రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసి - న్యూఢిల్లీ మధ్య కొత్త వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను రేపు ప్రారంభించనున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి

ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ మధ్య ప్రయాణించే యాత్రికులు, విద్యార్థులు, ఉద్యోగ, వృత్తి నిపుణులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణాన్ని అందించనున్న కొత్త రైలు

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 5:33PM by PIB Hyderabad

వారణాసి - న్యూఢిల్లీ మధ్య కొత్త వందేభారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక రాత్రి రైలు ప్రయాణ సేవలను మరింత విస్తరించేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఈ రైళ్లతో నగరాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది. సుదూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతితో పాటు వేగవంతమైన, సమర్థవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.

 

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ రేపు వారణాసిలో వారణాసి - న్యూఢిల్లీ మధ్య నడిచే కొత్త వందేభారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనున్నారు.

 

2026 జనవరిలో హౌరా - గువాహటి మార్గంలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను, తిరుగు ప్రయాణ సేవలను ప్రారంభించిన తరువాత తాజాగా ప్రవేశపెడుతున్న ఈ రైళ్లతో మరిన్ని ప్రాంతాలకు ఈ అత్యాధునిక రైలు సేవలు విస్తరించనున్నాయి. రైలు లోపల మెరుగైన సౌకర్యాలు, అధునాతన భద్రతా ఏర్పాట్లు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన నిద్రించే సదుపాయాలతో సుదూర రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, విశ్వసనీయంగా, ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యమిచ్చేలా తీర్చిదిద్దేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తోంది.

 

 

వారణాసి - న్యూఢిల్లీ: ప్రముఖ పుణ్యక్షేత్రం, దేశ రాజధాని మధ్య మరింత మెరుగుపడనున్న రవాణా అనుసంధానం

 

వారణాసి - న్యూఢిల్లీ మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు సేవతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటైన వారణాసికి, దేశ రాజధాని ఢిల్లీకి మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

 

వారణాసికి ఏడాది పొడవునా భక్తులు, దేశ, విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, ఇతర సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. న్యూఢిల్లీతో రాత్రిపూట రైలు ప్రయాణ సదుపాయం మెరుగుపడటం వల్ల ఆధ్యాత్మిక, విద్యా, వృత్తి, పరిపాలనా, పర్యాటక అవసరాల కోసం ప్రయాణించేవారికి మరింత సౌకర్యం కలగనుంది.

 

ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌ సెంట్రల్‌, అలీగఢ్‌, ఘజియాబాద్‌ మీదుగా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఈ స్టేషన్లు కీలక పట్టణ కేంద్రాలకు సేవలందించడంతో పాటు పరిసర జిల్లాలకు కూడా రవాణా సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

 

ఈ కొత్త రైలు వారణాసిలో రాత్రి 8:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీలో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

 

ప్రస్తుతం నడుస్తున్న శివగంగా ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే, వందేభారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ వారణాసి నుంచి న్యూఢిల్లీకి ప్రయాణ సమయాన్ని 55 నిమిషాలు, న్యూఢిల్లీ నుంచి వారణాసికి 35 నిమిషాలు తగ్గిస్తుంది. దీంతో ఇరు మార్గాల్లోనూ ప్రయాణికులకు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే రాత్రి ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.

 

ఈ రైలు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. వారణాసి నుంచి బయలుదేరే రైలు ప్రతి శుక్రవారం, న్యూఢిల్లీ నుంచి బయలుదేరే రైలు ప్రతి శనివారం నడవదు. రాత్రిపూట ప్రయాణించేలా రూపొందించిన ఈ సమయపట్టిక వల్ల ప్రయాణికులు సాయంత్రం తమ ప్రయాణాన్ని ప్రారంభించి, మరుసటి రోజు ఉదయం గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో వారు తమ సమయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి తూర్పు ఉత్తరప్రదేశ్‌, జాతీయ రాజధాని ప్రాంతం మధ్య తరచుగా ప్రయాణించే భక్తులు, పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, కుటుంబాలకు ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది.

వందేభారత్‌ స్లీపర్‌: రాత్రిపూట ప్రయాణానికి సరికొత్త ప్రమాణం

 

సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన భద్రతా వ్యవస్థలు, ప్రయాణికులకు అనుకూలమైన సౌకర్యాల సమ్మేళనంగా నిలవనుంది. రాత్రిపూట ప్రయాణ అనుభూతిని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ రైలును తీర్చిదిద్దారు. సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నిద్రించే సదుపాయాలు, పరిశుభ్రత, భద్రత, లభ్యత, సౌలభ్యానికి ప్రాధాన్యమిచ్చారు.

 

ప్రధాన ఆకర్షణలు:

 

విద్యుత్‌ సరఫరా, పనితీరు

 

విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు పునరుత్పాదక బ్రేకింగ్‌ వ్యవస్థ

 

రైలు అడుగు భాగంలో ప్రొపల్షన్‌ వ్యవస్థ

 

మెరుగైన ఏరోడైనమిక్‌ డిజైన్‌తో పాటు సున్నితమైన వేగవృద్ధి, కుదుపులు లేని ప్రయాణం

 

రూపకల్పన, ప్రత్యేక సౌకర్యాలు

 

. ఈఎన్‌ 15227 ఢీకొన్నప్పుడు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆస్టెనిటిక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కోచ్‌ బాడీ రూపకల్పన

 • త్వరిత విడుదల వ్యవస్థతో కూడిన పూర్తిగా మూసివేసిన ఫ్లెక్సిబుల్‌ గ్యాంగ్‌వే

 • కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థతో పనిచేసే సింగిల్‌ లీఫ్‌ ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ ప్లగ్‌ డోర్లు

 • కోచ్‌ల లోపలి భాగంలో శబ్దం తగ్గించి, ప్రశాంతమైన వాతావరణం కల్పించే ప్రత్యేక ఇన్సులేషన్‌ ఏర్పాట్లు

 • ప్రత్యక్ష, పరోక్ష వెలుతురును అందించే ఎల్ఈడీ లైటింగ్‌ వ్యవస్థ

 • సెన్సర్ల ఆధారంగా పనిచేసే కోచ్‌ల మధ్య అనుసంధాన ద్వారం 

 

 

భద్రత, రక్షణ ఏర్పాట్లు

 

ఈఎన్‌ 45545 హెచ్ఎల్‌3 గ్రేడ్‌ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన

 • కోచ్‌ల చివరి గోడల వద్ద అగ్నినిరోధక ద్వారాలు

 • రైలు ఢీకొనకుండా నివారించే వ్యవస్థ (టీసీఏఎస్‌)

 • విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక లైటింగ్‌ సదుపాయం

 • పొగ, అగ్నిప్రమాదాలను గుర్తించే వ్యవస్థ (ఎఫ్‌డీఎస్‌)

 • భద్రత, ప్రయాణికుల పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు

 • అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు వినియోగించేందుకు అలారం బటన్‌ 

 

 

ప్రయాణ సౌకర్యాలు, అనుకూలతలు

 

*వాక్యూమ్‌ విధానంలో వ్యర్థాలను తొలగించే, దుర్వాసన రాకుండా ఎర్గోనామిక్‌ పద్ధతిలో రూపొందించిన మరుగుదొడ్లు

 • దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, మరుగుదొడ్లు

 • విశాలమైన సామాను నిల్వ ప్రదేశంతో ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు

 • మూడు పిన్‌ల ఛార్జింగ్‌ సాకెట్‌, స్విచ్‌తో కూడిన సమీకృత బీఆర్ఎల్‌ వ్యవస్థ

 • టైప్‌ - ఏ, టైప్‌ - సీ యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్టులు

 • పీఏపీఐఎస్‌ ఆధారిత లోకో పైలట్‌, గార్డు, ప్రయాణికుల మధ్య సమాచార వ్యవస్థ

 • ఫస్ట్‌ ఏసీ కోచ్‌లో వేడి నీటి సదుపాయంతో కూడిన షవర్‌

 • యాక్సెస్‌ పాయింట్‌ నెట్‌వర్క్‌తో కూడిన వై-ఫై రూటర్‌

 • లోకో పైలట్‌ క్యాబిన్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌, రైలు సిబ్బంది కోసం ప్రత్యేక మరుగుదొడ్డి 

 

 

ఆధునిక ఇంజినీరింగ్‌ పరిజ్ఞానాన్ని ప్రయాణికుల సౌకర్యం, భద్రత, నిర్వహణ సామర్థ్యంతో సమన్వయం చేయడంలో భారతీయ రైల్వే నిబద్ధతకు ఈ ప్రత్యేకతలు నిదర్శనంగా నిలుస్తాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2330661) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada