ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లోని కరణ్‌పూర్ వద్ద ఉన్న కోబ్రా ఆపరేషన్ బేస్‌లో భద్రతాదళాలతో కలసి దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం నుంచి విముక్తి పొందన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది: పీఎం
గడచిన ఏడాదిలో ఏ ఒక్క సీఆర్‌పీఎఫ్ జవానూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోలేదు, ఇలా జరగడం 47 ఏళ్లలో ఇదే తొలిసారి: పీఎం
పటిష్టమైన విధానాలు, బలమైన సంకల్పంతో దేశం సాధించిన విజయమిది: పీఎం
సేవాస్ఫూర్తితో నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారి జీవితాల్లో మనం మార్పు తీసుకొచ్చాం: ఫలితంగా నక్సలిజం బాధితులు ప్రభుత్వం, భద్రతాదళాల పక్షాన నిలిచారు: పీఎం
ఇప్పుడు మన దేశంలో 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటకు వచ్చారు, మరో వైపు నక్సల్ హింస కూడా అంతమయింది: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2026 4:04PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో కరణ్‌పూర్ వద్ద ఉన్న కోబ్రా ఆపరేషన్స్ బేస్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. బస్తర్, అబూజ్‌మడ్‌లో చేపట్టే నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు శిక్షణా స్థావరంగా, లాంఛ్‌ప్యాడ్‌గా పనిచేస్తున్న ఈ బేస్‌లో భద్రతా బలగాలతో కలసి దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు తమ ప్రియమైన వారితో కలసి దీపావళి నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. హిమాలయాల్లోని కార్గిల్, లెప్చా నుంచి తీర ప్రాంతంలోని సర్ క్రీక్, సముద్ర జలాల్లోని ఐఎన్ఎస్ విక్రాంత్ వరకు వీరులైన సైనికులతో తాను జరుపుకొన్న దీపావళి వేడుకలను గుర్తు చేసుకున్నారు. ‘‘సరిహద్దుల వద్ద, సరిహద్దుల లోపల దేశాన్ని కాపాడే రక్షకులు, భరతమాత వీర పుత్రులు. మీ అందరూ నా వాళ్లే. నా కుటుంబ సభ్యులే’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

2026 దీపావళిని ప్రత్యేకమైనదిగా ప్రధానమంత్రి వర్ణించారు. దశాబ్దాల పాటు మావోయిస్టు ఉగ్రవాదంపై జరిపిన పోరాటంలో భారత్ విజయం సాధించి, ప్రతి జిల్లాను నక్సల్ రహితంగా మార్చి, కోట్లాది మంది పౌరులు భయాన్ని జయించేలా చేసిన తర్వాత వచ్చిన తొలి దీపావళి కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుందని తెలియజేశారు. ఈ అసాధారణ విజయాన్ని సాధ్యం చేసిన లక్షలాది మంది భద్రతా సిబ్బందితో కలసి ఈ పర్వదినాన్ని నిర్వహించుకోవడానికి, 140 కోట్ల మంది పౌరుల తరఫున కృతజ్ఞతను తెలియజేయడానికి తాను వచ్చానని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘మీ త్యాగాలకు, అంకితభావానికి, సేవాస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేయడానికే నేను వచ్చాను’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 

‘ఆభ్యంతరం భయం రక్ష్యం, ఆసారం బాహ్యతో భయం’ అనే ప్రాచీన సంస్కృత సూక్తిని ఉటంకిస్తూ... అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉన్న దేశానికి వెలుపలి శత్రువులు హాని చేయలేరని వివరించారు. కానీ అంతర్గత భద్రత బలహీనంగా ఉన్నప్పుడు శత్రువులు సవాలు విసురుతారని అన్నారు. దేశం సరిహద్దుల లోపల భద్రతా బలగాలు పోషించే పాత్రను సరిహద్దుల్లోని సాయుధ దళాలతో ప్రధానమంత్రి పోల్చారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఐఆర్‌బీ, రాష్ట్ర పోలీసు బలగాలు, బస్తర్ ఫైటర్స్ కమాండోలు, మహిళా ఫైటర్స్ చేసిన అపారమైన త్యాగాలను కొనియాడారు. అలాగే దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ సేవలకు ఈ దేశం రుణపడి ఉంటుంది. కోట్లాది దేశ ప్రజలు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సహా సుమారుగా 20 రాష్ట్రాల్లో 230కి పైగా జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం విస్తరించిన చీకటి యుగాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సాయంత్రం వేళల్లో కర్ఫ్యూలు ఉండేవని, ఓటు హక్కులు లాక్కున్నారని, ఏటా సుమారుగా 2,000 దాడులు జరిగాయని, ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 1,000 మందికిపైగా సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఐఈడీ పేలుళ్లలో అనేక మంది సైనికులు తమ అవయవాలను కోల్పోయారని, 2010లో దంతెవాడలో జరిగిన వేర్వేరు దాడుల్లో 76 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, 44 మంది అమాయక ప్రజలు మరణించారని ప్రధానమంత్రి అన్నారు. 2004 నుంచి 2013 మధ్యకాలంలో ప్రతి ఏటా మరణించిన మావోయిస్టుల సంఖ్య కంటే అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య ఎక్కువ ఉండేదని, ఇది మావోయిస్టు నాయకులకు మరింత ధైర్యాన్నిచ్చిందని తెలిపారు.

