లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

“ప్రజా కేంద్రక ప్రగతి కోసం చట్టసభలకు ప్రోత్సాహం”


12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సంయుక్త ప్రకటన-న్యూఢిల్లీ, 26-27 అక్టోబరు 2026

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 5:41PM by PIB Hyderabad

1.         భారత్‌లోని న్యూఢిల్లీలో “ప్రజా కేంద్రక ప్రగతి కోసం చట్టసభలకు ప్రోత్సాహం” ఇతివృత్తంగా 2026 అక్టోబరు 26–27 తేదీలలో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశం నిర్వహించుకున్నాం. బ్రిక్స్‌ సభ్యత్వం గల భారత్‌, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని చట్టసభల అధిపతులు, ప్రతినిధులుగా మేమంతా ఇందులో పాల్గొన్నాం.

2.        ఈ సమావేశం వేదికగా బ్రిక్స్‌ సభ్య దేశాల భాగస్వామ్యాన్ని మేం హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అంతర-పార్లమెంటరీ సహకారం దిశగా వారి అమూల్య కృషిని ప్రశంసించాం. ఇందులో పాలుపంచుకున్న దేశాలతో సార్వజనీన, పరస్పర ప్రయోజన, అభివృద్ధి ఆధారిత భాగస్వామ్య విస్తరణపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్‌ కార్యక్రమాలలో, సంయుక్త ప్రయోజన రంగాల పరంగా ఆచరణాత్మక సహకారంలో భాగస్వామ్య విస్తరణ దిశగానూ ఆ దేశాలను ప్రోత్సహిస్తాం.

3.        సమతుల, సార్వజనీన, దూరదృష్టి సహిత విధానంలో ఉమ్మడి సవాళ్ల పరిష్కారం కోసం బ్రిక్స్ సహకార బలోపేతంపై సంయుక్త నిబద్ధతను ప్రకటించాం. ఈ మేరకు “పునరుత్థానం.. ఆవిష్కరణ.. సహకారం.. సుస్థిరత కోసం కృషి” ఇతివృత్తంగా 2026లో భారత్‌ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు మద్దతు తెలిపాం.

4.        తదనుగుణంగా 2026 సెప్టెంబరు 12-13 తేదీలలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసిన భారత్‌కు అభినందనలు తెలుపుతూ న్యూఢిల్లీ తీర్మానానికి ఆమోదంపై హర్షం ప్రకటిస్తున్నాం. ఈ ఏడాది చివరిదాకా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చేలా తోడ్పాటునిస్తాం.

5.        బ్రిక్‌ కూటమి సహకారానికి రాజకీయం-భద్రత, ఆర్థిక-ద్రవ్య, సాంస్కృతిక-ప్రజల మధ్య ఆదానప్రదాన రంగాలు మూడు మూల స్తంభాలు. వీటి ప్రాతిపదికగా సభ్య దేశాల చట్టసభ సంబంధిత రాజ్యాంగ అధికారాలు-బాధ్యతల పరిధిలో బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి శాసనపరమైన మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్‌ తారకమంత్రమైన “పరస్పర గౌరవం, అవగాహన, సమానత్వం, సంఘీభావం, స్వేచ్ఛ, సార్వజనీనత, ఏకాభిప్రాయం” స్ఫూర్తిపై నిబద్ధతను కూడా మరోసారి ప్రస్ఫుటం చేస్తున్నాం.

6.        మన దేశాలు-ప్రజల మధ్య పరస్పర అవగాహన, స్నేహం, సహకారం విస్తృతిలో బ్రిక్స్ సాంస్కృతిక-ప్రజల మధ్య ఆదానప్రదాన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత్‌ అధ్యక్షతన సంస్కృతి, క్రీడలు, కళలు, విద్య, మహిళలు, యువజన వ్యవహారాలు సహా వివిధ రంగాలలో అత్యంత కీలకమైన ప్రజల మధ్య సంబంధాల కొనసాగింపును స్వాగతిస్తున్నాం. సంస్కృతీ వైవిధ్యంపై గౌరవం సహా వారసత్వం, ఆవిష్కరణ, సృజనాత్మకతలకు తగిన ప్రాముఖ్యం దిశగా ప్రజల మధ్య పటిష్ట అంతర్జాతీయ ఆదానప్రదాన  సహకారాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాం. “నాగరికతల మధ్య సంబంధాల దిశగా అంతర్జాతీయ దినోత్సవం” పేరిట ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ తీర్మానం ఎ/ఆర్‌ఈఎస్‌/78/286కు ఆమోదాన్ని గుర్తుచేసుకుంటున్నాం.

