శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 1:46PM by PIB Hyderabad
భారతదేశ స్వదేశీ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటంలో, అంతరిక్ష విభాగానికి సుస్థిరమైన మార్గాలను సుగమం చేయటంలో కీలక ముందడుగు పడింది. నవీ ముంబయికి చెందిన మనస్తు స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టీడీబీ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి ద్వారా ఈ సంస్థకు రూ. 116 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 277.63 కోట్లు కాగా, 5 ఎంఎన్ నుంచి 300 ఎన్ థ్రస్ట్ క్లాస్ పరిధిలో ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్ కోసం సమగ్రమైన, స్కేలబుల్ గ్రీన్ ప్రొపల్షన్ వ్యవస్థను అభివృద్ధి చేయటం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నాలజీ రెడీనెస్ లెవల్ (టీఆర్ఎల్)-6 నుంచి టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా ఈ ప్రొపల్షన్ సిస్టమ్ తదుపరి అభివృద్ధి, పరీక్షలు, వాడకానికి మార్గం సుగమం అవుతుంది. ఈ ఆర్థిక సహాయాన్ని ఐచ్ఛికంగా మార్చుకోగలిగిన రుణం (ఓసీడీ) ద్వారా అందజేస్తారు.
ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్‌కు పూర్తిస్థాయి ప్రొపల్షన్ పరిష్కారాన్ని అందించేలా మనస్తు స్పేస్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో గ్రీన్ ప్రొపల్షన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికతలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆధారిత గ్రీన్ ప్రొపెల్లెంట్‌ను, తదితర మిశ్రమాలను ఉపయోగిస్తున్నారు. దీనికి తగినట్లుగా ప్రత్యేక ఇంజిన్, ఉత్ప్రేరక వ్యవస్థను అనుసంధానించారు. సంప్రదాయ ప్రొపెల్లెంట్లతో ఎదురయ్యే నిర్వహణ సవాళ్లను అధిగమిస్తూ, మెరుగైన పనితీరుతో పాటు ఖర్చును కూడా తగ్గిస్తుంది.
ఈ సాంకేతికతలో మరో ముఖ్యమైన అంశం... స్కేలబుల్ ఆర్కిటెక్చర్. చిన్న ఉపగ్రహాల నుంచి అధిక థ్రస్ట్ అవసరమయ్యే వ్యవస్థల వరకు అన్ని రకాల ప్రొపల్షన్ అవసరాలను ఇది తీర్చగలదు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రొపల్షన్ ఇంజిన్లు, ప్రొపెల్లెంట్ ఫీడ్ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు కఠినమైన పరిస్థితుల్లోనూ విశ్వసనీయమైన పనితీరును కనబరిచేందుకు అల్ట్రా-హై-టెంపరేచర్ సిరామిక్ ఉత్ర్పేరకాన్ని కూడా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రొపల్షన్ వ్యవస్థను అంతరిక్షంలో విజయవంతంగా ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాంకేతిక బేస్‌ను మరింత అభివృద్ధి చేయటం, సిస్టమ్ ఇంటిగ్రేషన్, పరీక్షలు నిర్వహించటం ద్వారా పనితీరును మెరుగుపరుస్తారు. తద్వారా ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్ రంగాల్లో దీన్ని విస్తృతంగా వినియోగించేందుకు విశ్వాసం, సంసిద్ధత ఉంటాయి. అంతరిక్ష రంగంలో ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా, మరింత సమర్థవంతమైన ఉపగ్రహ నిర్వహణతో పాటు అంతరిక్ష ప్రయోగాల భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచటంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
డీప్ టెక్నాలజీ రంగానికి చెందిన ఈ ప్రాజెక్టులో స్పేస్ టెక్నాలజీ ఉప రంగంగా ఉంది. స్వదేశీ ప్రొపల్షన్ అభివృద్ధికి మద్దతివ్వటం ద్వారా అంతరిక్ష విలువ వ్యవస్థలోని కీలక విభాగంలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవటంతో పాటు, విదేశీ సాంకేతికతల మీద ఆధారపడటాన్ని తగ్గించటం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఈ ఒప్పందంపై టీడీబీ సెక్రటరీ శ్రీ రాజేశ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ... “భారతదేశ అంతరిక్ష విలువ వ్యవస్థను బలోపేతం చేయటంలో స్వదేశీ ప్రొపల్షన్ సాంకేతికతలు ఎంతో ముఖ్యం. దేశ అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో... పనితీరు, విశ్వసనీయత, భద్రత, వ్యయ నియంత్రణలను సమపాళ్లలో అందించే ప్రొపల్షన్ వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది. ఆర్డీఐ ఫండ్ ద్వారా అధునాతన దశ నుంచి అమల్లోకి తీసుకువచ్చే సాంకేతిక ఆధారిత కార్యక్రమాలకు టీడీబీ అండగా నిలుస్తోంది. మనస్తు స్పేస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం... స్వదేశీ అంతరిక్ష సాంకేతికతలను ప్రోత్సహించటంలో, అంతరిక్ష ప్రవేశాన్ని మరింత సుస్థిరం చేయటంలో మా నిబద్ధతను తెలియజేస్తుంది” అని అన్నారు.
మనస్తు స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకుడు, సీటీఓ మాట్లాడుతూ... “ఆర్డీఐ ఫండ్ ద్వారా టీడీబీ అందిస్తున్న ఈ సహకారం మా గ్రీన్ ప్రొపల్షన్ సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, సమన్వయం చేసుకునేందుకు ఎంతో దోహదపడుతుంది. పనితీరు, విశ్వసనీయత, తక్కువ ఖర్చుతో కూడిన, సురక్షితమైన ప్రొపల్షన్ వేదికను అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. ఈ సాంకేతికతను టీఆర్ఎల్-9 స్థాయికి చేర్చటంలో, భారతదేశ స్వదేశీ అంతరిక్ష ప్రొపల్షన్ సామర్థ్యాలను బలోపేతం చేయటంలో ఈ భాగస్వామ్యం మాకు ఎంతో ఊతమిస్తుంది” అని తెలిపారు.

***