బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూసివేసిన, నిరుపయోగంగా వదిలేసిన గనులను ఉత్పాదక ఆస్తులుగా మారుస్తున్న సువికల్ప్–మైన్ రీపర్పసింగ్ టూల్

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 1:30PM by PIB Hyderabad

మైనింగ్ రంగంలో గనులు మూసివేత అంతర్భాగం. అయితే గనుల తవ్వకాలకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తవడంతోనే మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి సంబంధించిన బాధ్యత ముగిసిపోదు. గనుల తవ్వకం తర్వాత ఆ భూమిని ఉత్పాదకంగా వినియోగించుకోవడం, పర్యావరణాన్ని పునరుద్ధరించడం, సుస్థిరమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం గనుల పునర్వినియోగంపై నిర్మాణాత్మకమైన విధానం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీవో) సువికల్ప్–మైన్ రీపర్పసింగ్ టూల్‌ను అభివృద్ధి చేసింది. బొగ్గు, లిగ్నైట్ గనుల మైనింగ్ ప్రణాళిక మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ఈ డిజిటల్ వేదిక నిర్ణయాలను తీసుకోవడంలో తోడ్పడుతుంది.

మైనింగ్ పూర్తయిన భూములను వినియోగించుకొనే మార్గాలను గుర్తించడానికి శాస్త్రీయమైన, పారదర్శక విధానాన్ని ఏర్పాటు చేయడమే సువికల్ప్ లక్ష్యం. విభిన్న అంశాలను విడిగా అంచనా వేయడం, స్థానిక ప్రజల ప్రాధాన్యతలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం లాంటి సమస్యలకు ఇది సరైన పరిష్కారం చూపుతుంది.

శాస్త్రీయ, డేటా ఆధారిత అంచనా

జియో మైనింగ్ పరిస్థితులు, పర్యావరణ స్థితిగతులు, మౌలిక వసతుల లభ్యత, వనరుల కొరత, ఆర్థిక అంశాలు, స్థానిక సామాజిక-ఆర్థిక పరిస్థితుల సమాచారాన్ని ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి సువికల్ప్ తీసుకువస్తుంది. వినియోగదారులు నిర్దిష్ట గనికి సంబంధించిన వివరాలను నమోదు చేసి సమగ్ర సమాచార నివేదికను రూపొందించవచ్చు. తద్వారా ఆయా గనుల ప్రత్యేకతలు, పరిమితులను బేరీజు వేస్తూ వాటిని ఏయే ప్రత్యామ్నాయాలకు ఉపయోగించవచ్చో క్రమపద్ధతిలో అంచనా వేసేందుకు ఈ సాధనం వీలు కల్పిస్తుంది. 

పునర్వినియోగానికి ఉన్న అవకాశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రాధాన్య క్రమంలో ర్యాంకులను కేటాయించేందుకు ఈ వేదిక టాప్సిస్ (టెక్నిక్ ఫర్ ఆర్డర్ ప్రిఫరెన్నస్ బై సిమిలారిటీ టు ఐడియల్ సొల్యూషన్) ఆధారితమైన మల్టీ-క్రైటీరియా డెసిషన్-మేకింగ్ (ఎంసీడీఎం) పద్ధతిని ఉపయోగిస్తుంది. అనేక అంశాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాలను పోల్చి చూసేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఫలితంగా భాగస్వామ్య పక్షాలకు పారదర్శకమైన, స్థిరమైన, స్పష్టమైన ఆధారాలతో కూడిన సిఫార్సులు అందుతాయి.

నిర్మాణాత్మక విధానంలో ఈ అంచనా ప్రక్రియ జరుగుతుంది. దీనిలో అంశాల ఎంపిక, ప్రత్యామ్నాయ మార్గాల రూపకల్పన, స్థానిక ప్రజల ప్రాధాన్యాల పరిగణన, అనుకూలతల అంచనా, తుది ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించడం లాంటి దశలు ఉంటాయి. కేవలం వ్యక్తిగత అభిప్రాయాలపైనే ఆధారపడకుండా, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు గని యజమానులు, ప్రాజెక్టు నిర్వాహకులు, ప్రభుత్వ విభాగాలకు ఎంతగానో తోడ్పడుతుంది.

రీక్లెయిమ్ ద్వారా సామాజిక ప్రాధాన్యాలను ఏకీకృతం చేయడం

మైనింగ్ ప్రాంతాల్లో ఉన్న సమాజాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిరమైన గనుల పునర్వినియోగం ఉండాలి. దానికి అనుగుణంగా ప్రాజెక్టు విశ్లేషణ ప్రక్రియల్లో రీక్లెయిమ్ – సామాజిక భాగస్వామ్యం, అభివృద్ధి కార్యాచరణను సువికల్ప్ అనుసంధానిస్తుంది.

సాంకేతిక సాధ్యమయ్యే అంశాలు, పర్యావరణ అనుకూలత, ఆర్థిక అంశాలతో పాటు స్థానిక ప్రజల ప్రాధాన్యాలను క్రమబద్ధంగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈ కార్యాచరణ వీలు కల్పిస్తుంది. దీనివల్ల స్థానిక అభివృద్ధి అవసరాలు, ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల విస్తరణ, సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా పునరాభివృద్ధి పనులు  ఉండేలా చూసేందుకు తోడ్పడుతుంది.

నిర్ణయ ప్రక్రియలో సమాజ దృక్పథాలను భాగం చేయడం ద్వారా మైనింగ్ అనంతర అభివృద్ధి పనుల్లో ప్రజా భాగస్వామ్య విధానాన్ని సువికల్ప్ ప్రోత్సహిస్తుంది. ఇది గనుల మూసివేత ప్రక్రియ, ప్రాంతీయ అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది.