7.        ఐక్యరాజ్యసమితి పత్రంలో పొందుపరచిన సార్వభౌమ సమానత్వం, పరస్పర గౌరవం, అంతర్గత వ్యవహారాలలో తటస్థత, అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారం తదితర సూత్రాలను ప్రపంచ స్థిరత్వం, శాంతి, ప్రగతికి పునాదులుగా పరిగణిస్తూ వాటికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తున్నాం.

8.        బ్రిక్స్ సహకార చట్రంలో అంతర-పార్లమెంటరీ సహకారం ఓ కీలక భాగమని ప్రకటిస్తున్నాం. దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపు, విశ్వాసం ఇనుమడింపు, అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారానికి మద్దతు, మన అంతర్జాతీయ సహకార బలోపేతం, సార్వజనీనత, సంఘీభావం, సుస్థిర ప్రగతి విలువలకు ప్రోత్సాహంలో ఇదొక ప్రత్యేక మార్గం కాగలదు. దీనికి సంబంధించి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ పాత్రను మేం పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ సభ్య దేశాల చట్టసభల మధ్య అంతర-పార్లమెంటరీ చర్చలు, సహకార బలోపేతంలో గత 11 సమావేశాల ద్వారా ఫోరమ్ గణనీయంగా కృషి చేయడాన్ని ప్రశంసిస్తున్నాం.

9.        పేద దేశాల గళం మరింతగా వినిపించేలా అంతర పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) సహా అంతర్జాతీయ పార్లమెంటరీ వేదికలలో బ్రిక్స్ పరస్పర సహకార బలోపేతానికి మేం సిద్ధం. దీనికి సంబంధించి ‘ఐపీయూ’లో ‘బ్రిక్స్ ప్లస్’ పేరిట భౌగోళిక-రాజకీయ బృందం ఏర్పాటు ప్రతిపాదనపై పరిశీలనకు రష్యా చొరవ చూపడాన్ని ప్రశంసిస్తున్నాం.

10.     బ్రిక్స్ 12వ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశంలో నిర్మాణాత్మక అంతర-పార్లమెంటరీ చర్చలపై హర్షం ప్రకటిస్తున్నాం. ఈ సంభాషణ చర్చల పునరుత్థాన బలోపేతంలో  వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం అవశ్యమని అంగీకారానికి వచ్చాం. ఈ దిశగా డిజిటల్ సాంకేతికతల వినియోగం, మరింత ప్రాతినిధ్య-సార్వజనీన ప్రపంచ పాలనకు ప్రోత్సాహం, సుస్థిరత ఊతం అవసరమని పేర్కొన్నం. సుస్థిర ప్రగతి లక్ష్యాలు సహా 2030 సుస్థిర ప్రగతి అజెండా అమలుకు సామూహిక అంతర్జాతీయ చర్యలను వేగిరపరచడంలో చట్టసభల పాత్రపైనా ఈ సమావేశం దృష్టి సారించింది.

11.      జాతీయ విధానాలు-నిబంధనల మేరకు సమతుల-సమీకృత పద్ధతిలో సుస్థిర ప్రగతి కార్యక్రమం-2030, దాని సమగ్ర ప్రజోపయోగ లక్ష్యాలు, నిర్దేశిత ఆశయాల అమలుకు శ్రద్ధగా కృషి చేస్తామని పునరుద్ఘాటిస్తున్నాం. అన్ని రూపాల్లోని పేదరిక నిర్మూలనను అత్యంత కీలక ప్రపంచ సమస్యగా, సుస్థిర ప్రగతికి ఇదొక ప్రతిబంధకంగా గుర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో 2030 కార్యక్రమాన్ని వినూత్నంగా, సమన్వయంతో, పర్యావరణ హితంగా, సార్వజనీనంగా, సంయుక్త విధానంలో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. ఆ తర్వాత సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ కార్యాచరణ రూపకల్పనలో బ్రిక్స్ దేశాల సన్నిహిత సహకారం, గణనీయ తోడ్పాటును కూడా ఆశిస్తున్నాం.

