స్థాయిలోని గిరిజన కుటుంబాలకు అందేటట్లు చూడడంతో పాటు ప్రభుత్వ పథకాలు, హక్కులపై గిరిజనులు, విద్యార్థులు, పౌరులకు అవగాహనను ఏర్పరచడంపై జన్ జాతీయ పఖ్‌వాడా సందర్భంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
ధర్‌తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతిని స్మరించుకోవడానికి ఏటా నవంబర్ 15ను ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ (జేజేజీడీ) గా జరపాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించింది. ఆ రోజున.. భారతదేశ స్వాతంత్య్ర సమరానికి తోడ్పాటును అందించిన గిరిజన వీరులను, దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో గిరిజన సమాజాల చెక్కుచెదరని స్థానాన్ని గౌరవించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌ ఒక దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఇది భారతదేశంలో గిరిజనుల సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదుర్కొని నిలచే స్వభావాన్ని పండుగ చేసుకోవడంతో పాటు పీఎమ్-జేఏఎన్ఎమ్ఏఎన్ (పీఎమ్-జన్‌మన్), ధర్‌తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ వంటి పరివర్తన ప్రధాన కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తోంది. గత అయిదు సంవత్సరాల్లో చూస్తే, 021లో రాంచీలో, 2022, 2023సంవత్సరాల్లో ఖూంటీలో, 2024లో జముయిలో, 2025లో దీదీపారాలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ (జేజేజీడీ)ని నిర్వహించారు.  
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని దృష్టిలో పెట్టుకొని 2024-25 సంవత్సరాన్ని ‘జన్ జాతీయ గౌరవ్ వర్ష్‌’గా పాటించారు. 28 కన్నా ఎక్కువ జాతీయ స్థాయి కార్యక్రమాలను, 2 లక్షలకుపైగా కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. వీటిలో 3 కోట్ల కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగం పంచుకున్న గిరిజన సమాజాల భూమికను, వారి జ్ఞానాన్ని, కళలను, ప్రకృతితో వారికి ఉన్న సద్భావనను గుర్తించడానికి జన్‌జాతీయ గౌరవ్ దివస్ ఒక ప్రతీకగా నిలుస్తోంది.
ఈ సంవత్సరంలో జేజేజీడీ ఉత్సవాల సందర్భంగా పక్షం రోజుల పాటు అనేక జాతీయ కార్యక్రమాల్ని మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ప్రతిపాదిత కార్యక్రమాల వివరాలు:-
     • నేడు, అంటే నవంబర్ 12న, దాదాపు 200 మంది ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఈఎమ్ఆర్ఎస్)కు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌లో గౌరవనీయ రాష్ట్రపతితో  సమావేశమవుతారు.
     •  నేడు, రేపు.. అంటే నవంబర్ 12, 13 తేదీల్లో జాతీయ గిరిజన సాహిత్య ఉత్సవాన్ని న్యూఢిల్లీలోని హ్యాబిటాట్ సెంటర్లో నిర్వహించనున్నారు. దీనిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన రచయితలు పాల్గొంటారు. ‘‘ట్రైబల్ లివింగ్ హెరిటేజ్ అండ్ నేషనల్ ట్రైబల్ లాంగ్వేజ్ రిపాజిటరీలో ఆది వాణిని బలోపేతం చేయడం’’ అంశంపై జాతీయ కార్యశాల (వర్క్‌షాప్)ను ఐఐటీ, ఢిల్లీలో నిర్వహిస్తారు.
     •  నవంబర్ 14న రాణి దుర్గావతి ఆదివాసీ మహిళా సమ్మేళనం ఏర్పాటైంది. ఈ సమ్మేళనంలో 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 500 మంది గిరిజన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సమావేశమవుతారు. వారు మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం, మహిళల నాయకత్వంలోని ఔత్సాహిక వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడంపై చర్చిస్తారు.
     •  అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ‘స్వాస్థ్య-పోషణ్ సేవా సంగమ్’ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యసంరక్షణ, పోషణ, ప్రభుత్వ పథకాలపై శిబిరాలను పీఎమ్-జన్‌మన్ మల్టీపర్పస్ సెంటర్లలో నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.. (పీవీటీజీస్)కు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.
     •  నవంబర్ 1, 2 వ తేదీలలో గిరిజన చికిత్సకులకు సామర్థ్యాలను పెంచే ఉద్దేశంతో ఒక సమ్మేళనాన్ని నిర్వహించారు. 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 1,500 మంది సాంప్రదాయిక చికిత్సకులకు శిక్షణను అందించారు.  లక్ష మంది చికిత్సకులకు శిక్షణను ఇచ్చి, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
     •  ‘ధర్‌తీ ఆబా జన్‌భాగీదారీ అభియాన్’లో భాగంగా ‘ఆది సేవా సమయ్’, ‘ఆది సేవా దిన్’ కార్యక్రమాల ద్వారా గిరిజన గ్రామాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందింపచేయనున్నారు. దీనికి అదనంగా సుమారు 76,963 గ్రామాలలో పనిచేస్తున్న దాదాపు 1.54 లక్షల మంది ‘ఆది కర్మయోగి’ స్వచ్ఛంద సేవకులకు రాష్ట్ర పరిపాలనా శిక్షణ సంస్థల ద్వారా శిక్షణను ఇస్తున్నారు.
     •  ఉపకార వేతనాలను అందుకోవడానికి 73 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. వాటిలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను దాఖలు చేయడంలోను, ‘ఆధార్’‌ను లింక్ చేసే ప్రక్రియలోను మార్గదర్శనం చేస్తున్నారు. 200 నుంచి 300 ఔషధీయ మొక్కల జాతుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని ఒడిశాలోని కోరాపుట్‌లో సీఎస్ఐఆర్-ఎన్‌బీఆర్ఐ సహకారంతో మొదలుపెట్టనున్నారు.
దీనికి అదనంగా జన్‌జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా, వివిధ రాష్ట్రాలలో  గిరిజన సమాజాల కోసం 300 కన్నా ఎక్కువ  అభివృద్ధి ప్రాజెక్టులను ఆరంభించనున్నారు. వాటిలో 228 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు, 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేపడతారు. ఈ ప్రాజెక్టుల్లో.. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్‌లో గిరిజన పరిశోధన సంస్థ నూతన భవనంతో పాటు, మిజోరంలోని కేల్సియాలో  గిరిజన స్వాతంత్య్ర యోధురాలు రోపుయిలియానీ మ్యూజియానికి సంబంధించిన కార్యక్రమం కూడా ఉంది.
రెండు జాతీయ డిజిటల్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. ఐసీఎమ్ఆర్ సహకారంతో ‘జన్-హెచ్ఐటీ’ (జన్‌జాతీయ హెల్త్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ) వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇది గిరిజన సమాజాల ఆరోగ్య సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే భారతదేశ తొలి డిజిటల్ వేదిక. 20 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. జాతీయ ఎఫ్ఆర్ఏ డిజిటల్ వేదిక.. అటవీ హక్కుల చట్టం-2006లో భాగంగా అటవీ హక్కుల క్లెయిములకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ఒకే వ్యవస్థలో చేరుస్తుంది. దీనిలో గ్రామసభలో దరఖాస్తును దాఖలు చేయడం మొదలు, డిజిటల్ రూపంలో సంతకాలు పెట్టిన హక్కుల ప్రమాణపత్రాలను జారీ చేయడం వరకూ.. అన్ని దశలను చేర్చుతారు.
దీనికి తోడు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ గిరిజన పరిశోధన సంస్థల ద్వారా పక్షోత్సవాన్ని పాటిస్తున్నాయి. దీనిలో భాగంగా 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 160కి పైగా కార్యకలాపాలను నిర్వహించాలని సంకల్పించారు. వీటిలో ఒక లక్ష మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ కార్యకలాపాల్లో.. సాంస్కృతిక  ఉత్సవాలు, ప్రదర్శనలు, శ్రద్ధాంజలి కార్యక్రమాల మొదలు పాఠశాలలు, ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు (ఈఎమ్ఆర్ఎస్), వసతిగృహాల్లో పోటీల నిర్వహణ, సంక్షేమ, ఉపాధి కల్పన శిబిరాల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్త గిరిజన సంబరం, గోవాలో ఆదివాసీ కళా, ఖేల్ సమాగమ్, ఒడిశాలో భగవాన్ బిర్సా ముండా మండపం, షిల్లాంగ్‌లో గిరిజన సంగీతోత్సవం, గుజరాత్‌లో అమ్దావాద్ హాట్‌లో గిరిజన కళ, హస్తకళా మహోత్సవం ముఖ్య ఆకర్షణలుగా ఉన్నాయి. రాష్ట్రాలలో ఆధార్, స్కాలర్‌షిప్ శిబిరాలను, సికిల్ సెల్ పరీక్షా శిబిరాలను, పీవీటీజీస్‌కు ఆయుష్మాన్ కార్డు మంజూరుకు ఉద్దేశించిన శిబిరాలను, అటవీ హక్కుల విషయంలో చట్టం పట్ల అవగాహనను కలిగించే శిబిరాలను ఏర్పాటు చేస్తారు.
ప్రజలు తమ ప్రాంతంలో ఏర్పాటైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మొదలు, ‘మైగవ్’ వెబ్‌సైట్లో జేజేజీడీ క్విజ్‌లో పాల్గొనడం, ప్రతిజ్ఞ చేయడం, గిరిజన చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించడం, #JanjatiyaGauravDivas తో పాటు #JJGD2026లో తమ కథలను ప్రస్తావించడం ద్వారా ఈ ఉత్సవంలో భాగస్తులు కావాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2335406) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil