బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం-6: : బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల కీలక పురోగతి


130.16 లక్షల చదరపు అడుగుల ప్రదేశం శుభ్రత.. పాత వస్తువుల విక్రయం ద్వారా రూ.53.94 కోట్ల ఆదాయం

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 4:35PM by PIB Hyderabad

పరిశుభ్రతను సంస్థాగత విధానంగా మార్చడం, ఈ-వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) ప్రత్యేక ప్రచారం-6లో గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కార్యాలయాల్లో విలువైన స్థలాన్ని ఖాళీ చేయడంతో పాటు, వ్యర్థాల సమర్థ నిర్వహణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అంతర్గత రికార్డుల నిర్వహణను క్రమబద్ధీకరిస్తూ పరిశుభ్రమైన, ఉత్పాదకతతో కూడిన పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు.

 

అక్టోబర్‌ 31 వరకు ఈ కార్యక్రమం అమలు కానుంది. తొలుత 1,565 ప్రదేశాలను శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా..  లక్ష్యాన్ని అధిగమించి 1,696 ప్రదేశాలను సీపీఎస్‌ఈలు శుభ్రం చేశాయి. మొత్తం 130.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పరిశుభ్రం చేశాయి. ఇది నిర్దేశించిన 101.80 లక్షల చదరపు అడుగుల లక్ష్యం కంటే ఎక్కువ.

 

కార్యాలయాల పరిసరాలను మెరుగుపరచడంతో పాటు, వ్యర్థాల సమర్థ నిర్వహణ ద్వారా ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను కూడా ఈ కార్యక్రమం అందించింది. అంచానా వేసిన 10,909 మెట్రిక్‌ టన్నుల లక్ష్యం కంటే అధికంగా మొత్తం 16,158 మెట్రిక్‌ టన్నుల తుక్కు, పనికిరాని వస్తువులను తొలగించి విక్రయించారు. ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.53,94,62,602.45 ఆదాయం సమకూరింది. అంటే సుమారు రూ.53.94 కోట్ల ఆదాయం లభించింది.

 

రికార్డుల నిర్వహణ, డిజిటలైజేషన్‌ చర్యల ద్వారా పరిపాలనా సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. మొత్తం 59,593 ఫైళ్లను పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అధికారులు 78,635 భౌతిక ఫైళ్లు, ఈ-ఫైళ్లను సమీక్షించారు. వీటిలో 70,093 ఫైళ్లను తొలగించి, వాటి ప్రక్రియను ముగించారు. ఇది పరిపాలన, కార్యాలయ విధానాలను మరింత క్రమబద్ధీకరించడాన్ని ప్రతిబింబిస్తోంది.

 

పరిశుభ్రతను సంస్థాగత విధానంగా మార్చడం, స్థిరమైన పరిపాలనా విధానాలను అమలు చేయడంపై తమ నిబద్ధతను చాటుతూ.. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) వినూత్న స్వచ్ఛత కార్యక్రమాలు, సమర్థవంతమైన స్థల నిర్వహణ విధానాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అమలు చేసిన ముఖ్యమైన ఉత్తమ విధానాల్లో కొన్ని....

 

1. పునర్వినియోగ వ్యర్థాలతో ఈ-వ్యర్థాల సేకరణ బిన్‌ ఏర్పాటు: ఎస్‌ఈసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో పునర్వినియోగ తుక్కు పదార్థాలతో ఈ-వ్యర్థాల సేకరణ బిన్‌ను రూపొందించారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను క్రమపద్దతలో సేకరించి, వేరు చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. “ఈ-వ్యర్థాలను సమర్థంగా సేకరించడం, వేరు చేయడం, సరైన విధంగా తొలగించడం”  కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది.

 

2. సీఐఎల్ హెచ్‌క్యూ క్యాంటీన్‌ ఆధునికీకరణ: దాదాపు పదేళ్ల తర్వాత సమగ్రంగా పునరుద్ధరించిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ప్రధాన కార్యాలయ క్యాంటీన్‌కు ‘సిలాంట్రో’గా పేరు మార్చి అక్టోబర్‌ 5న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన, అనుకూలమైన భోజన వాతావరణాన్ని కల్పించేందుకు క్యాంటీన్‌ మౌలిక సదుపాయాలను, పరిసరాలను ఆధునికీకరించారు.

 

3. గిరిజన బాలికలకు డబ్ల్యూసీఎల్‌ విద్యా సహాయం: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా పరాసియాలో ఉన్న మాతా సబ్రీ బాలికల నివాస విద్యా ప్రాంగణంలో 160 మందికి పైగా బాలికలకు విద్యా సహాయంతో పాటు ప్రాథమిక సదుపాయాలను వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) అందించింది. వీరిలో ఎక్కువ మంది గిరిజన, బొగ్గు గనుల ప్రాంతాలకు చెందిన బాలికలే ఉండగా.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారికి ఈ సహాయం అందించారు.

 

4. డబ్ల్యూసీఎల్ ద్వారా పిల్లల కోసం ‘వేస్ట్‌ టు వండర్‌’ శిక్షణా కార్యక్రమాలు: వ్యర్థాలను సృజనాత్మకంగా పునర్వినియోగించడం ద్వారా ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసేలా పిల్లలను ప్రోత్సహించేందుకు డబ్ల్యూసీఎల్‌ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. వ్యర్థాల నుంచి విలువైన వస్తువులను రూపొందించడం ద్వారా చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమాల లక్ష్యం.

 

5. కార్యాలయంలో రుతుస్రావ పరిశుభ్రతను ప్రోత్సహించడం: మహిళా ఉద్యోగులు, సందర్శకులకు రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా కోల్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో శానిటరీ నాప్‌కిన్‌ వెండింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సమ్మిళిత, మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2328824) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil