నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 4:22PM by PIB Hyderabad
గోవాలో గనుల శాఖ మంత్రుల నాలుగో సమావేశం ముగిసింది. రెండో రోజు గనుల రంగం అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాధాన్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలను ప్రస్తావించడంతో పాటు అనుభవాలను పంచుకున్నారు. గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా కీలక ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఖనిజ అన్వేషణను వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గనుల ద్వారా రాష్ట్రాల ఆదాయాన్ని పెంచడం, గనుల ప్రణాళికను మెరుగుపరచడం, గనుల మూసివేత ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయడం గురించి కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ, గనుల రంగానికి సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, ఖనిజాల విషయంలో దేశం స్వావలంబన సాధించే దిశగా రాష్ట్రాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు.
గనుల శాఖ కార్యదర్శి శ్రీ కేశవ చంద్ర మాట్లాడుతూ, సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు ప్రస్తావించిన సమస్యలు, చేసిన సూచనలను తమ శాఖ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా జాప్యాలు, విధానపరమైన అడ్డంకుల వంటి సమస్యలను మెరుగైన సమన్వయం, సకాలంలో పరిష్కార చర్యల ద్వారా అధిగమించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రb- రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, కీలక సమస్యలను పరిష్కరించడం, భారత గనుల రంగ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై మరింత నిబద్ధతను చాటుతూ రెండో రోజు చర్చలు, మొత్తం సమావేశం సానుకూల వాతావరణంలో ముగిశాయి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమావేశం పునరుద్ఘాటించింది.
***