12.     వాతావరణ మార్పు సమస్యల పరిష్కార ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ- విభిన్న జాతీయ పరిస్థితుల దృష్ట్యా సమానత్వం, సమష్టి-విభిన్న బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాల సూత్రాన్ని ప్రతిబింబిస్తూ తగురీతిలో యూఎన్‌ఎఫ్‌సీసీసీ లక్ష్యాలను, పారిస్ తీర్మానాంశాలను అమలు చేస్తూ లక్ష్యాలను సాధించాలి. ఈ దృక్కోణంలో చర్చలు, అంతర్జాతీయ సహకారంతో జాతీయ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. అలాగే, ఉపశమన-అనుసరణ కృషి బలోపేతం, నిష్పాక్షిక పరిణామశీల మార్గాలను ప్రోత్సహించే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేయాలని పిలుపునిస్తున్నాం. నిబంధనానుసరణ దిశగా పరస్పరం అంగీకరించిన సూత్రాల  ప్రకారం వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అదనపు, ఊహించదగిన, సౌలభ్య ఆర్థిక వనరులను తగుమేర సమకూర్చాలి. అలాగే, సామర్థ్య వికాస మద్దతు, సాంకేతిక ప్రగతి బదిలీపై శ్రద్ధ వహించాలని కోరుతున్నాం.

13.     కృత్రిమ మేధ (ఏఐ), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సహా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాల పరివర్తనాత్మక సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం. ప్రతి దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రతను గౌరవిస్తూ- ఐసీటి సంబంధిత వాతావరణం యొక్క బహిరంగ, సురక్షిత, భద్రమైన, స్థిరమైన, సార్వత్రిక, సౌలభ్య, శాంతియుత, పరస్పర అనుసంధాన సహిత వినియోగం, అభివృద్ధికి భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రస్ఫుటం చేస్తున్నాం.

14.     అందరికీ ఆర్థిక వృద్ధి, సుస్థిర ప్రగతికి ఉత్ప్రేరకంగా ఏఐ అపార అవకాశాలు కల్పిస్తుందని గుర్తిస్తున్నాం. సురక్షిత, భద్రమైన, సమ్మిళిత, విశ్వసనీయ ఏఐ అభివృద్ధి-వినియోగానికి భరోసా ఇవ్వాలి. అంతేగాక జాతీయ ప్రాథమ్యాలు, వర్తించే చట్టాలకు అనుగుణంగా ఏఐ వనరుల సమాన లభ్యతను పెంచాలి. సామర్థ్య వికాసం, జ్ఞాన సముపార్జన, అవకాశాల కల్పనలో అంతర్జాతీయ సహకారానికి గల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తున్నాం. దీంతోపాటు ఏఐ వ్యవస్థల శక్తిసామర్థ్యాలకు ప్రోత్సాహం, విజ్ఞానం-ఆవిష్కరణల పెంపు, ఆర్థిక వృద్ధి-సామాజిక శ్రేయకు ఏఐ వినియోగం, సంభావ్య నష్టాల తగ్గింపు వంటివి అన్ని దేశాలకూ అవసరం, ముఖ్యంగా పేదల దేశాల సముచిత, నిష్పక్షపాత, సమాన,  సంపన్న భవిష్యత్తును ప్రోత్సహించడానికి ఇవన్నీ తప్పనిసరి. సమాచార గోప్యత, వ్యక్తిగత సమాచార భద్రతల పరిరక్షణ సహా పటిష్ట జాతీయ సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు ద్వారా బ్రిక్స్ సభ్య దేశాల డిజిటల్ సార్వభౌమత్వ బలోపేతం అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం.

15.     పార్లమెంటరీ పరిశోధన, విశ్లేషణ, ప్రచారం, పౌర సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ తదితర పార్లమెంటరీ విధుల బలోపేతం  దిశగా డిజిటల్ సాంకేతికతలు, ఏఐ-ఆధారిత పరిష్కారాల వినియోగానికి గల గణనీయ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం. చట్టసభలు, నవ్యావిష్కరణల కోసమే కాకుండా సాంకేతిక ప్రగతి  నుంచి సమాన ప్రయోజనం కోసం డిజిటల్ సాంకేతికతలు, ఏఐ-సామర్థ్యం గల ఉపకరణాల వినియోగంలో విజయవంతమైన దృష్టాంతాలు, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానానికి బ్రిక్స్ చట్టసభలను మేం ప్రోత్సహిస్తున్నాం.