ప్రాజెక్టు గుర్తింపు నుంచి అమలు వరకు: ప్రిజమ్

ప్రిజమ్ (మైనింగ్ అనంతరం పునర్వినియోగ అమలుకు వ్యూహాత్మక విధానం) అనే సరికొత్త విధానం ఉండటం సువికల్ప్ ప్రత్యేకత. ఇది అనువైన ప్రాజెక్టులను గుర్తించి, ర్యాంకులు కేటాయించడంతోనే ఆగిపోకుండా ఈ వేదిక పరిధిని మరింత విస్తరిస్తుంది.

ప్రాజెక్టు దార్శనికత, పునర్వినియోగ వ్యూహాలు, పెట్టుబడుల సరళి, వ్యూహాత్మక నిర్మాణం, పర్యవేక్షణ వంటి అమలు మార్గాలను అన్వేషించేందుకు అవసరమైన క్రమబద్ధమైన కార్యాచరణను ప్రిజమ్ అందిస్తుంది. దీనికి తోడు ప్రాజెక్టుకు సంబంధించిన కాన్సెప్ట్ నోట్స్, జాతీయ అంతర్జాతీయ అధ్యయనాలు, నమూనా టెండర్ పత్రాలు, అమలు సంస్థల వివరాలు, ఉత్తమ విధానాల సమాచారంతో కూడిన సమగ్ర నాలెడ్జ్ రిపోజిటరీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

అనువైన అవకాశాలను గుర్తించడం నుంచి ప్రాజెక్టు అభివృద్ధికి, అమలుకు ఆచరణాత్మక అంశాలను అర్థం చేసుకొనే దిశగా భాగస్వామ్య పక్షాలకు ఈ సమగ్ర విధానం వీలు కల్పిస్తుంది. ఇది విజ్ఞాన వినిమయాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ప్రణాళికను సిద్ధం చేయడానికి, క్షేత్రస్థాయి అమలుకు తోడ్పడే సమాచారాన్ని అందిస్తుంది.


 

 

భవిష్యత్తు ప్రణాళిక: అమలు ఆధారిత విధానాన్ని నిర్మించడం

విస్తృత వినియోగంపై దృష్టి సారించడంతో పాటు ప్రాజెక్టు సిఫార్సుల నుంచి అమలు దిశగా పురోగతిని బలోపేతం చేయడంపై సువికల్ప్ తదుపరి దశలో దృష్టి సారిస్తుంది. దీనిలో ఉన్న కీలక ప్రాధాన్యాలు:

  1. వినియోగాన్ని పెంచడం: మూసివేసిన, నిరుపయోగంగా వదిలేసిన బొగ్గు గనుల్లో సువికల్ప్‌ను విస్తరించడం

  2. ప్రాజెక్టు అభివృద్ధి: సిఫార్సులను క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, కాన్సెప్ట్ నోట్స్, డీపీఆర్‌లుగా మార్చడం. 

  3. సంస్థాగత సమన్వయం: ప్రభుత్వం, పరిశ్రమలు, నిపుణులు, అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం.

  4. పెట్టుబడుల సమీకరణ: ఆచరణసాధ్యమైన గనుల పునర్వినియోగ ప్రాజెక్టుల కోసం నిధులు, భాగస్వామ్యాలను అన్వేషించడం.

  5. విజ్ఞానం, సామర్థ్య నిర్మాణం: ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, భాగస్వామ్యుల సామర్థ్యాన్ని పెంపొందించడం.

  6. పర్యవేక్షణ, అంచనా: అమలు తీరు పర్యవేక్షణ, పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అంచనా వేయడం.

సుస్థిరమైన గనుల పునర్వినియోగం దిశగా

గనుల పునర్వినియోగంలో శాస్త్రీయమైన, ప్రజా భాగస్వామ్య నిర్ణయాధికార విధానాన్ని వ్యవస్థీకృతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగే సువికల్ప్. సాంకేతిక అంచనాలు, స్థానిక ప్రజల ప్రాధాన్యతలు, ప్రాజెక్టులకు నిష్పాక్షిక ర్యాంకింగ్, అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా మైనింగ్ అనంతరం భూముల ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన వినియోగానికి అవసరమైన పటిష్ఠమైన పునాదిని అందిస్తుంది.

వివిధ రకాల గనుల పరిస్థితులు, ప్రాంతీయ అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా విస్తరించగల ఒక జాతీయ స్థాయి విజ్ఞాన, నిర్ణయ సహాయక వ్యవస్థగా సువికల్ప్‌ను తీర్చిదిద్దడమే దీర్ఘకాలిక లక్ష్యం. అనువైన ప్రాజెక్టులను గుర్తించడంలో మాత్రమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి గనుల ప్రాంత ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూర్చడంలోనే  ఈ కార్యక్రమం విజయం ప్రతిఫలిస్తుంది.

మైనింగ్ అంటే వనరుల వెలికితీత మాత్రమే అనే పాత ఆలోచనను మార్చి, ఆ ప్రక్రియను పర్యావరణ పునరుద్ధరణకు, ఆర్థిక వైవిధ్యీకరణకు, స్థిరమైన ప్రాంతీయ అభివృద్ధికి ఒక సరికొత్త అవకాశంగా మలచడమే సువికల్ప్ ప్రధాన లక్ష్యం.

 

***

 


(రిలీజ్ ఐడి: 2332125) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil