బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు కోసం మైనింగ్‌’ అంశంపై భాగస్వాములతో సంప్రదింపుల సమావేశం

కేటాయించిన బొగ్గు బ్లాకుల్లో ఉత్పత్తిని త్వరగా ప్రారంభించాలని కేటాయింపుదారులకు సూచన

2020 నుంచి కేటాయించిన 137 వాణిజ్య బొగ్గు గనుల్లో ప్రస్తుతం 25 గనుల్లోనే ఉత్పత్తి

ఈ అంతరాన్ని తగ్గించేందుకు పరిశ్రమ వర్గాల సూచనలు కోరిన మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 6:30PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు కోసం మైనింగ్‌’ అంశంపై భాగస్వాములతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. కేటాయించిన బొగ్గు బ్లాకుల్లో ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలని కేటాయింపు దారులకు సూచించారు. 2020 నుంచి కేటాయించిన 137 వాణిజ్య బొగ్గు గనుల్లో ప్రస్తుతం 25 గనుల్లో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు పరిశ్రమ వర్గాల నుంచి మంత్రిత్వ శాఖ సూచనలు కోరింది.

 

ఈ సమావేశానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్‌ దేవ్‌ దత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కార్యదర్శి, నామినేటెడ్‌ అథారిటీ శ్రీమతి రూపిందర్‌ బ్రార్‌తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించడం ద్వారానే కాకుండా, ఇప్పటికే కేటాయించిన బ్లాకుల్లో ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా కూడా దేశ బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచవచ్చన్నది ఈ సంప్రదింపుల సమావేశంలో ప్రధానంగా వ్యక్తమైన సందేశం. బ్లాకుల కేటాయింపుదారులను ఉద్దేశించి కార్యదర్శి మాట్లాడుతూ.. ‘‘కేటాయించినప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాని బొగ్గు బ్లాక్‌ అంటే దేశం ఉపయోగించుకోలేకుండా పక్కన పెట్టిన సామర్థ్యమే’’ అని పేర్కొన్నారు.

 

 

 

గత ఎనిమిది నెలలు బొగ్గు రంగానికి పరీక్షా సమయంగా నిలిచాయని కార్యదర్శి తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాలకు అంతరాయం ఏర్పడినప్పుడు.. బొగ్గు గనులు, విద్యుత్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న నిల్వలు దేశానికి నిరంతర విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం భరోసా కల్పించేందుకు దోహదపడ్డాయని చెప్పారు. ఈ విషయంలో పరిశ్రమ వర్గాలు అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఒత్తిడి ఇంకా తగ్గలేదని ఆయన పేర్కొన్నారు. 2027 వరకు గ్యాస్‌ మార్కెట్లలో సరఫరా పరిస్థితులు కఠినంగానే కొనసాగవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోందని తెలిపారు. రెండో త్రైమాసికంలో ఆసియా స్పాట్‌ ఎల్‌ఎన్‌జీ సగటు ధర ప్రతి మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు (ఎంబీటీయూ) 17.5 అమెరికన్‌ డాలర్లుగా నమోదైందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45 శాతం ఎక్కువని వివరించారు. 2026లో ప్రపంచ బొగ్గు డిమాండ్‌ రికార్డు స్థాయిలో 894 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా ఉందన్నారు. “దేశీయంగా మనం ఉత్పత్తి చేసే ప్రతి టన్ను బొగ్గు ఇలాంటి అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది” అని కార్యదర్శి పేర్కొన్నారు.

 దేశీయంగా కూడా బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుత విధానాల ప్రకారం 2025లో సుమారు 125 కోట్ల టన్నులుగా ఉన్న బొగ్గు డిమాండ్‌ 2050 నాటికి 260 కోట్ల టన్నులకు పైగా పెరుగుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేస్తోందని చెప్పారు. నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించే మార్గంలోనూ బొగ్గు డిమాండ్‌ 180 కోట్ల టన్నులకు మించి ఉంటుందని అంచనా ఉందన్నారు. బొగ్గును అత్యధికంగా వినియోగించే ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలు అనేక రెట్లు విస్తరించనున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌ పెరుగుదల ఉంటుందని వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 1,041 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని, దేశ విద్యుత్‌ అవసరాల్లో ఇప్పటికీ 70 శాతానికి పైగా బొగ్గు నుంచే లభిస్తోందని తెలిపారు. 

 

బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబాట్లు సుస్థిరత, సమాజ సంక్షేమం, సాంకేతిక అభివృద్ధి వంటి పలు అంశాలను కలిగి ఉన్నాయని శ్రీ దత్‌ వివరించారు. గనుల మూసివేతను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. తవ్వకాలు పూర్తయిన ప్రాంతాలను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో చైతన్యవంతమైన, పర్యావరణ సమతుల్యత కలిగిన ఆవాసాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. తద్వారా పర్యావరణ పునరుద్ధరణతో పాటు సమాజ సంక్షేమం, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వం సాధ్యమవుతాయని పేర్కొన్నారు. బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక సమాజాలకు భాగస్వామ్యం కల్పిస్తూ, వాటి ప్రయోజనాలు అందేలా ఈ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు. 

 

అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్‌ బ్రార్‌ ఇప్పటివరకు చేపట్టిన సంస్కరణల గురించి సమావేశంలో వివరించారు. 2020లో ప్రవేశపెట్టిన విధానం ద్వారా బొగ్గు వినియోగంపై ఉన్న పరిమితులను తొలగించడంతో పాటు, జాతీయ బొగ్గు సూచీ ఆధారంగా ఆదాయ వాటా విధానంలో వేలం ప్రక్రియను చేపట్టేలా మార్పులు చేశారు. సాంకేతిక, ఆర్థిక అర్హత నిబంధనలను తొలగించారు. ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు. భూగర్భ గనులకు ప్రారంభ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు, కనీస ధర, పనితీరు హామీ మొత్తాన్ని తగ్గించారు. ఈ సంస్కరణల అనంతరం పూర్తిగా అన్వేషించిన బ్లాకుల విషయంలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయించిన గడువును 51 నెలల నుంచి 40 నెలలకు, పాక్షికంగా అన్వేషించిన బ్లాకుల విషయంలో 66 నెలల నుంచి 52 నెలలకు తగ్గించారు. గనుల ప్రణాళికల ఆమోదానికి గతంలో సగటున 9 నెలలు పట్టగా, ప్రస్తుతం 4.5 నెలలకు తగ్గింది. గని ప్రారంభ అనుమతిని సంబంధిత కంపెనీ బోర్డే మంజూరు చేస్తోంది. గుర్తింపు పొందిన 44 అన్వేషణ సంస్థలకు ఇకపై ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ అవసరం లేకుండా చేశారు. 

 

బొగ్గు బ్లాకుల్లో కార్యకలాపాలను వేగంగా ప్రారంభించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన సంస్కరణలను ఆమె ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజాల సంక్షేమంతో అభివృద్ధిని సమతుల్యం చేస్తూ, బాధ్యతాయుతమైన విధానంలో బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి స్థాయి పెరుగుదలకు అనుగుణంగానే సుస్థిరత చర్యలు కూడా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బొగ్గు రంగంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పునకు దోహదపడ్డాయని పేర్కొంటూ, పెట్టుబడులను ఆకర్షించడానికి, పోటీని ప్రోత్సహించడానికి, కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి పారదర్శకత, విధానపరమైన స్థిరత్వం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం కీలకమని ఆమె వివరించారు.

 

