గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సరస్ మేళా-2026లో... కోట్ల రూపాయల వ్యాపార సంస్థలను నిర్మిస్తున్న 'లఖ్‌పతి దీదీ'ల అనుభవాలు


ఢిల్లీ-ఎన్‌సీఆర్ వెలుపల నిర్వహించిన తొలి జాతీయ సరస్ మేళాలో... స్వయం సహాయక సంఘాల స్థాయి నుంచి వ్యాపార సంస్థల యజమానులుగా ఎదిగిన మహిళలు

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 3:40PM by PIB Hyderabad

నాబార్డ్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, కుటుంబశ్రీ సంస్థల మద్దతుతో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో... భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 'జాతీయ సరస్ మేళా'ను నిర్వహిస్తోంది. సాంప్రదాయిక హస్తకళలు, మహిళల వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ మేళా ఒక చక్కని వేదికగా నిలుస్తోంది. ఆర్థిక స్వాతంత్య్రం దిశగా మహిళలు సాధించిన అద్భుత విజయాలనూ ఇది ప్రతిబింబిస్తోంది.

పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ వెనక... ధైర్యంగా ముందడుగు వేసిన మహిళ కథ ఉంది. తమ నైపుణ్యాలను, హస్తకళలను, తమను తామూ నమ్ముకుని 'లఖ్‌పతి దీదీ' కలను ఈ మహిళలు సాకారం చేసుకుంటున్నారు. ఈ మేళా సందర్భంగా కొందరు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక చిన్న ఆలోచనను లేదా కుటుంబ సాంప్రదాయిక కళను ఒక పెద్ద వ్యాపారంగా ఎలా మార్చారో వారు వివరించారు. బాధ్యతలను స్వీకరించడం, తమ ఉత్పత్తులను ఆదరించిన నగరాలు, ప్రతి అడుగుతో పెరిగిన ఆత్మవిశ్వాసం గురించి వారు తమ మాటల్లో వివరిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరు మహిళల వార్షిక వ్యాపార టర్నోవర్ రూ. 60 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉండటం విశేషం.

పున్నమి ఘాట్‌లోని స్టాళ్ల గుండా నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి కౌంటర్... ఒక్కో మహిళ విజయాన్ని ప్రదర్శిస్తుంది. విజయవాడకు ఎంతో దూరం నుంచి ఆయా మహిళలు ప్రారంభించిన తమ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇక్కడ కనిపిస్తుంది.

స్వయం సహాయక సంఘాల కుటుంబానికి చెందిన ఓ మహిళ... ఏడాదికి కనీసం రూ. 1 లక్ష స్థిరమైన ఆదాయాన్ని గడించగలిగితే ఆమెను 'లఖ్‌పతి దీదీ'గా పిలుస్తారు. 2029 నాటికి దేశంలో ఆరు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేయాలనే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ మైలురాయే కేంద్ర బిందువు. దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళలకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక సహాయం, మార్కెట్ సదుపాయాలను అందిస్తూ వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతోంది. ఈ లఖ్‌పతి దీదీలు సాధించిన విజయాల ప్రయాణాలు ఆ మైలురాయికి మించి వారు సాధించిన అద్భుతమైన ప్రగతిని స్పష్టం చేస్తున్నాయి.

లఖ్‌పతి దీదీ అనుభవం: వారి జీవితాల్లో సాధించిన పరివర్తన గాథలు

చంద్రకళ, లోటస్ ఎస్‌హెచ్‌జి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్: ఆమె కొనసాగిస్తున్న జీవనోపాధి హస్తకళ

చంద్రకళ కుటుంబానికి చెందిన చెక్క నకాశీ (వుడ్‌కార్వింగ్) వర్క్‌షాప్ 2002లో ప్రారంభమైంది. అప్పటివరకు వారిది కేవలం వ్యవసాయం చేసే కుటుంబం. అయిదేళ్ల తరువాత అంటే 2007లో... ఆమె భర్త కన్నుమూశారు. దాంతో ఆ వర్క్‌షాప్‌ను నడిపే బాధ్యత చంద్రకళపై పడింది. ప్రారంభంలో వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడం, పని చేసే కళాకారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది. ఆ హస్తకళ అంతా ఆమెకు తెలిసినదే అయినప్పటికీ... కస్టమర్లు, ఖాతాల నిర్వహణ, వ్యాపార నిర్ణయాలు మాత్రం ఆమెకు సరికొత్త అనుభవాలు.

