నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 5:00PM by PIB Hyderabad
భారతదేశ ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న సీమాంతర మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మరో భారీ షాక్ ఇచ్చింది. మిజోరాం, అస్సాంలలో పక్కా నిఘా సమాచారంతో వేర్వేరుగా చేపట్టిన రెండు ఆపరేషన్లలో పెద్ద ఎత్తున 50 కిలోల మెథాంఫెటమైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో 30 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లు (యాబా), 20 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమైన్ రకాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్) చట్టం-1985లోని నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్ట్ చేశారు.
జోఖౌతార్ నుంచి ఐజ్వాల్, సిల్చార్ వైపునకు వివిధ మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో అస్సాం రైఫిల్స్ సహాయంతో డీఆర్ఐ అధికారులు 2026 అక్టోబర్ 29న ఐజ్వాల్–ఛంపై రహదారిపై ఐజ్వాల్ శివార్లలో ఒక మహింద్రా బోలెరో క్యాంపర్ వాహనాన్ని పట్టుకున్నారు. దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా స్టోరేజ్ క్యాబినెట్ కలిగిన ఆఫీస్ టేబుల్ లోపల ప్రత్యేకంగా తయారుచేసిన ఖాళీ ప్రదేశంలో దాచిన 30 కిలోల గులాబీ-నారింజ రంగు టాబ్లెట్లతో కూడిన 30 ఇటుక పరిమాణపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలను దాచిపెట్టేందుకు ఫర్నిచర్‌ను వాడారు. ఇది సాధారణ గృహ లేదా ఆఫీస్ వస్తువులను రవాణా చేస్తున్నట్లు నమ్మించేందుకు ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నారు.
2026 అక్టోబర్ 30న మరొక పక్కా నిఘా ఆపరేషన్‌లో భాగంగా అస్సాం రైఫిల్స్ సహకారంతో డీఆర్ఐ అధికారులు సిల్చార్కి దాదాపు 40 కి.మీల దూరంలో ఉన్న ధోలై వద్ద ఒక అశోక్ లేలాండ్ ట్రక్కు, బోలెరో క్యాంపర్‌ను పట్టుకున్నారు. ట్రక్కును తనిఖీ చేయగా దొరికిన 20 కిలోల 20 క్రిస్టల్ మెథాంఫెటమైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వీటిని విదేశీ మార్కింగ్‌లు ఉన్న తేయాకు ప్యాకెట్లలో ప్యాక్ చేసి డ్రైవర్ క్యాబిన్ పైన దాచారు. స్వాధీనం చేసుకున్న పదార్థంలో మెథాంఫెటమైన్ ఉన్నట్లు పరీక్షల (ఫీల్డ్ టెస్టింగ్) ఆధారంగా నిర్ధారించారు.
ఈ రెండు ఆపరేషన్లలో నలుగురిని ఎన్డీపీఎస్ చట్టం- 1985 కింద అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన మూడు వాహనాలను కూడా సీజ్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాలను మయన్మార్ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. ఇటీవలే ఈశాన్య ప్రాంతంలో డీఆర్ఐ చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 232 కిలోలు, 56 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ జరగటం విశేషం. ఈ వరుస స్వాధీనాలు సీమాంతర సింథటిక్ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలోకి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలను మట్టుబెట్టడానికి డీఆర్ఐ చేస్తోన్న నిరంతర కృషికి ఇవి ప్రతీకగా ఉన్నాయి.
వ్యవస్థీకృత మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను మట్టుబెట్టేందుకు, సింథటిక్ మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడానికి, మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన సామాజిక, ప్రజారోగ్య దుష్పరిణామాల నుంచి దేశాన్ని రక్షించడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది.
****