బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల వ్యర్థాలతో యుద్ధనౌక నమూనా... ఇండియన్ నేవీకి ఈసీఎల్‌ నివాళి

బొగ్గు గని కార్మికుల నైపుణ్యాన్ని, సుస్థిరత పట్ల నిబద్ధతను చాటుతున్న స్పెషల్ క్యాంపెయిన్-6 ద్వారా వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 6:25PM by PIB Hyderabad

దేశ సముద్ర సరిహద్దుల పరిరక్షణలో భారత నావికాదళం చూపుతున్న నిబద్ధతకు కృతజ్ఞతగా, గౌరవసూచకంగా ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ (ఈసీఎల్) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈసీఎల్... బెంగాల్ ఎన్‌సీసీ నేవల్ యూనిట్-1 గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ ఎన్‌సీసీ కోల్‌కతా 'సీ'కి శుక్రవారం రోజున యుద్ధనౌక నమూనాను అందజేసింది. పనికిరాని బొగ్గు గనుల యంత్రాల విడిభాగాలతో తయారు చేసిన ఈ నమూనా... బొగ్గు కార్మికుల్లో, నేవల్ సిబ్బందిలో ఉన్న దేశసేవ, అంకితభావం, దేశ నిర్మాణ స్ఫూర్తిని చాటుతోంది.

ఈసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ ఝా మార్గదర్శకత్వంలో అమలవుతున్న స్పెషల్ క్యాంపెయిన్ 6లోని 'వ్యర్థాల నుంచి సంపద' కార్యక్రమం ద్వారా... ఈసీఎల్ నేమత్‌పూర్ సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ నమూనాను అత్యంత నైపుణ్యంతో తయారుచేశారు. పారిశ్రామిక వ్యర్థాలను దేశభక్తికి ప్రతీకగా మలచటంలో ఈసీఎల్ సిబ్బంది సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత ఎంత గొప్పవో ఈ కళాఖండం నిరూపిస్తోంది. వనరుల పునర్వినియోగాన్ని, సుస్థిరతను కూడా ఇది ప్రోత్సహిస్తోంది.

సీసీఎల్ సీఎండీ, ఫంక్షనల్ డైరెక్టర్లు, ఈసీఎల్ కుటుంబం తరఫున ఈసీఎల్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ ఎస్. తివారీ, నేమత్‌పూర్ సెంట్రల్ వర్క్‌షాప్ హెచ్‌ఆర్ మేనేజర్ నిశ్చల్ సోనితో కలిసి ఈ నమూనాను అందజేశారు. దేశ సేవలో తరిస్తున్న సాయుధ బలగాలకు కృతజ్ఞతగా భారత నావికాదళ కమోడోర్ సీసర్ బసు, కమాండర్ సంజీబ్ శరణ్‌లకు దీన్ని బహూకరించారు.

ప్రజా ప్రాముఖ్యత గల పలు అంశాలపై విభిన్న సందేశాలనిస్తూ జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్‌లో 'వ్యర్థాల నుంచి సంపద' కార్యక్రమంలో భాగంగా 10 రకాల నమూనాలను ఈసీఎల్ తయారు చేసింది. అందులో ఈ యుద్ధనౌక నమూనా ఒకటి. వ్యర్థాలతో ఎంతో సృజనాత్మకంగా వీటిని తయారుచేశారు. నూతన ఆవిష్కరణలకు, అర్థవంతమైన సృజనాత్మకతకు పారిశ్రామిక వ్యర్థాలను వనరుగా మలచుకోవచ్చని ఈ నమూనాలు తెలియజేస్తున్నాయి.

వినూత్న రీతిలో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పరిరక్షణకు ఈసీఎల్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోంది. సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను ప్రోత్సహిస్తూ... పర్యావరణ పరిరక్షణకు సిబ్బందిలోని సంప్రదాయ నైపుణ్యాలు, సృజనాత్మకత సహకరించే విధానాన్ని ఇది చాటిచెబుతోంది.

దేశసేవ, పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి భావాలను జోడిస్తూ... ఈసీఎల్ బొగ్గు గనుల కార్మికుల తరఫున భారత నావికాదళానికి అందించిన ప్రత్యేకమైన అభినందన ప్రదర్శన ఇది. లోతైన బొగ్గు గనుల నుంచి విశాలమైన సముద్రాల వరకు దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తి అందరిలోనూ ఉంటుందని ఇది నిరూపిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2331348) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Tamil