రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డు వినియోగదారుతో అనుచిత ప్రవర్తన.. బీజ్‌వాసన్ యూజర్ ఫీ వసూలు ఏజెన్సీపై నెల పాటు నిషేధం విధించిన ఎన్‌హెచ్ఏఐ

ఏజెన్సీతో పాటు యజమానులు, డైరెక్టర్లను ఎన్‌హెచ్ఏఐ టెండర్లలో పాల్గొనకుండా
ఏడాది పాటు నిషేధాన్ని ప్రతిపాదిస్తూ
సంజాయిషీ నోటీసు జారీ చేసిన ఎన్‌హెచ్ఏఐ

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 4:33PM by PIB Hyderabad

వినియోగదారుల నుంచి రుసుమును వసూలు చేసే ఏజెన్సీకి వ్యతిరేకంగా భారతదేశ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) కఠిన చర్యలను తీసుకుంది. దీనిలో భాగంగా ఎన్‌హెచ్ఏఐ ఆధీనంలోని ప్రస్తుత టెండర్లు, లేదా భావి టెండర్ల ప్రక్రియలో ఒక నెల పాటు పాలుపంచుకోకూడదంటూ మెస్సర్స్ రిద్ధి సిద్ధి అసోసియేట్స్ పై నిషేధాన్ని విధించారు. ఏజెన్సీకి రూ.15 లక్షల జరిమానాను కూడా విధించారు. 2026 నవంబర్ 5న ఎన్‌హెచ్-248బీబీలోని బీజ్‌వాసన్ ఫీ ప్లాజాలో రహదారి వినియోగదారులతో ఏజెన్సీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఎన్‌హెచ్ఏఐ పైన ప్రస్తావించిన మేరకు చర్యలు తీసుకుంది.

సంఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఎన్‌హెచ్ఏఐ ఒక షో కాజ్ నోటీసును కూడా జారీ చేసింది. దానిలో ఏజెన్సీని, దాని యజమానులు/ డైరెక్టర్లను ఒక సంవత్సరం పాటు ఎన్‌హెచ్ఏఐ భావి టెండర్లలో పాలుపంచుకోకుండా నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రస్తావించారు. ఏజెన్సీ ఈ నెల 14న ఫీ ప్లాజాను నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీకి అప్పగించాలని కూడా ఆదేశించారు.

కాంట్రాక్టు అగ్రిమెంటు ప్రకారం, వినియోగదారుల వద్ద నుంచి సుంకాన్ని వసూలు చేసే ఏజెన్సీ ఫీ ప్లాజాలో నియమించిన ఉద్యోగుల ప్రవర్తనతో పాటు, క్రమశిక్షణకు కూడా బాధ్యతను తీసుకోవాలి. కాగా జరిగిన సంఘటన .. ఒప్పందపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉండటంలో, క్రమశిక్షణకు పూచీ పడటంలో, సముచిత పర్యవేక్షణను వహించడంలో ఏజెన్సీ ఘోరంగా విఫలం అయిందని తెలియజేస్తోంది.

జాతీయ రహదారుల్ని ఉపయోగించుకొనే వారికి క్రమం తప్పని సురక్షిత ప్రయాణానుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎన్‌హెచ్ఏఐ పునరుద్ఘాటించింది. జాతీయ రహదారులను ఉపయోగించినందుకు వాహన యజమానుల నుంచి దారి సుంకాన్ని వసూలు చేసే కేంద్రాలన్నింటి వద్ద ఏ విధమైన దుష్ప్రవర్తన, లేదా క్రమశిక్షణరాహిత్యం చోటుచేసుకొంటే అలాంటి సందర్భాలను ఎంతమాత్రం సహించేదిలేదని కూడా ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.

***


(రిలీజ్ ఐడి: 2335276) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil