నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 5:13PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా అవరోధ రహిత బహుళ లైన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్ విధానాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు వీలుగా, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లైన్లు కలిగిన జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల రూపకల్పన, మౌలిక సదుపాయాలను ప్రామాణీకరించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్తగా చేపట్టే, ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో వాహనాలు టోల్ బూత్‌ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో అవరోధరహితంగా టోల్ వసూలు చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఈ మార్గదర్శకాలు నిర్ధారిస్తాయి. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ, నిరీక్షణ సమయాన్ని తొలగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, జాతీయ రహదారులపై ప్రయాణాలను మరింత సురక్షితంగా, సులభతరంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
టోల్ ప్లాజాల నిర్మాణ నమూనాలు, లైన్ల ఏర్పాటు, గ్యాంట్రీలు, రహదారి మౌలిక సదుపాయాలు, లైటింగ్, సూచిక బోర్డులు, సహాయక సదుపాయాలకు సంబంధించి ఈ మార్గదర్శకాలు ఏకరీతి ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. కొత్తగా చేపట్టే, ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో వీటిని అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ విధానాన్ని కూడా సూచిస్తున్నాయి.
వివిధ రకాల జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రామాణిక రూపకల్పన
వివిధ రకాల జాతీయ రహదారుల నిర్మాణాలకు అనుగుణంగా అవరోధరహిత టోల్ ప్లాజాల నమూనా, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఈ విధానపరమైన మార్గదర్శకాలు ఏకరీతి ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. టోల్ ప్లాజా నిర్మాణ నమూనా, టోల్ వసూలు లైన్ల సంఖ్య, గ్యాంట్రీల ఏర్పాటు, వాటి స్థానాలు, సంబంధిత రహదారి భద్రతా సదుపాయాలు, సూచిక బోర్డులు, లైటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన నిబంధనలను ఇవి సూచిస్తున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల రూపకల్పనలో ఏకరూపతను తీసుకురావడంతో పాటు, అవరోధరహిత టోల్ వసూళ్ల విధానాన్ని సులభంగా అమలు చేసేందుకు వీలవుతుంది.
భౌతిక అడ్డంకుల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రావడంతో, సంప్రదాయ టోల్ ప్లాజాలతో పోలిస్తే అవసరమైన టోల్ వసూలు లైన్ల సంఖ్యను హేతుబద్ధీకరించారు. దీనివల్ల అందుబాటులో ఉన్న స్థలాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, టోల్ వసూలు ప్రాంతంలో వాహనాల రాకపోకలు వేగవంతం అవుతాయి.
జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో అమలు
ఈ మార్గదర్శకాలు భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకూ వర్తిస్తాయి. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో ఉన్న ప్రాజెక్టుల పత్రాల్లో కొత్త రూపకల్పనను పొందుపరుస్తారు. ఇప్పటికే కాంట్రాక్టులు ఖరారైన లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో వర్తించే ఒప్పంద నిబంధనల ప్రకారం ఈ మార్పులను అమలు చేస్తారు. రాబోయే ప్రాజెక్టుల్లో నిర్దేశిత ప్రమాణాలను చేర్చాలని, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోనూ వీటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయి కార్యాలయాలను ఆదేశించింది.
భద్రత, వాహనదారుల సౌకర్యానికి ప్రాధాన్యం
టోల్ ప్లాజాల వద్ద తగినంత వెలుతురు ఉండేలా చూడటం, తగిన సూచిక బోర్డులు, ఎలక్ట్రానిక్ వేరియబుల్ మెసేజ్ సైన్స్ (వీఎంఎస్) ద్వారా రహదారి వినియోగదారులకు ముందస్తు సమాచారం, మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలకు ఈ విధానపరమైన మార్గదర్శకాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. టోల్ వసూలు ప్రాంతంలో స్పష్టమైన దృశ్యమానతను కల్పించడం, వాహనదారులకు అవసరమైన సమాచారం అందించడం, వాహనాల రాకపోకలు సురక్షితంగా, సాఫీగా సాగేలా చూడటం ఈ చర్యల లక్ష్యం. టోల్ ప్లాజాల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు పరిపాలనా భవనంతో పాటు కార్యకలాపాలు, నిర్వహణ కేంద్రాన్ని నిర్మించాలనే నిబంధననూ ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
గతంలో ఎక్స్‌ప్రెస్‌వేలు మినహా హైస్పీడ్ యాక్సెస్ కంట్రోల్డ్ జాతీయ రహదారుల ప్రణాళిక, రూపకల్పనకు సంబంధించి ఎన్హెచ్ఏఐ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. రాబోయే హైస్పీడ్ జాతీయ రహదారి కారిడార్లకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీలో ప్రమాణాల ఏకరూపత తీసుకురావడం, సాంకేతిక ప్రమాణాల్లో మరింత స్థిరత్వాన్ని సాధించడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం.
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్ ప్లాజాల కోసం ప్రామాణిక మౌలిక సదుపాయాలు, రూపకల్పన విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవరోధరహిత టోల్ వసూళ్లకు దేశవ్యాప్తంగా ఏకరీతి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సులభతరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు, దేశవ్యాప్తంగా టోల్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
****