కేటాయింపు దారులు సవరించిన గడువుల కంటే ముందుగానే గనులను ప్రారంభించాలని, వీలైనంత త్వరగా గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. భూమి సేకరణ, అటవీ అనుమతులు, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ముందుగానే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, బాధ్యతాయుతమైన పద్ధతిలో మైనింగ్‌ చేపట్టాలని కోరింది. గనుల కార్యకలాపాలను వేగంగా ప్రారంభించేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు, బొగ్గు గనుల ఒప్పందాల్లో పునఃపరిశీలించాల్సిన నిబంధనలు, చట్టాలు, నియమాల్లో చేయాల్సిన సవరణలపై తమ సూచనలు ఇవ్వాలని కూడా కేటాయింపు దారులను కోరింది. బాధ్యతాయుతమైన మైనింగ్‌ గురించి కార్యదర్శి మాట్లాడుతూ.. ఒక గని ఏర్పాటు కోసం భూమిని వినియోగించుకోవాల్సి ఉంటుందని, నీటి వనరులపై ప్రభావం పడుతుందని, స్థానిక ప్రజల జీవనోపాధిలో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. భూమిని కోల్పోతున్న కుటుంబాలకు మొదటి రోజు నుంచే పరిహారంగా ఏమి లభిస్తుంది, వారు ఎక్కడికి తరలివెళ్లాలి, వారి ఆదాయ వనరులను ఏ విధంగా పునరుద్ధరిస్తారనే విషయాలపై స్పష్టత ఉండాలని అన్నారు. కంపెనీలు ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. 

 

ఈ భాగస్వాముల సంప్రదింపుల సమావేశంలో బొగ్గు రంగంలో మార్పులకు సంబంధించిన కీలక అంశాలపై వివిధ సమావేశాల్లో  విస్తృత చర్చలు జరిగాయి. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ వంటి భవిష్యత్తు మైనింగ్‌ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సామర్థ్యాన్ని పెంచి అదనపు విలువను సృష్టించేలా ఆవిష్కరణలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించారు. పునరావాసం, పునఃస్థాపన, భూముల పునర్వినియోగం, కార్మికుల సంక్షేమం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌), స్థానిక సమాజాలు, భాగస్వాములందరినీ కేంద్రంగా చేసుకుని న్యాయబద్ధమైన పరివర్తన సాధించడం ద్వారా సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించే అంశాలపైనా చర్చలు జరిగాయి. పర్యావరణహిత మైనింగ్‌ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సుస్థిరత చర్యలపై కూడా దృష్టి సారించారు. ఈ చర్చలన్నీ ఆధునిక, బాధ్యతాయుతమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే, స్వావలంబన కలిగిన బొగ్గు రంగం నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ మార్గాన్ని ప్రతిబింబించాయి. 

 

సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి పరిశ్రమ వర్గాలు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, డిజిటల్‌ పరివర్తనలో సాధించిన పురోగతిని వివరించాయి. గని వద్దే బొగ్గులో బూడిద శాతాన్ని తగ్గించే విధానాలు, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌, ఆధునిక అన్వేషణ పద్ధతులు, పేస్ట్‌ ఫిల్లింగ్‌ సాంకేతికతతో పాటు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించాయి. సీబీఎం విధానం, గనుల భద్రత, పర్యావరణ విధానాల్లో సంస్కరణలు, భూగర్భ జలాల అనుమతులకు సంబంధించిన అంశాలపై డీజీహెచ్‌, డీజీఎంఎస్‌, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జలాల సంస్థ (సీజీడబ్ల్యూఏ) అధికారులు ప్రసంగించారు. అనంతరం విధానపరమైన ప్రోత్సాహకాలు, తదుపరి తరం సంస్కరణలపై బహిరంగ చర్చ నిర్వహించారు. గనుల మూసివేత, బొగ్గు ప్రాంతాల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత, స్థానిక సమాజాల సంక్షేమం, అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపైనా పాల్గొన్నవారు చర్చించారు. విధానపరమైన సంస్కరణల ప్రభావం, గనుల నుంచి బొగ్గు రవాణా ప్రారంభ కేంద్రాల వరకు అనుసంధాన సదుపాయాలు, కోకింగ్‌ బొగ్గు ఉత్పత్తిని పెంచే మార్గాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

 

ఈ చర్చల అనంతరం భాగస్వాములతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారికి తమ అభిప్రాయాలు, సందేహాలను పంచుకునే అవకాశం కల్పించారు.

 

బొగ్గు రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా, ఒడిదొడుకులను తట్టుకోగలిగేలా, అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. గోవాలో నిర్వహించిన ఈ సంప్రదింపుల సమావేశం.. నిరంతర భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సుస్థిర పద్ధతుల పట్ల మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబించే వరుస సమావేశాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా బొగ్గు రంగం అభివృద్ధి చెందేలా ఈ సమావేశాలు దోహదపడనున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2331350) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Tamil