16.     అన్ని దేశాలకూ సార్వత్రిక, అర్థవంతమైన అనుసంధానంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఆర్థికాభివృద్ధి, సామాజిక సార్వజనీనత, ప్రభుత్వ సేవల ప్రదానం మెరుగుదల, పునరుత్థాన సామర్థ్యం, ఆవిష్కరణల పెంపు, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు (డీపీఐ) సహా కనీస సౌకర్యాల విస్తరణ సౌలభ్యం కోసం సమష్టి కృషిని ప్రోత్సహిస్తున్నాం. దీనికి సంబంధించి బ్రిక్స్ దేశాల కోసం ‘డీపీఐ’ భాండాగారం ఏర్పాటు ప్రతిపాదన సహా బ్రిక్స్ దేశాల డిజిటల్ పరివర్తన దిశగా ‘డీపీఐ’ పరిష్కారాల ప్రయోగాత్మక ప్రాజెక్టులను ప్రశంసిస్తున్నాం.

17.     విస్తృత సంప్రదింపులు, సమష్టి సహకారం, భాగస్వామ్య ప్రయోజనాల స్ఫూర్తితో మరింత నిష్పాక్షిక, సమాన, చురుకైన, ప్రభావశీల, సమర్థ, స్పందనాత్మక, ప్రాతినిధ్య, చట్టబద్ధ, ప్రజాస్వామ్య, జవాబుదారీగల అంతర్జాతీయ-బహుపాక్షిక వ్యవస్థకు ప్రోత్సాహం ద్వారా ప్రపంచ పాలనలో సంస్కరణలపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. బహుళ ధ్రువ, బహుపాక్షిక వాదం, ఆధునిక మార్కెట్లు, వర్ధమాన దేశాలు, తమ సామర్థ్యం గ్రహించి సార్వత్రిక, ప్రయోజనకర, సమ్మిళిత, సుస్థిర, సమాన ఆర్థిక ప్రపంచీకరణ-సహకారం ఆస్వాదన దిశగా అవకాశాలు విస్తరించగలవని అంగీకరిస్తున్నాం. సానుకూల మార్పులకు చోదకంగా పేద దేశాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాం. స్వచ్ఛంద ప్రగతి సహకారం, సామర్థ్య వికాసం సహా సంబంధిత సమస్యలు-ప్రాధాన్యాలపై గళమెత్తడంలో బ్రిక్స్ పాత్రను పునరుద్ఘాటిస్తున్నాం.

18.     సభ్యదేశాల్లోని చట్టసభల సంబంధిత రాజ్యాంగ ఆదేశాలు-అధికారాల పరిధిలో మరింత ప్రాతినిధ్య-సార్వజనీన, సమ్మిళిత ప్రపంచ పాలన స్వరూపం దిశగా పార్లమెంటరీ దౌత్యం, అంతర-పార్లమెంటరీ చర్చలు-సహకారం పాత్రను పునరుద్ఘాటిస్తున్నాం.

19.     బహుపాక్షికవాద బలోపేతం, అంతర్జాతీయ చట్టం సహా దానికి మూలస్తంభమైన ఐక్యరాజ్యసమితి పత్రంలో పొందుపరచిన ప్రయోజనాలు-సూత్రాలను  సమర్థించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ, సుస్థిర ప్రగతి కొనసాగింపు, అందరికీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛపై ప్రోత్సాహం-రక్షణకు భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాం. జాతీయ పరిస్థితులు, వ్యవస్థల వైవిధ్యం, అభివృద్ధి మార్గాలను గౌరవిస్తూ- అంతర్జాతీయ చట్టం ప్రకారం దేశాల బాధ్యతలకు అనుగుణంగా, పరస్పర ప్రయోజనకర సహకారం అవసరం. దీని ఆధారంగా అంతర్జాతీయ సమాజానికి ఉజ్వల ఉమ్మడి భవిష్యత్‌ కల్పన లక్ష్యంతో సార్వభౌమ దేశాలు సహకరించే అంతర్జాతీయ వ్యవస్థలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్రను మేం స్పష్టం చేస్తున్నాం.

