నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 2:59PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ - వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) వృద్ధిలో కీలక చోదకశక్తిగా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా, ఓవర్‌బర్డెన్ తొలగింపు వంటి మూడు కీలక కార్యకలాపాల్లోనూ గణనీయమైన పనితీరు కనబరిచింది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మూడు కీలక కార్యాచరణ ప్రమాణాల్లోనూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించిన సీఐఎల్ అనుబంధ సంస్థగా డబ్ల్యూసీఎల్ ఒక్కటే నిలిచింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 102.47 శాతం, సరఫరా లక్ష్యంలో 108.82 శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపు లక్ష్యంలో 104.56 శాతం సాధించింది.
సంస్థ సాధించిన ఈ మెరుగైన కార్యాచరణ ఫలితాలు దేశీయంగా బొగ్గు లభ్యతను గణనీయంగా పెంచడంతో పాటు, భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా దోహదపడ్డాయి. 2026 ఏప్రిల్ - అక్టోబర్ మధ్య డబ్ల్యూసీఎల్ అదనంగా 4.53 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇదే కాలంలో కోల్ ఇండియా లిమిటెడ్ సాధించిన మొత్తం నికర ఉత్పత్తి వృద్ధి కంటే డబ్ల్యూసీఎల్ అదనపు ఉత్పత్తి ఎక్కువగా ఉండటం విశేషం.
కీలక కార్యకలాపాల్లో పటిష్టమైన పనితీరు
2026 అక్టోబర్ నెలలో డబ్ల్యూసీఎల్ విశేషమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 3.60 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది అక్టోబర్‌లో 5.93 మిలియన్ టన్నులకు పెరిగి 64.87 శాతం వృద్ధిని సాధించింది. సీఐఎల్లోని ప్రధాన అనుబంధ సంస్థలన్నింటిలో ఇదే అత్యధిక వృద్ధి. అంతేకాకుండా, నెలవారీ ఉత్పత్తి లక్ష్యంలో కూడా 108.60 శాతాన్ని సాధించింది.
2026 అక్టోబర్‌లో బొగ్గు సరఫరా గత ఏడాది ఇదే నెలలోని 4.44 మిలియన్ టన్నుల నుంచి 6.67 మిలియన్ టన్నులకు పెరిగి 50.16 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీ సరఫరా లక్ష్యాన్ని అధిగమించిన ప్రధాన అనుబంధ సంస్థల్లో డబ్ల్యూసీఎల్ ఒక్కటే నిలిచింది. ఈ నెలలో నిర్దేశిత సరఫరా లక్ష్యంలో 102.40 శాతాన్ని సాధించింది.
2026 ఏప్రిల్ - అక్టోబర్ మధ్య డబ్ల్యూసీఎల్ నమోదు చేసిన వివరాలు:
-
32.96 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, 15.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
-
41.56 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసి, 25.54 శాతం వృద్ధిని నమోదు చేసింది.
-
207.95 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ తొలగించి, 36.10 శాతం వృద్ధిని నమోదు చేసింది.
2026 సెప్టెంబర్‌లో సీఐఎల్ అనుబంధ సంస్థలన్నింటిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరంగా అత్యధిక వృద్ధిని డబ్ల్యూసీఎల్ నమోదు చేసింది.
బొగ్గు నిల్వల విక్రయంలో రికార్డు, రవాణా మెరుగుదల
ఈ కాలంలో డబ్ల్యూసీఎల్ సాధించిన ప్రధాన విజయాల్లో గనుల వద్ద ఉన్న బొగ్గు నిల్వలను గణనీయంగా తగ్గించడం ఒకటి. 2026 ఏప్రిల్ 1న 13.034 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ నిల్వలు, అక్టోబర్ 31 నాటికి 4.44 మిలియన్ టన్నులకు తగ్గాయి. ఫలితంగా సుమారు 8.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను ఖాళీ చేయగలిగింది. ఇది ప్రారంభ నిల్వల్లో దాదాపు 66 శాతానికి సమానం.
రైల్వే శాఖతో మెరుగైన సమన్వయం, వ్యాగన్ల (రేక్‌ల) కేటాయింపు, లోడింగ్ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఈ విజయానికి గణనీయంగా దోహదపడ్డాయి. 2026 అక్టోబర్ 31 నాటికి డబ్ల్యూసీఎల్ 6,146 రేక్‌లను లోడ్ చేసింది. గత ఏడాది ఇదే కాలంలో లోడ్ చేసిన 4,402 రేక్‌లతో పోలిస్తే ఇది 39.6 శాతం అధికం.
విద్యుత్ రంగానికి రేక్‌ల ద్వారా బొగ్గు సరఫరా 40.8 శాతం పెరిగింది. ముఖ్యంగా మహాజెన్కోకు బొగ్గు సరఫరాలో గణనీయమైన వృద్ధి నమోదైంది.
