సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 11,333 కొత్త సూక్ష్మ పరిశ్రమలకు మద్దతుగా పీఎంఈజీపీ ద్వారా రూ. 1,000 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని విడుదల చేసిన కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ

కీలకమైన పీఎంఈజీపీ మద్దతు ద్వారా రూ. 3,260 కోట్ల బ్యాంకు రుణ సౌకర్యం లభించనుండగా, గ్రామీణ భారతదేశంలో 1.02 లక్షలకు పైగా స్థిరమైన ఉపాధి అవకాశాలతో పాటు పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 9:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) ద్వారా రూ. 1,000 కోట్ల మార్జిన్ మనీ (ఎంఎం) సబ్సిడీని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దీనిద్వారా స్వయం ఉపాధి, గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించటంలో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది.

 

న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్-3లో మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ ఈ సబ్సిడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయమంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ భరత్ ఖేరా, మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ సీఈఓ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) సీఎండీ, డెవలప్‌మెంట్ కమిషనర్ (ఎంఎస్ఎంఈ) కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయేతర రంగంలో నూతన సూక్ష్మ పరిశ్రమల స్థాపన ద్వారా స్థిరమైన స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ కార్యక్రమాల్లో పీఎంఈజీపీ ఒకటి. ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) అమలు చేస్తోంది. దీనికి కేవీఐబీలు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు, కాయర్ బోర్డు వంటి ఇతర నియమిత అమలు సంస్థల సహాయం లభిస్తుంది. ఈ పథకం ద్వారా నూతన సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కోసం బ్యాంకులు మంజూరు చేసే ప్రాజెక్టు రుణాలపై ఆశావహ పారిశ్రామికవేత్తలకు ఎంఎం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు. దీర్ఘకాలికంగా సంస్థల సుస్థిరత, వృద్ధిని ప్రోత్సహించేందుకు కేవీఐసీ క్షేత్రస్థాయి కార్యాలయాలు, అమలు సంస్థల ద్వారా అవగాహన కల్పించటం, చేయూతనివ్వటం, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానాలు, పర్యవేక్షణ, వ్యాపారాలను ప్రారంభించిన తర్వాత మద్దతు అందుతుంది. ఈ కార్యక్రమం పారిశ్రామికీకరణను ప్రోత్సహించటంలో, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేయటంలో, ప్రత్యేకించి దేశంలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

2014-15 నుంచి పీఎంఈజీపీ పరివర్తనాత్మక ప్రభావం:

దేశంలో అత్యంత విజయవంతమైన ఉపాధి కల్పన కార్యక్రమాల్లో పీఎంఈజీపీ ఒకటి. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 70,000 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు, రూ. 25,193 కోట్లకుపైగా ఎంఎం సబ్సిడీని అందించాయి. వీటిద్వారా 8.38 లక్షలకుపైగా సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు పీఎంఈజీపీ తోడ్పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా దాదాపు 75 లక్షల స్థిరమైన ఉపాధి అవకాశాలు లభించాయి.

పీఎంఈజీపీ సాధించిన విజయాలు... సమగ్రమైన, సమానమైన అభివృద్ధి పట్ల బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. సహాయం పొందిన యూనిట్లలో దాదాపు 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యాయి. లబ్ధిదారుల్లో దాదాపు 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ,  ఓబీసీ వర్గాలకు చెందినవారు కాగా... సుమారు 40 శాతం పరిశ్రమలు మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇది సామాజిక సమైక్యత, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, సమాజంలోని బలహీన వర్గాల సాధికారతను పెంపొందించటంలో పథకం ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.

రూ. 1,000 కోట్ల సబ్సిడీ ద్వారా ఇప్పటివరకు 11,333 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి:

పీఎంఈజీపీ  ద్వారా 11,333 మంది లబ్ధిదారులకు చేయూత అందించేందుకు రూ. 1,000 కోట్ల ఎంఎం సబ్సిడీని విడుదల చేశారు. వివిధ రంగాల్లో నూతన సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఈ లబ్ధిదారులకు దాదాపు రూ. 3,260 కోట్ల విలువైన బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి.

ఈ విడతలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1.02 లక్షలకుపైగా స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ఆర్థిక సహాయం మహిళా నేతృత్వంలోని పారిశ్రామికీకరణ, లింగ సమానత్వంతో కూడిన వృద్ధికి, సామాజిక సమగ్రాభివృద్ధిని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారిని, ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్), ఆకాంక్షాత్మక జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా వ్యూహాత్మక లక్ష్యం పెట్టుకుంది.

2026-27 ఆర్థిక సంవత్సరంలో బలమైన పనితీరు:

ఈ నిధుల విడుదలకు ముందు 2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు పీఎంఈజీపీ ద్వారా రూ. 794.52 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీతో ఇప్పటికే 25,895 సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు అందింది. ప్రస్తుతం రూ. 1,000 కోట్ల సబ్సిడీ విడుదలతో ఈ పథకం దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధిని, ఉపాధి కల్పనను మరింత వేగవంతం చేస్తుందని... ఆత్మనిర్భర్, సమగ్ర, ఉపాధి ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ దృక్పథాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... ప్రాథమిక స్థాయిలో ఆర్థిక వృద్ధిని నడిపించటంలో, ఆవిష్కరణలను పెంపొందించటంలో, ఉపాధిని సృష్టించటంలో సూక్ష్మ పరిశ్రమల కీలక పాత్రను స్పష్టం చేశారు. ఆశావహ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు పారిశ్రామిక ఆకాంక్షలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచుకునేందుకు తగిన సంస్థాగత మద్దతును పొందేలా చూసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పీఎంఈజీపీ పరిధిని మరింత విస్తరించేందుకు, సుస్థిర ఉపాధి మార్గాలను సృష్టించేందుకు, స్థానిక తయారీ, సేవలను ప్రోత్సహించేందుకు, సమగ్ర, విస్తృతమైన ఆర్థికాభివృద్ధి ద్వారా వికసిత్ భారత్ సాధనకు తోడ్పడేలా పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2330038) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Malayalam