మంత్రిమండలి
azadi ka amrit mahotsav

కంటైనర్ల తయారీ ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 3:42PM by PIB Hyderabad

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, రూ. 10,000 కోట్ల వ్యయ అంచనాతో 'కంటైనర్ల తయారీ ప్రోత్సాహక పథకాని'కి (సీఎంపీఎస్) ఆమోదం తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2039-40 వరకు అమలులో ఉండే ఈ పథకం.. భారత్‌లో ప్రపంచస్థాయిలో పోటీపడగలిగే కంటైనర్ల తయారీ వ్యవస్థను నెలకొల్పడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సరఫరా గొలుసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ పథకం కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కంటైనర్ల తయారీ యూనిట్ల విస్తరణకు మద్దతు ఇస్తుంది.

ఈ కంటైనర్ల తయారీ ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2026–27లో అధికారికంగా ప్రకటించారు.

ఈ పథకంలోని ప్రధాన విభాగాలు:

  1. వడ్డీ రాయితీ సహాయం (ఐఎస్ఏ- ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ అసిస్టెన్స్): నూతన (గ్రీన్ ఫీల్డ్) కంటైనర్ల తయారీ సంస్థల ఏర్పాటుకు, ప్రస్తుతం ఉన్న కంటైనర్ తయారీ సామర్థ్యాల విస్తరణకు (బ్రౌన్ ఫీల్డ్) తయారీదారులు పొందే అర్హత కలిగిన మూలధన రుణాలపై ఏటా 3 శాతం వడ్డీ రాయితీని అందించడానికి రూ. 859 కోట్ల కేటాయింపులు చేశారు. 

  2. కార్యాచరణ వ్యయ సహాయం (ఓఈఏ- ఆపరేషనల్ ఎక్స్‌పెండీచర్ అసిస్టెన్స్): అంతర్జాతీయ షిప్పింగ్ ప్రమాణాలకు అనుగుణంగా కంటైనర్లను తయారు చేసి విక్రయించే అర్హత కలిగిన తయారీదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూ. 8,891 కోట్లను కేటాయించారు. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే కంటైనర్ల పోటీతత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది.

  3. పరీక్షలు, ధ్రువీకరణ సహాయం (టెస్టింగ్, సర్టిఫికేషన్ అసిస్టెన్స్) కింద 'డైనమిక్ లాంగిట్యూడినల్ ఇంపాక్ట్ టెస్టింగ్' వంటి ఉమ్మడి పరీక్షా, ప్రామాణికీకరణ మౌలిక వసతుల ఏర్పాటుకు మద్దతుగా రూ. 150 కోట్లను కేటాయించారు.

మొత్తం ప్రభావం:

  • వార్షిక దేశీయ కంటైనర్ తయారీ సామర్థ్యాన్ని దాదాపు పదిరెట్లు పెంచి 7.5 లక్షల 'టీఈయూ' స్థాయికి తీసుకెళ్లడం.

  • నాణ్యమైన షిప్పింగ్ కంటైనర్ల తయారీలో భారతదేశాన్ని ప్రపంచ ఎగుమతి కేంద్రంగా నిలిపేలా అంతర్జాతీయ పోటీతత్వం కలిగిన తయారీ వ్యవస్థను నిర్మించడం.

  • భారతీయ సముద్ర రవాణా, లాజిస్టిక్స్ సరఫరా గొలుసు వ్యవస్థల స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం.

  • కార్నర్ క్యాస్టింగ్స్, ప్రత్యేక ఉక్కు (స్పెషలైజ్డ్ స్టీల్), చెక్క ఫ్రేమ్‌లు, పెయింట్‌లు వంటి అనుబంధ పరిశ్రమలకు నిలకడైన మద్దతు ఇవ్వడంతో పాటు దాదాపు 3000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 50000 కంటే ఎక్కువ పరోక్ష ఉద్యోగాలను సృష్టించడం

 

***


(రిలీజ్ ఐడి: 2329588) సందర్శకుల సూచీ సంఖ్య : : 16