శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిశ్రామిక వ్యర్థాలను సుస్థిర నిర్మాణ వనరులుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాలపై భారత్, నార్వే సంయుక్త అన్వేషణ

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 10:38AM by PIB Hyderabad

‘‘సిమెంటు, నిర్మాణ రంగంలో వ్యర్థాల నుంచి వనరుల పరిష్కారాలు’’ అనే అంశంపై భారత్–నార్వే చర్చలను న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లో 2026 నవంబర్ 10న భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్), సిన్‌టెఫ్, నార్వే పరిశోధనా మండలి నిర్వహించాయి. సీఎస్ఐఆర్, సిన్‌టెఫ్, నియంత్రణ సంస్థలు, సిమెంటు, నిర్మాణ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులను ఈ వేదిక ఒక్క చోటకు చేర్చింది. ఈ చర్చల్లో సుస్థిర వ్యర్థ నిర్వహణ, వనరుల పునరుద్ధరణ కోసం సహకార విధానాలను అన్వేషించారు. మే నెలలో నార్వే పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నార్వే ప్రధాన మంత్రి శ్రీ జోనాస్ గార్ స్టోర్ నిర్దేశించిన దార్శనికతకు అనుగుణంగా ఈ చర్చలు సకాలంలో జరిగాయి. ఆ దార్శనికతలో పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ సాంకేతిక, పరిశోధనలను కేంద్రంగా భారత్-నార్వే సంబంధాన్ని హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచారు. ఈ చర్చలో సీఎస్ఐఆర్–సీబీఆర్ఐ ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు.

 

ప్రారంభ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ ఐఎస్‌టీఏడీ అధిపతి డాక్టర్ రామ స్వామి బన్సల్, న్యూఢిల్లీలోని నార్వే ఎంబసీకి చెందిన డాక్టర్ అర్విన్ గాడ్గిల్, నార్వేలోని సిన్‌టెఫ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కారే హెల్గే కార్స్‌టెన్సెన్, సీఎస్ఐఆర్–సీబీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ ప్రదీప్ కుమార్ తదితరులు ప్రసంగించారు. పరిశోధన ఫలితాలను ఆచరణాత్మకమైన, విస్తరించదగిన పరిష్కారాలుగా మార్చడంపై దృష్టి సారించి, సీఎస్ఐఆర్ సంస్థలు, సిన్‌టెఫ్, పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో ఉమ్మడి సాంకేతిక ఆధారిత ప్రతిపాదనల ద్వారా భారత్-నార్వే సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

సరళ ఆర్థిక వ్యవస్థ నుంచి పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా వచ్చిన మార్పులతో పాటు నిర్మాణ, పారిశ్రామిక వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చాల్సిన ఆవశ్యకతను ప్రొఫెసర్ ఆర్ ప్రదీప్ కుమార్ వివరించారు. నిర్మాణం, కూల్చివేత (సీ అండ్ డీ) వ్యర్థాలు, స్టీల్ స్లాగ్, ఫ్లై యాష్, రెడ్ మడ్, ఇతర పారిశ్రామిక అవశేషాలను ఉపయోగించుకొనే విధానాలు, ప్రాసెసింగ్ టెక్నాలజీలు, ప్రామాణీకరణ, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, మార్కెట్ ఆమోదానికి సంబంధించిన సవాళ్లపై చర్చించారు.

 

"పీవోపీలు, ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలించడం" అంశంపై జరిగిన సాంకేతిక సమావేశానికి సిన్‌టెఫ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కారే హెల్గే కార్స్‌టెన్సెన్, సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో నిరంతర సేంద్రీయ కాలుష్య కారకాలు (పీవోపీలు), డీడీటీ, పీసీబీ కలుషిత పదార్థాలు, తదితర ప్రమాదకరమైన వ్యర్థాలను అనుకూల విధానాల్లో శుద్ధి చేయడానికి సిమెంట్ బట్టీల కో ప్రాసెసింగ్ సామర్థ్యంపై చర్చించారు. స్టాక్‌హోమ్ కన్వెన్షన్ ఒప్పందాలకు అనుగుణంగా భారతదేశ జాతీయ అమలు ప్రణాళికను, 2025 సీడీడబ్ల్యూ నియమాలు, సంబంధిత నిబంధనలు, నిల్వ ఉన్న పీవోపీ ఇన్వెంటరీ జాబితాను సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ సమర్పించింది. నియంత్రిత అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో ప్రమాదకరమైన సేంద్రీయ కలుషితాలను నాశనం చేయడంలోనూ, సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు బదులుగా వ్యర్థాల నుంచి లభించే ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడంలోనూ సిమెంట్ బట్టీల సామర్థ్యాన్ని సిన్‌టెఫ్ సమర్పించిన అంతర్జాతీయ అనుభవాలు తెలియజేశాయి. ఈ చర్చలు సముచితమైన సాంకేతిక నియమావళి, నియంత్రిత పారిశ్రామిక ప్రయోగాలు, ఉద్గారాల పర్యవేక్షణ, నియంత్రణల అమలు ఆవశ్యకతను కూడా తెలియజేశాయి.

 

ఫ్లైయాష్, కాపర్ స్లాగ్, రెడ్ మడ్, ప్లాస్టిక్ వ్యర్థాలు, స్టీల్ గ్రిట్, ఇతర పారిశ్రామిక ఉప ఉత్పత్తులను రోడ్డు నిర్మాణం, జియోపాలిమర్ కాంక్రీట్, ప్రత్యేక కంకర, విలువ ఆధారిత నిర్మాణ ఉత్పత్తుల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలను సీఎస్ఐఆర్–సీఆర్ఆర్ఐ, సీఎస్ఐఆర్–ఏఎంపీఆర్ఐ పరిశోధనా కార్యక్రమాలు తెలియజేశాయి. ప్రమాదకరమైన వ్యర్థాల సురక్షితమైన నిర్వహణ, తొలగింపునకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లు, సాంకేతిక అవసరాలపై సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ, పారిశ్రామిక ప్రతినిధులు చర్చించారు.

సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌పై సిన్‌టెఫ్‌కు చెందిన డాక్టర్ క్రిస్టియన్ జాన్ ఎంగెల్సెన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రీసైకిల్ చేసిన కంకర ఆధారిత నిర్మాణ ఉత్పత్తులు, మొబైల్ రీసైక్లింగ్ యూనిట్లు, మలినాలను తొలగించడానికి మెరుగైన ప్రాసెసింగ్ పద్ధతులతో సహా అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ‘‘నిర్మాణంలో స్లాగ్‌లు ఇతర ఉప ఉత్పత్తుల వినియోగం’’పై సీఎస్ఐఆర్–సీబీఆర్ఐ ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిర్మాణ సామగ్రిలో వాటి ఉపయోగాలను, పారిశ్రామిక వ్యర్థాల సుస్థిర వినియోగ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.

 

భవిష్యత్తు సహకారానికి అవకాశాలున్న అనేక ప్రాధాన్య రంగాలను ఈ చర్చలు గుర్తించాయి. వాటిలో రెండు నుంచి మూడు భారత్–నార్వే సంయుక్త పరిశోధనా ప్రతిపాదనల రూపకల్పన, హానికర వ్యర్థాల శుద్ధి కోసం పైలట్-స్థాయి ప్రదర్శన ప్రాజెక్టులు, డీడీటీ, పీసీబీ కలుషిత వ్యర్థాల తొలగింపునకు సాంకేతిక మార్గదర్శకాలు, వ్యర్థాల నుంచి తయారయ్యే నిర్మాణ సామగ్రి అభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యాలను బలోపేతం చేయడం తదితరమైనవి ఉన్నాయి.

 

ద్వైపాక్షిక పరిశోధనను, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం, పునర్వినియోగ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం, సుస్థిరమైన, వనరుల సామర్థ్యం కలిగిన సిమెంట్, నిర్మాణ రంగాల దిశగా మార్పును వేగవంతం చేయడానికి ఉమ్మడి ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమం ముగిసింది. 

***


(రిలీజ్ ఐడి: 2335013) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil