నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 12:24PM by PIB Hyderabad
బీహార్ గ్రామీణ బ్యాంకు, దాని ఉద్యోగ సంఘాల మధ్య తలెత్తిన రెండు పారిశ్రామిక వివాదాలు 2026 అక్టోబర్ 22, 23 తేదీల్లో సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యాయి. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయానికి చెందిన పాట్నా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) నిర్వహించిన రాజీ చర్చల ద్వారా ఈ పరిష్కారం లభించింది.
ఈ రాజీ ఒప్పందాల ద్వారా బీహార్ గ్రామీణ బ్యాంక్‌లోని 10,900 మందికి పైగా ఉద్యోగులకు సుమారు రూ.77.69 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. దీనిలో బీహార్ గ్రామీణ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ (బీజీబీడబ్ల్యూవో)తో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా లభించే సుమారు రూ.9.02 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పాట్నాలోని బీహార్ గ్రామీణ బ్యాంక్ అధికారులు, బ్యాంక్ యాజమాన్యానికి మధ్య 2026 అక్టోబర్ 22న కుదిరిన మొదటి రాజీ ఒప్పందం ద్వారా దాదాపు 8,400 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీని విలువ సుమారు రూ.67.17 కోట్లుగా ఉంది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) చెల్లింపు, అదనపు బాధ్యతలు నిర్వర్తించినందుకు చెల్లించే భత్యాలు, వేతనాల పెంపు, ప్రయాణ భత్యాల పెంపు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు తదితర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ఈ ఒప్పందం పరిష్కరించింది.

బీహార్ గ్రామీణ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ (బీజీబీడబ్ల్యూవో), బ్యాంకు యాజమాన్యానికి మధ్య 2026 అక్టోబర్ 23న కుదిరిన రెండో రాజీ ఒప్పందం ద్వారా దాదాపు 2,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా సుమారు రూ 10.52 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు లభించనుండగా, ఇందులో ప్రతి ఏటా అందించే సుమారు రూ. 9.02 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 12వ ద్వైపాక్షిక ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంపు, దివ్యాంగ ఉద్యోగులకు రవాణా భత్యం పెంపు, ఓవర్‌టైమ్ చెల్లింపులు, పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత, సంప్రదింపుల మండలి ఏర్పాటు లాంటి ప్రధాన డిమాండ్లను ఈ ఒప్పందం పరిష్కరించింది.

ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య క్రియాశీలక భాగస్వామ్యం, సహకారంతో చేపట్టిన నిర్మాణాత్మక చర్చల ద్వారా ఈ రెండు రాజీ ఒప్పందాలు కుదిరాయి. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి, పారిశ్రామిక సామరస్యాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి.
ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం, న్యాయమైన కార్మిక విధానాలను ప్రోత్సహించడం, సమర్థవంతమైన రాజీ చర్చలు, నిర్మాణాత్మక సంప్రదింపుల ద్వారా సామరస్యపూర్వక పారిశ్రామిక సంబంధాలను పెంపొందించడంలో చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) సంస్థకు ఉన్న అంకితభావానికి ఈ విజయవంతమైన రాజీ ప్రయత్నాలు నిదర్శనంగా నిలుస్తాయి.
***