నిరంతర పర్యవేక్షణ, గనుల వారీగా నిర్ణయాలు
గనుల స్థాయిలో కార్యకలాపాలను నిరంతరం, సమగ్రంగా పర్యవేక్షించడం ద్వారా డబ్ల్యూసీఎల్ ఈ గణనీయమైన పనితీరును సాధించింది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఇతర కార్యాచరణ సమస్యలపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించడం, ఏరియా జనరల్ మేనేజర్లతో క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం, ఉన్నతాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల కార్యకలాపాల్లో ఎదురయ్యే అవరోధాలను వేగంగా గుర్తించి పరిష్కరించడం సాధ్యమైంది.
నెలవారీ సమన్వయ, సమీక్షా విధానాలను గనుల స్థాయి వరకు విస్తరించడం వల్ల జవాబుదారీతనం మరింత బలోపేతమైంది. సంస్థ కార్యకలాపాల్లోని కీలక అంశాలపై మరింత నిశితమైన పర్యవేక్షణకు ఇది దోహదపడింది.
రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సన్నిహిత సమన్వయం కొనసాగించడం వల్ల పర్యావరణ, అటవీ అనుమతులు, భూమికి సంబంధించిన అంశాలు, ఇతర కార్యాచరణ అవసరాలకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడం కూడా సాధ్యమైంది.
2026 - 27 ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూసీఎల్ నాలుగు పర్యావరణ అనుమతులు లేదా వాటికి సంబంధించిన సవరణలు, రెండు అటవీ అనుమతులను పొందింది. దీంతో బొగ్గు గనుల కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
సాంకేతికత, నాణ్యత, నిర్వహణ సామర్థ్యం
అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బొగ్గు రవాణాకు అనువైన రహదారులు, వేగవంతమైన లోడింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వేబ్రిడ్జిలు వంటి రవాణా, లోడింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా డబ్ల్యూసీఎల్ తన నిర్వహణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
ప్రస్తుతం సంస్థ పరిధిలో ఆరు సర్ఫేస్ మైనర్లు, మూడు కంటిన్యూయస్ మైనర్లు పనిచేస్తున్నాయి. బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించడం కూడా సానుకూల ఫలితాలనిచ్చింది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నమూనాలుగా సేకరించిన బొగ్గులో సుమారు 86 శాతం నిర్ధారిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది.
నిర్వహణపరంగా చేపట్టిన లక్ష్యిత మెరుగుదలల వల్ల ఓవర్లోడింగ్ ఛార్జీలు గణనీయంగా తగ్గాయి. అక్టోబర్ నెలలో బొగ్గు సరఫరాపై ఎలాంటి డెబిట్ నష్టం లేకుండా 100 శాతం నికర ఆదాయం లభించింది.
విద్యుదుత్పత్తికి, ఇంధన భద్రతకు తోడ్పాటు
బొగ్గు సరఫరాలో డబ్ల్యూసీఎల్ సాధించిన గణనీయమైన వృద్ధి విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు ప్రత్యక్షంగా తోడ్పడింది. అదనపు బొగ్గు సరఫరా దేశీయంగా బొగ్గు లభ్యతను పెంచడంతో పాటు, దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దోహదపడింది.
మహాజెన్కోకు అదనంగా సరఫరా చేసిన రేక్‌ల ద్వారా మహారాష్ట్రలో సుమారు 5,800 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి తోడ్పాటు లభించినట్లు అంచనా.
2026 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య డబ్ల్యూసీఎల్ పన్నుకు ముందు లాభం (ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్) రూ.1,352.26 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 76.3 శాతం వృద్ధి.
ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దిశగా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూసీఎల్ సాధించిన పనితీరు సమర్థవంతమైన నాయకత్వం, గనుల స్థాయిలో విస్తృత పర్యవేక్షణ, వేగవంతమైన నిర్ణయాలు, సంబంధిత భాగస్వామ్య పక్షాల మధ్య సన్నిహిత సమన్వయం ఉంటే గణనీయమైన కార్యాచరణ ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తోంది.
రికార్డు స్థాయిలో ఓవర్‌బర్డెన్ తొలగింపు చేపట్టడం ద్వారా బొగ్గు తవ్వకాలకు అవసరమైన పొరలను ముందుగానే వెలికితీయడం, గనుల వద్ద బొగ్గు నిల్వలను గణనీయంగా తగ్గించడం, పటిష్టమైన సిబ్బంది, బలమైన కార్యాచరణ వేగం వంటి అంశాలు డబ్ల్యూసీఎల్కు కలిసివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలోనూ నిలకడైన పనితీరును కొనసాగించేందుకు సంస్థ సన్నద్ధంగా ఉంది.
దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో తోడ్పడటం, భారత ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు తన వంతు సహకారం అందించడం పట్ల డబ్ల్యూసీఎల్ పూర్తి నిబద్ధతతో ఉంది.
***