20.    ప్రస్తుత అంతర్జాతీయ శాంతిభద్రతల వ్యవస్థను సంస్కరించాల్సిన ఆవశ్యకతను మేం ప్రస్ఫుటం చేస్తున్నాం. ఈ దిశగా బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం తప్పనిసరి. అలాగే, భద్రత మండలి సహా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణల డిమాండ్‌కు మేం మద్దతిస్తున్నాం. ఈ సంస్కరణ ద్వారా దీన్ని మరింత న్యాయబద్ధం, సమానం, ప్రజాస్వామ్యయుతం, ప్రాతినిధ్య సహితం, ప్రభావశీలం, సమర్థత గల వ్యవస్థగా మార్చాలి, అలాగే, సమకాలీన వాస్తవాలను, అంతర్జాతీయ సమాజ నిబంధనలను ఇది మరింత మెరుగ్గా ప్రతిబింబించాలి. ఈ విషయంలో బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్-2026లో 13వ పేరాలోగల ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం.

21.     బ్రిక్స్ సభ్య దేశాలు సహా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడులతో పాటు అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనలన్నింటినీ మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే, మానవతా సాయాన్ని అడ్డుకోవడం, సంబంధిత సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా నిరసిస్తున్నాం. ఈ విషయంలో బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్-2026లోని పేరా 29ని పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనలన్నింటికీ సంబంధిత దేశాలు జవాబుదారీగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. అంతర్జాతీయ మానవతా చట్టంపై గౌరవం, కట్టుబాటు, సమర్థ అమలు దిశగా ప్రోత్సహించడానికి బ్రిక్స్ సభ్యుల దేశాలు చేపట్టిన అంతర్జాతీయ కృషిని మేము ప్రశంసిస్తున్నాం.

22.    మధ్యప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ పెరగడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మా సంబంధిత జాతీయ వైఖరులను గుర్తుచేసుకుంటూ- గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రం చేసే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నాం. అంతేగాక ఆయా దేశాల సార్వభౌమత్వం-ప్రాదేశిక సమగ్రతపై గౌరవం సహా ఐక్యరాజ్యసమితి పత్రం సంపూర్ణత-పరస్పర సంబంధం లక్ష్యాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులతోపాటు పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి భద్రతలు, స్థిరత్వానికి దోహదం చేసే దీర్ఘకాలిక అవగాహన దిశగా చర్చలు-దౌత్యం ద్వారా ముమ్మర కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాం. వర్తించే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, ప్రపంచ వాణిజ్యం, సరఫరా శ్రేణి, ఇంధన సరఫరా సజావుగా సాగేందుకు సమష్టి కృషి అవసరాన్ని మేం స్పష్టం చేస్తున్నాం.

23.    అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఏకపక్ష బలప్రయోగ చర్యలను మేం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏకపక్ష ఆర్థిక-అనుబంధ ఆంక్షల రూపంలో చేపట్టే ఇలాంటి చర్యలు, లక్షిత దేశాల సామాన్య జనజీవన పురోగమనం, ఆరోగ్యం, ఆహార భద్రత సహా మానవ హక్కులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి పత్రం నిర్దేశఙత సూత్రాలు-ఉద్దేశాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ చర్యల ఉపసంహరణకు పిలుపునిస్తున్నాం.

24.    ప్రపంచంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడినా-  ఉద్దేశంతో నిమిత్తం లేకుండా వాటిని పూర్తి నేరపూరితమైనవిగా పరిగణిస్తూ సమర్థించరానివిగా ప్రకటించి తీవ్రంగా ఖండిస్తాం. ఈ మేరకు 2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల మారణకాండను అత్యంత తీవ్రస్థాయిలో  ఖండించాం. ఈ ఊచకోతలో 26 మంది అమరులు కాగా, మరెందరో గాయపడ్డారు. సరిహద్దులు దాటడంలో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, సురక్షిత ఆశ్రయ కల్పన సహా ఉగ్రవాద రూపాలు, వ్యక్తీకరణను నిరోధించడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. మతం, జాతీయత, నాగరికత లేదా జాతుల సమూహంతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టరాదని స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న, వారికి మద్దతిచ్చిన వారందరినీ సంబంధిత జాతీయ-అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యులను చేస్తూ న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని పునరుద్ఘాటిస్తున్నాం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, ఉగ్రవాద నిరోధంలో ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాం.