 

శత్రువుల పట్ల నిష్క్రియాత్మక వైఖరిని అవలంబించి ఏ దేశమూ పురోగతి సాధించలేదని ప్రధాని అన్నారు. దానికి బదులుగా మనోధైర్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని అణచివేయాలన్నారు. 2014 తర్వాత భద్రతా దళాల్లో దశాబ్దాలుగా నాటుకుపోయిన అధిక ప్రాణనష్టం అనే ధోరణి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. దీని ఫలితంగా గడచిన ఏడాదిలో ఒక్క సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోలేదని, ఇలా జరగడం గడచిన 47 ఏళ్లలో ఇదే తొలిసారని ప్రధాని వెల్లడించారు. ఇది చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ‘‘సరైన విధానాలు, దృఢసంకల్పంతో దేశం సాధించిన విజయం ఇది. అలాగే ఇది మీ శౌర్యం, ధైర్యం, సంయమనం సాధించిన గెలుపు’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.

విజయ సాధనకు సరైన ఉద్దేశాలు, సరైన విధానాలు రెండూ అవసరమని తెలియజేస్తూ ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుందని ప్రధానమంత్రి తెలిపారు. బహిరంగంగా వెల్లడించని అనేక అంశాలతో కూడిన ఈ నిర్ణయాలు నక్సలైట్లు, వేర్పాటువాదుల నిధులపై గట్టి దెబ్బకొట్టడంతో పాటు నకిలీ కరెన్సీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశాయని చెప్పారు. “ఇది వారి ఆర్థిక మూలాను నాశనం చేయడమే కాకుండా, సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేసింది. ఫలితంగా ఆయుధాల సరఫరా నిలిచిపోవడంతో పాటు నక్సలైట్ల కదలికలు, కొత్తవారి చేరికలు తగ్గిపోయాయి” అని ప్రధాని మోదీ వెల్లడించారు.

 

అవసరమైన నిర్ణయాలన్నింటినీ తీసుకొనే కార్యాచరణ స్వేచ్ఛను ప్రభుత్వం భద్రతా బలగాలకు ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఏ తల్లీ తన బిడ్డను కోల్పోకూడదనే, ఏ కుటుంబం నాశనం కాకూడదనే, యువత ఆయుధాలు చేపట్టకూడదనే ఏకైక లక్ష్యంతో ఎలాంటి ప్రచారమూ ఆర్భాటమూ లేకుండా, అవిశ్రాంతంగా ప్రభుత్వం పనిచేసిందని వివరించారు. మావోయిస్టు ఉగ్రవాదం వెన్ను విరిచిన సున్నితమైన భద్రతా చర్యలను ప్రజాసేవా భావంతో మేళవించడం ద్వారా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియజేశారు. అలాగే బాధిత ప్రజలంతా ప్రభుత్వం, భద్రతా దళాల పక్షాన ఎలా ఐక్యంగా నిలబడ్డారో కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా సభకు హాజరైన స్థానిక ప్రజలు అందించిన కీలక సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సేవాస్ఫూర్తితో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో మేము మార్పు తీసుకొచ్చాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో పనిచేయడం ద్వారా శాంతి భద్రతలను సాధించవచ్చని, నూతన అభివృద్ధి శిఖరాలకు దేశాన్ని చేర్చవచ్చని, దేశ పురోగతిలో పేదలు, అణగారిన వర్గాల భాగస్వామ్యాన్ని విస్తరించవచ్చని ప్రధాని తెలియజేశారు. అలాగే గడచిన పన్నెండేళ్లలో దేశం సాధించిన రెండు విజయాలను ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘గడచిన 12 ఏళ్లలో నక్సలిజం, వేర్పాటువాదంపైన మాత్రమే కాకుండా... పేదరికంపై కూడా దేశం విజయం సాధించింది’’ అని శ్రీ మోదీ తెలిపారు.

 

దీపావళికి కొద్ది రోజుల ముందు విడుదలైన, విస్తృతంగా చర్చనీయాంశమైన ప్రపంచ బ్యాంకు నివేదిక గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని తెలియజేశారు.

గడచిన 12 ఏళ్లలో భారత సంక్షేమ వ్యవస్థ రూపుదిద్దుకున్న తీరును దీపావళి రంగవల్లికతో ప్రధానమంత్రి పోల్చారు. చిన్నగా, విడివిడిగా వేసే గీతలు కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించినట్లుగానే, వివిధ పథకాలు పేదల జీవితాలను తీర్చిదిద్దాయని వివరించారు. జన్ ధన్ బ్యాంకింగ్, పీఎం ఆవాస్ పక్కా ఇళ్లు, పూచీకత్తు లేని ముద్రా రుణాలు, వీధి వ్యాపారులకు స్వనిధి చేయూత, ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం, ఉచిత నెలవారీ రేషన్, బాలల విద్యా విధానాలు, స్వచ్ఛ భారత్, హర్ ఘర్ జల్ లాంటి పథకాలు అన్నీ కలిసి ఉచిత మందులు, ఉచిత విద్య, ఉచిత ఆహారాన్ని అందించాయని తెలిపారు. అదే సమయంలో ఆందోళనలను దూరం చేసి, తరతరాలుగా పేదరికంలో మగ్గిన కుటుంబాలు మరింత మెరుగైన భవిష్యత్తును పొందేలా చేశాయని పేర్కొన్నారు. ‘‘జీవితమంతా ఆందోళనలతోనే గడిపిన పేద కుటుంబాలకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి భరోసా లభించింది. వారిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం నిండింది” అని ప్రధాని మోదీ అన్నారు.

 

నక్సలిజంపై సాగించిన పోరాటంతో పేదరికంపై సాధించిన ఈ విజయం ముడిపడి ఉందని ప్రధాని చెప్పారు. గతంలో నక్సలైట్లు పాఠశాలలు, ఆసుపత్రులు, ఔషధాల దుకాణాలు, పోలియో వ్యాక్సినేషన్లు, మొబైల్ టవర్లు, పరిశ్రమలను అడ్డుకుంటూ.. రైల్వే ట్రాక్‌లను పేల్చివేస్తూ లక్షలాది మంది అమాయక ప్రజలను పేదరికంలో మగ్గేలా చేశారని తెలియజేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం గురించి ప్రధానమంత్రి వివరించారు. దీని ద్వారా 15,000 కి.మీ.లకు పైగా రహదారులు, 9,500కు పైగా మొబైల్ టవర్లు, సుమారుగా 175 ఏకలవ్య పాఠశాలలు, దాదాపు 50 ఐటీఐలు, 50 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వేల సంఖ్యలో తపాలా కార్యాలయాలు, బ్యాంకు శాఖలు, ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటుగా లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించామని, పీఎం జన్‌మన్ ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు తొలిసారి తాగునీరు, విద్యుత్తు, రహదారి సదుపాయం కల్పించామని చెప్పారు. ‘‘నక్సలిజంపై పోరాటం ప్రారంభించినప్పుడే నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక క్యాంపెయిన్లను మేం చేపట్టాం’’ అని పీఎం మోదీ అన్నారు.

 

పేదరికంపై పోరాటానికి ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ నినాదం నూతన ఉత్సాహాన్ని అందించిందన్నారు. ఇది 50 కోట్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేయడంతో పాటు నక్సల్ హింసకు ముగింపు పలికిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో వచ్చిన సమూల మార్పునకు ప్రస్తుతం జరుగుతున్న బస్తర్ ఒలింపిక్సే నిదర్శనమన్నారు. ‘‘ఈ బస్తర్‌లోనే ఇప్పుడు బస్తర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. బాలలు తుపాకులు చేపట్టకుండా క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

 

ఈ విజయాలే అంతిమ లక్ష్యాలు కావు. ఇవి భవిష్యత్తులో మరింత పురోగతికి ఆరంభాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, సరిహద్దు జవాన్లు, అలాగే నక్సలిజం, ఉగ్రవాదాలపై పోరాడుతూ ప్రాణాలర్పించిన వీరుల శతాబ్దాల నాటి కలల్ని... దేశం సాగిస్తున్న ఈ కొత్త ప్రయాణం నెరవేరుస్తుందన్నారు. ‘తేరా గౌరవ్ అమర్ రహే మా, హమ్ దిన్ చార్ రహే నా రహే’ అనే ఆదర్శంతో జీవించే భద్రతా దళాలు ఆ స్ఫూర్తిని సరికొత్త ఆత్మవిశ్వాసంగా మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇప్పుడు దేశం కోసం జీవించాల్సిన, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

కశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, వ్యాక్సినేషన్ పరిధి విస్తరణ లాంటి ముఖ్యమైన వాగ్దానాలను నెరవేర్చడంలో దేశానికి ఉన్న ట్రాక్ రికార్డును గుర్తు చేశారు. ఈ తరహాలోనే పేదరిక నిర్మూలన, మాదకద్రవ్య రహిత సమాజం, ఆత్మనిర్భర, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యాలను సైతం భారత్ సాధిస్తుందంటూ భద్రతా దళాలు, పౌరులపై ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కలలు సాకారం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ, దీపావళి శుభాకాంక్షలతో తన ప్రసంగాన్ని ముగించారు. “మీ త్యాగాలు, కష్టపడే తత్వమే వికసిత్ భారత్ అనే మహోన్నత సౌధానికి బలమైన పునాదిగా నిలుస్తాయి,” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

****


(రిలీజ్ ఐడి: 2334335) సందర్శకుల సూచీ సంఖ్య : : 18