మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 8:26AM by PIB Hyderabad
కేంద్ర మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అధ్యక్షతన జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి మండలి (ఎన్ఎఫ్డీబీ) 13వ పాలక మండలి సమావేశాన్ని 2026 నవంబర్ 5న హైదరాబాద్లోని ఎన్ఎఫ్డీబీలో గల పద్మశ్రీ డాక్టర్ అయ్యప్పన్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంలో పశు పోషణ, పాడి అభివృద్ధి, మత్స్య పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో మత్య పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ గేబ్రియల్ డెన్వాంగ్ వాంగ్సు, త్రిపుర ప్రభుత్వంలో మత్స్య పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ సుధాంశు దాస్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య పరిశ్రమ విభాగ ప్రతినిధులతో పాటు, ఎన్ఎఫ్డీబీ పాలక మండలికి చెందిన 13 మంది ప్రభుత్వేతర సభ్యులు పాలుపంచుకున్నారు.
సమావేశంలో మరింత మంది చేపల రైతులకు ప్రభుత్వ పథకాలు, సేవల పూర్తి ప్రయోజనాలను అందజేయడానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొనేందుకు ఒక క్రియాత్మక అభివృద్ది సంస్థగా ఎన్ఎఫ్డీబీ తన పాత్రను బలోపేతం చేసుకోవాలని కేంద్ర మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల ఆదాయాన్ని, జీవనోపాధి భద్రతను ఇప్పటి కన్నా పెంపొందించడానికి నిర్దేశిత ప్రాజెక్టులను అనుకున్న సమయానికి కార్య రూపంలోకి తీసుకురావాలని, నిధులను పక్కాగా వినియోగించాలని మంత్రి స్పష్టం చేశారు. ఉత్పాదన, సరఫరా, వినియోగం మధ్య అంతరాలను తొలగించడానికి స్వయంసమృద్ధి సాధన దిశగా పయనించడానికి ఈశాన్య ప్రాంతాలతో పాటు దేశంలో ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక సహాయాన్ని అందజేయడంపై శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చేపల ఉత్పాదన 2019-20లో 141.64 లక్షల టన్నుల స్థాయి నుంచి ప్రస్తుతం 197.75 లక్షల టన్నులకు చేరిన సంగతిని ప్రస్తావిస్తూ... ఉత్పాదన, ఉత్పాదకత.. ఈ రెండిటిని మరింతగా పెంపొందింప చేయవలసిందిగా కేంద్ర మంత్రి సూచించారు. మరింత ప్రగతిని సాధించేలా ఎన్ఎఫ్డీబీ భావి కార్యకలాపాలు, కార్యక్రమాలను రూపొందించుకోవటం ముఖ్యమని ఆయన అన్నారు.
చేపలు, రొయ్యల పెంపకాన్ని విస్తరించడానికి, సీఫూడ్ ఎగుమతులను పటిష్టపరచడానికి మత్స్య పరిశ్రమ విభాగం, రాష్ట్రాలు చేస్తున్న కృషిని మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలో మత్స్య పరిశ్రమ విభాగ కార్యదర్శి (మత్స్య పరిశ్రమ) డాక్టర్ అభిలాక్ష్ లిఖి వివరించారు. ఈ ఉత్పాదనల ఎగుమతుల విలువ ప్రస్తుతం సుమారు రూ.70,000 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి మండలి (ఎన్ఎఫ్డీబీ) డిజిటల్ మాధ్యమంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని, ఆసక్తిదారు వర్గాల సహకారాన్ని అందుకొనే, వాటి అభిప్రాయాలను సేకరించే యంత్రాంగాలను సరళతరం చేయాలని ఆయన సూచించారు. మత్స్య పరిశ్రమకు సంబంధించిన విధానాలను, కార్యక్రమాలను నిరంతర ప్రాతిపదికన మెరుగుపరచడానికి రాష్ట్రాలతో క్రమం తప్పక సంప్రదింపులు జరుపుతుండాలని, ఆసక్తిదారు వర్గాల స్పందనను తెలుసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. సహకార సంఘాలు, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీపీఓస్), అంకుర సంస్థలు, ప్రయివేటు రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు ఇప్పటి కన్నా ఎక్కువ స్థాయిలో రావాలని ఆయన అన్నారు.
మత్స్య పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పనను బలోపేతం చేయాల్సివుందన్న అభిప్రాయాన్ని రాష్ట్రాల మత్స్య పరిశ్రమ శాఖ మంత్రులు వ్యక్తం చేశారు. చేపల బజారులు, ఏకీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు నిరంతర ప్రాతిపదికన అందాలని విజ్ఞప్తి చేశారు. అమృత్ సరోవరాలను, రిజర్వాయర్లను, తదితర జల వనరులను మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభావవంతమైన రీతిలో ఉపయోగించుకోవడానికి మత్స్య పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో మెరుగైన సమన్వయం అవసరమని కూడా వారు స్పష్టంచేశారు. మత్స్యకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, స్వయంసహాయ బృందాలు, అధికారులకు అంతర్ రాష్ట్రీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇతోధిక శిక్షణను ఇవ్వడమే కాకుండా, సామర్థ్యాలను కూడా పెంపొందింపచేయాలని మంత్రులు అన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎమ్ఎమ్ఎస్వై) లబ్ధిదారులకు నిరంతర శిక్షణనివ్వాలని కోరారు. పోషణ చైతన్య ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ, చేపల వాడకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు.
మత్స్య పరిశ్రమ, చేపలు-రొయ్యల పెంపకం రంగంలో మండలి ప్రధానంగా అమలు చేస్తున్న కార్యకలాపాలు, సాధించిన విజయాలను ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా సంక్షిప్తంగా వివరించారు. ఎన్ఎఫ్డీబీ కార్యక్రమాలు, పథకాల్లో భాగంగా చోటుచేసుకున్న ప్రగతిని కూడా సమావేశం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఈ రంగంలో అభివృద్ది సాధనకు బోర్డు పాలక మండలి ప్రస్తుతం కొనసాగిస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
మత్స్య పరిశ్రమలో, చేపలు-రొయ్యల పెంపకం రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చక్కని అమలు ప్రణాళికలతోను, కేంద్రం-రాష్ట్రాల సమన్వయం, ఫలితాలను రాబట్టడమే ప్రధానంగా అమలుచేస్తున్న కార్యక్రమాలతోను కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్ఎఫ్డీబీ, ఇతర ఆసక్తిదారు వర్గాలు కలిసికట్టుగా పనిచేయడాన్ని ఇక మీదట కూడా కొనసాగిస్తాయని సమావేశంలో పునరుద్ఘాటించారు.
***