       అలాగే, ఉగ్రవాద నిర్మూలనలో అన్ని దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తుచేస్తున్నాం. ఉగ్రవాద ముప్పు నివారణ-నిర్మూలన దిశగా ఐక్యరాజ్యసమితి పత్రం సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ప్రత్యేకించి ఆయా చట్టాల ఉద్దేశాలు-సూత్రాలతపాటు అవన్నీ వర్తించే రీతిలో సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలు-విధివినాలకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు సాగాలి. ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, శరణార్థుల చట్టం, మానవతా చట్టాల పరిధిలో ఉండాలి. బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక, సీటీడబ్ల్యూజీ పత్రం ప్రాతిపతికగా ఏర్పాటైన బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యవర్గం సహా దాని 5 ఉప బృందాల కార్యకలాపాలను స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధంలో సహకారం మరింత విస్తృతం కావాలని ఆశిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి చట్రంలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరితగతిన ఖరారు చేసి, ఆమోదించాలని పిలుపునిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైనా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

25.    అంతర్జాతీయ చట్టం, సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల మేరకు పాలస్తీనా ప్రజలగల స్వీయ నిర్ణయాధికారం, స్వేచ్ఛ, స్వతంత్రం, సార్వభౌమ రాజ్య హక్కులను పునరుద్ఘాటిస్తున్నాం. రెండు దేశాలు శాంతిభద్రతలతో సహజీవనం సాగించే రెండు రాజ్యాల పరిష్కారం ప్రాతిపదికగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు శాంతియుత పరిష్కారంపై దృఢమైన మద్దతును మరోసారి ధ్రువీకరిస్తున్నాం.

26.    సమర్థ అంతర-పార్లమెంటరీ సహకార విస్తృతి, శిక్షణ, సామర్థ్య వికాసాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాం. తదనుగుణంగా సామర్థ్య వికాసం, వృత్తిగత నెట్‌వర్కింగ్ దిశగా పార్లమెంటేరియన్లు-వారి సాంకేతిక, శాసన సలహాదారుల మధ్య అనుభవాల ఆదానప్రదానం, విజ్ఞాన భాగస్వామ్యం, సహకారాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాం.

27.    బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌ 2024 జూలై 11 నాటి సమావేశంలో కుదిరిన అవగాహన ఒప్పందం విధివిధానాల పేరా 8కి అనుగుణంగా క్రీడలపై బ్రిక్స్‌ అంతర-పార్లమెంటరీ కార్యాచరణ బృందం ఏర్పాటుపై రష్యా ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. జాతీయ చట్టాలు-ప్రాధాన్యతల మేరకు క్రీడలు-వ్యాయామ విద్యా రంగంలో అనుభవం, ఉత్తమ పద్ధతుల స్వచ్ఛంద ఆదానప్రదానానికి ఇదొక వేదిక కాగలదు.

28.    బ్రిక్స్ మహిళా పార్లమెంటేరియన్ల ఫోరమ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా, మరింత సమ్మిళిత అంతర-పార్లమెంటరీ చర్చలను ప్రోత్సహించడానికి ప్రస్తుత సమావేశాన్ని ఒక వార్షిక కార్యక్రమంగా సంస్థాగతీకరించాలని పిలుపునిచ్చిన 2016 నాటి జైపూర్ ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాం. బ్రిక్స్ దేశాల చట్టసభల్లోని అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుల సమావేశాల ద్వారా అంతర-పార్లమెంటరీ సంబంధాల బలోపేతాన్ని ప్రోత్సహిస్తాం. పరస్పర అవగాహన విస్తృతికి, అనుభవాలతోపాటు ఉత్తమ శాసన పద్ధతుల ఆదానప్రదాన సౌలభ్యానికి ఈ సమావేశాలు దోహదం చేస్తాయి.

29.    ప్రస్తుత 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌ సమావేశాన్ని విజయవంతం చేయడంపై భారత పార్లమెంటుకు మా అభినందనలతోపాటు ఈ చట్టసభ, ప్రజల ఆతిథ్యంపై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

30.    ఇక బ్రిక్స్‌ కూటమికి 2027లో చైనా అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో మరోసారి సమావేశం కావడానికి సిద్ధంగా ఉన్నాం.

***


(రిలీజ్ ఐడి: 2329302) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Gujarati