నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 4:51PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన 'ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్' (ఈఎస్టీఐసీ)-2026లో రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పాలుపంచుకుంది. 'సృజనాత్మక మేధస్సులు, విజ్ఞాన శాస్త్ర ప్రేరణ, సమాజ సాధికారత' అనే ప్రధాన నినాదంతో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు మార్గదర్శనంలో 12 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. శాస్త్రీయ నాయకత్వంలో సరికొత్త విప్లవానికి నాంది పలికేలా సాగిన ఈ కార్యక్రమంలో అత్యంత అధునాతన పరిశోధనలు, డీప్-టెక్ ఆవిష్కరణలను ప్రదర్శించడంతో పాటుగా... నోబెల్ బహుమతి గ్రహీతలు, అంతర్జాతీయ నిపుణులు, విధానకర్తలు, యువ నాయకులతో చర్చలనూ నిర్వహించారు.
ఈ సదస్సు నిర్వహణలో కీలక భాగస్వామిగా డీఆర్డీవో... 'సెమీకండక్టర్లు, నెక్స్ట్-జనరేషన్ చిప్స్' అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ప్రముఖ శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ (ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి.కె. దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... ఈ రంగానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, స్వదేశీ చిప్-అభివృద్ధి వ్యవస్థకు చెందిన నిపుణులు, రక్షణ రంగ ఎలక్ట్రానిక్స్ నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి ఈ చర్చలో పాలుపంచుకున్నారు.
ఈ సమావేశంలో భాగంగా డాక్టర్ బి.కె. దాస్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఒక ప్రత్యేక ప్యానెల్ చర్చనూ నిర్వహించారు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ (మైక్రో ఎలక్ట్రానిక్ డివైసెస్, కంప్యూటేషనల్ సిస్టమ్స్, సైబర్ సిస్టమ్స్) డాక్టర్ షీనా రాణి ప్యానెలిస్టుగా పాల్గొన్నారు. సెమీకండక్టర్ సాంకేతికతల్లో వస్తున్న సరికొత్త మార్పులు, నిర్దిష్ట అవసరాల కోసం రూపొందించే కృత్రిమ మేధ, సిస్టమ్-ఆన్-చిప్స్, సిలికాన్ ఎడ్జ్ ఆధారిత ఇంటెలిజెన్స్, మారుతున్న మైక్రోప్రాసెసర్ రంగాల గురించి ఈ చర్చల్లో లోతుగా విశ్లేషించారు. గేమ్-చేంజింగ్ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి, నెక్స్ట్-జనరేషన్ చిప్ డిజైన్‌ను వేగవంతం చేయడానికి, స్వదేశీ కోర్ సాంకేతికతలను బలోపేతం చేయడానికి పరిశ్రమలు, అంకురసంస్థలకు డీఆర్డీవో అందిస్తున్న నిరంతర మద్దతును, ఆ సంస్థ కీలక పాత్రనూ ఈ సమావేశం ప్రముఖంగా చాటిచెప్పింది.
ఈఎస్టీఐసీ-2026 వేదికగా డీఆర్డీవో ఏర్పాటు చేసిన ఔట్రీచ్ స్టాల్... సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక కృషిని, సాధించిన విజయాలను, పరిశోధనా కార్యక్రమాలను ప్రముఖంగా ప్రదర్శించింది. డీఆర్డీవో పరిశోధనశాలలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విభిన్నమైన సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శించారు. వీటిలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్వాంటం టెక్నాలజీ నమూనాలు, తీవ్రమైన చలి వాతావరణాన్ని తట్టుకునే దుస్తులు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ప్రబల' ఫుల్-బాడీ ప్రొటెక్టర్, ప్యాసివ్, పవర్డ్ ఎక్సోస్కెలిటన్లు, పోర్టబుల్ హైబ్రిడ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, హై-పవర్ పల్స్ లేజర్ డయోడ్లు, స్క్రామ్‌జెట్ ఇంజిన్ సాంకేతికతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన థీమాటిక్, డిపార్ట్మెంటల్ ప్రదర్శనల్లోనూ డీఆర్డీవో పాలుపంచుకుంది. ఢిల్లీలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఇన్ఫ్రారెడ్ ఫోకల్ ప్లేన్ ఆరేలు అనే రెండు కీలక సెమీకండక్టర్ సాంకేతికతల రంగాల్లో సాధించిన విజయాలను డీఆర్డీవో ఇక్కడ 'సెమీకండక్టర్లు, నెక్స్ట్-జనరేషన్ చిప్స్' థీమాటిక్ ప్రదర్శనలో ప్రముఖంగా ప్రదర్శనకు ఉంచింది.
ఈ ప్రదర్శనలో ఉంచిన గాలియం ఆర్సెనైడ్, గాలియం నైట్రైడ్ ఆధారిత మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, మల్టీ-చిప్ మాడ్యూళ్లను ఇప్పటికే పలు వ్యూహాత్మక రక్షణ మిషన్లలో ఉపయోగించారు. ఈ అధునాతన సాంకేతికతలు అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అప్లికేషన్లకు అత్యంత కీలకమైన పునాదిగా పనిచేస్తాయి. ఇన్ఫ్రారెడ్ ఫోకల్ ప్లేన్ ఆరేలు వ్యూహాత్మక క్షిపణుల కోసం 'కళ్లు'గా లేదా సెన్సింగ్ ఎలిమెంట్స్‌గా పనిచేస్తూ... ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ (ఐఐఆర్) సీకర్ల ద్వారా క్షిపణి లక్ష్యాన్ని చేరుకునే ఆఖరి దశలో శత్రు లక్ష్యాలను గుర్తించడానికి, వాటిని కచ్చితత్వంతో ట్రాక్ చేయడానికి తోడ్పడతాయి. షార్ట్-వేవ్ ఇన్ఫ్రారెడ్, మిడ్-వేవ్ ఇన్ఫ్రారెడ్, లాంగ్-వేవ్ ఇన్ఫ్రారెడ్ వంటి విస్తృత శ్రేణి ఇన్ఫ్రారెడ్ సాంకేతికతలను ఈ ప్రదర్శనలో ఉంచడం ద్వారా... అధునాతన సెమీకండక్టర్ రంగంలో డీఆర్డీవో సాధించిన అపారమైన స్వదేశీ సామర్థ్యాలనూ చాటిచెప్పారు.
డీఆర్డీవో ప్రదర్శించిన ఇతర ముఖ్యమైన ఆవిష్కరణల్లో స్క్రామ్‌జెట్ ఇంజిన్ సాంకేతికత, న్యూరోమార్ఫిక్ యాక్సిలరేటర్లు ఉన్నాయి. ఇవి సంక్లిష్టమైన, సరికొత్త సాంకేతిక రంగాల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని చాటిచెప్పాయి. వీటితో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్వాంటం రాండమ్ నంబర్ జనరేటర్లు, రక్షణ పరికరాలు, ఎక్సోస్కెలిటన్లు, పోర్టబుల్ హైబ్రిడ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, లేజర్ ప్రాక్సిమిటీ సెన్సార్లనూ ఈ ప్రదర్శనలో ప్రముఖంగా ఉంచారు.
సెమీకండక్టర్ సాంకేతికత దేశ సార్వభౌమాధికారానికి, ఆర్థిక బలానికి, డిజిటల్ భద్రతకు అత్యంత కీలకమైనది. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాల బలోపేతం ద్వారా 2047 నాటికి 'వికసిత్ భారత్', 'స్వయం-సమృద్ధ భారత్' దార్శనికతలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కమ్యూనికేషన్ పరికరాలు, అధునాతన సెన్సింగ్ వ్యవస్థల నుంచి అత్యాధునిక రక్షణ ప్లాట్‌ఫారమ్‌ల వరకు... ఆధునిక సాంకేతికతల పనితీరు, సామర్థ్యం, విశ్వసనీయతను ఈ సెమీకండక్టర్ చిప్స్ మాత్రమే నిర్ణయిస్తాయి. చిప్ తయారీతో పాటు, సాంకేతిక స్వయంసమృద్ధినీ సాధించాలంటే చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, పారిశ్రామిక స్థాయి ఉత్పత్తి, సుస్థిర సరుకు రవాణా వ్యవస్థ వంటి సమగ్ర సామర్థ్యాలను కలిగి ఉండటం ఎంతో అవసరం.
ఎంపిక చేసిన కొత్త తరం (నెక్స్ట్-జనరేషన్) చిప్ సాంకేతికతల్లో ప్రపంచంలోనే ముందంజలో నిలవాలనే లక్ష్యంతో భారత్ ముందుకుసాగుతోంది. దీని ద్వారా 2047 నాటికి అంతర్జాతీయంగా గట్టి పోటీనిస్తూ... ప్రపంచంలోనే అందరూ విశ్వసించదగిన, సాంకేతిక రంగంలో సొంతంగా ఎదిగిన ఒక బలమైన సెమీకండక్టర్ కేంద్రంగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఈ ఆశయం కేవలం చిప్స్ తయారు చేయడంలోనే కాకుండా... మన దేశంలోనే ఒక నిరంతరాయమైన, శక్తిమంతమైన సెమీకండక్టర్ వ్యవస్థను సృష్టించడాన్ని నిర్దేశిస్తుంది. తద్వారా యువతకు ఎంతో విలువైన, ఉన్నతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
గడిచిన కొన్నేళ్లుగా భారత వ్యూహాత్మక రక్షణ రంగ పరిశోధనశాలలు, ప్రత్యేక సెమీకండక్టర్ ఫౌండ్రీలు ఈ రంగంలో అత్యంత నైపుణ్యాన్ని సాధించాయి. ఇందులో ఎస్ఎస్పీఎల్, గాలియం ఆర్సెనైడ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీ సెంటర్, సెమీకండక్టర్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్, సెమీకండక్టర్ లాబొరేటరీ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఇవి గాలియం ఆర్సెనైడ్, గాలియం నైట్రైడ్, మైక్రో-ఎలక్ట్రో-మెకానికల్ సిస్టమ్స్, ఆధునిక సిలికాన్ ప్రాసెస్ సాంకేతికతల్లో విశేషమైన నైపుణ్యాలను విజయవంతంగా అభివృద్ధి చేశాయి.
****