లోటస్ స్వయం సహాయక సంఘం చంద్రకళకు కొండంత అండగా నిలిచింది. ఆమె కష్టాన్ని, బాధ్యతను అర్థం చేసుకుని తోడుగా నిలిచే మహిళలను ఆ సంఘం పరిచయం చేసింది. ఆ తర్వాత ఆమె వ్యాపారం సరిహద్దులు దాటి విస్తరించడం ప్రారంభమైంది. ప్రదర్శనలు, వాణిజ్య ఉత్సవాల్లో పాల్గొనడం కోసం ఆమె చెన్నై, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ వంటి నగరాలకూ వెళ్లారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఆయా నగరాలు సరికొత్త అనుభవాలను అందించాయి. ఒక కొత్త రైల్వే స్టేషన్... ఒక కొత్త స్టాల్... ఇలా ప్రతిచోటా ఆమె తయారు చేసిన చెక్క కళాఖండాన్ని చేతుల్లోకి తీసుకుని తిరగేస్తూ ధర అడిగే కస్టమర్లు ఆమెకు సరికొత్తగా అనిపించేవారు. ఒక ప్రదర్శనలో రోజు ముగియక ముందే తన వద్ద ఉన్న సరుకంతా అమ్ముడైపోయిన క్షణాలను ఆమె ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ప్రస్తుతం తన వ్యాపార సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 1 కోటి దాటింది. ఈ సంస్థ ద్వారా నెలకు దాదాపు రూ. 10 లక్షల జీఎస్టీ చెల్లిస్తూ... 100 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. చంద్రకళ తన ఉత్పత్తులను 'లేపాక్షి ఎంపోరియం' షోరూంల ద్వారా దేశంలోని అనేక నగరాలకు సరఫరా చేస్తున్నారు. మంత్రులు, ప్రముఖులకు కానుకలుగా ఇవ్వడానికీ ఆమె తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేస్తుండటం విశేషం.

చంద్రకళ తదుపరి లక్ష్యం కేవలం ఈ సంపాదన సంబంధిత అంకెలకు మాత్రమే పరిమితమైనది కాదు... అంతకు మించినది. చాలా ఉన్నతమైనది. 'నేను ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ, అలాగే 500 మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలనీ అనుకుంటున్నాను. ఈ విధంగా నా భర్త ఆశయాలను, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను' అని చంద్రకళ ధీమాగా చెబుతున్నారు.

సిద్ధి, మహామాయ స్వయం సహాయక బృందం, ఉత్తర గోవా: సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని నిర్మించుకోవడం

నాలుగేళ్ల కిందట, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన సిద్ధి... ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సొంతంగా ఎత్నిక్ వేర్ (సాంప్రదాయ దుస్తుల) వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వ్యాపారం కోసం ఆమె స్వయంగా నిధులు సమకూర్చుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న సిద్ధి, వినియోగదారులను చేరుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక చక్కని అవకాశంగా మలుచుకున్నారు. 'మహామాయ' స్వయం సహాయక సంఘం ఆమెకు ఎంతో అండగా నిలిచింది. ఆమెతో కలిసి పనిచేయగల మహిళలను అనుసంధానించడంతో పాటు, రుణాలు పొందే మార్గాలపై ఆమెకు మార్గనిర్దేశం చేసింది. ఈ బంధాన్ని పరస్పర సహకార బంధంగా సిద్ధి అభివర్ణిస్తారు. హస్తకళల నైపుణ్యాలు, మార్కెటింగ్‌పై జరిగే వర్క్‌షాప్‌ల సమాచారాన్నీ ఈ సంఘం ఆమెకు ఎప్పటికప్పుడు అందిస్తోంది. వీటిలో సిద్ధి తన బృందంతో కలిసి పాల్గొంటున్నారు.

ప్రస్తుతం ఆమె స్వయంగా శిక్షణనిచ్చిన మహిళలు సహా సుమారుగా ఏడు నుంచి పది మంది సిబ్బందితో సొంతంగా ఒక బోటిక్‌ను నడుపుతున్నారు. అవసరమైనప్పుడు ఆమె స్వయంగా బట్టల కటింగ్ చేస్తారు. వీరి బృందం టైలరింగ్, కుట్టుపని, ముడిసరుకు సేకరణ, ప్యాకింగ్, ప్రదర్శనల్లో సహాయం చేయడం వంటి పనులన్నీ నిర్వహిస్తుంది. సోషల్ మీడియాతో పాటు తన సొంత వెబ్‌సైట్ (blissbysiddhi.in) ద్వారా మార్కెటింగ్‌ బాధ్యతలనూ ఆమె స్వయంగా చూసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చే అంతర్జాతీయ ఆర్డర్లను ఇండియా పోస్ట్ ద్వారా సింగపూర్, యూఏఈ, యూఎస్‌ఏ వంటి మరెన్నో దేశాల కస్టమర్లకు పంపుతున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 60 లక్షలుగా నమోదైంది.

ప్రారంభంలో, ఆమె చుట్టుపక్కల వారు ఈ వ్యాపార ఆలోచనకు పెద్దగా మద్దతునివ్వలేదు. ఆమె ఏదైనా సాధారణ ఉద్యోగంలో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని వారు కోరుకున్నారు. సిద్ధి మాత్రం ఆ నిరాశను పక్కనపెట్టి తన వ్యాపారంతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. 'నా బృందంలో మరింత మంది మహిళలు చేరేలా వారికి సహాయం చేయడమే నా కోరిక' అని ఆమె చెబుతున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, గోవా వ్యాప్తంగా మరో 100 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనీ, వారూ ఆర్థిక స్వాలంబన సాధించేలా తోడ్పడాలని ఆమె ఆశిస్తున్నారు.

కున్వారీ బర్వా, మహిళా వికాస్ మండల్ బాఘిమా పాల్కోట్ ఎఫ్‌పీవో, గుమ్లా, జార్ఖండ్: మహిళా రైతులతో కలిసి రాగుల వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం

కున్వారీ బర్వా ప్రయాణం ఆమె గ్రామంలోని ఒక స్వయం సహాయక బృందంతో మొదలైంది. అక్కడి మహిళలు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఆమె ఇతర మహిళలనూ ఇందులో చేరమని ప్రోత్సహించి, పోగు చేసిన పొదుపు నుంచి రుణం తీసుకుని ఒక ఆవును కొనుగోలు చేసింది. ఆ తర్వాత, బ్యాంకు అనుసంధానిత రుణం ఆమెకు కూరగాయల సాగుకు కావలసిన పరికరాలను కొనుగోలు చేయడంలో సహాయపడింది. తాను పండించిన పంటను అమ్మడం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల చదువుల ఖర్చులను భరించడానికి ఆమెకు ఒక మార్గం దొరికింది.

మహిళా గ్రూపులన్నీ ఏకం కావడంతో వారి వ్యాపారం వేగంగా విస్తరించింది. 2022లో 381 మంది సభ్యులతో వారు ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థను (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 1,501 కి చేరిందని కున్వారీ తెలిపారు. ఈ ఉమ్మడి బృందం రైతులకు రాగుల సాగులో సహాయం చేయడంతో పాటు, పంటను సేకరించి భద్రపరుస్తుంది. రాగి లడ్డూలు, థెకువా, ఇతర రుచికరమైన స్నాక్స్ తయారు చేస్తుంది. గుమ్లా లాంటి చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రారంభమైన వీరి ఉత్పత్తులు.. నేడు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరిగే ప్రదర్శనలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ నెలవారీ ఉత్పత్తుల విక్రయాలు సుమారు రూ. 6 నుంచి 7 లక్షల వరకు చేరినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సంస్థ ప్రస్తుతం 150 మందికి పైగా మహిళలకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది. ఆర్డర్లు పెరిగినప్పుడు మరికొంత మంది మహిళలను పనిలోకి తీసుకుంటోంది. ఈ జాతీయ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశాన్నీ కల్పించాయి. 'మా సంస్థలోని కొందరు మహిళలు అంతకుముందు కనీసం రైలు పట్టాలనైనా చూడలేదు. కానీ ఇప్పుడు మేము రైళ్లలోనే కాకుండా విమానాల్లోనూ ప్రయాణిస్తున్నాం' అని ఆమె సంతోషంగా చెప్పారు.

సింగంపల్లి పార్వతి (భర్త: రామినాయుడు), శ్రీ దుర్గా భవానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్: ఒక చిన్న ప్రారంభం... ప్రస్తుతం సొంత వ్యాపార సామ్రాజ్యం"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలోని నాతవరం గ్రామానికి చెందిన సింగంపల్లి పార్వతి కుటుంబం జీవనోపాధి కోసం ఒక చిన్న పొలం, పాలిచ్చే రెండు గేదెలను కలిగి ఉండేది. ఆమె భర్త రోజువారీ కూలీపైనే ఆ కుటుబం ప్రధానంగా ఆధారపడేది. ఈ మార్గాల ద్వారా కొంత ఆదాయం వచ్చినప్పటికీ ఆ రాబడి... వారి కుటుంబ ఖర్చులకు, అనుకోని ఆర్థిక అవసరాలకు అది సరిపోయేది కాదు. కష్ట సమయాల్లో ఆ కుటుంబం అధిక వడ్డీలకు డబ్బు అప్పు తీసుకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఇది వారి ఆర్థిక భారాన్ని మరింత పెంచింది. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ, పార్వతి సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని బలంగా నిశ్చయించుకున్నారు. పెట్టుబడి కొరత ఆమె ఆశయాన్ని నిజం చేసుకోవడానికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది.

2018లో పార్వతి 'శ్రీ దుర్గా భవానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపు'లో చేరడం ఆమె జీవితంలో అతిపెద్ద మలుపు. ఈ గ్రూపు ద్వారా ఆమె రూ. 20,000 రుణం పొందారు. ఈ డబ్బుతో ఆమె జీడిపప్పు పిక్కలను కొనుగోలు చేసి, విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ మొదటి ప్రయత్నం ఆమెకు మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి, వ్యాపార అనుభవాన్ని పెంపొందించుకోవడానికి, ఒక వ్యాపారవేత్తగా మారే దిశగా తొలి అడుగులు వేయడానికి సహాయపడింది. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలను చూసి ఉత్సాహం పొందిన ఆమె, తర్వాతి సంవత్సరంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మరో రూ. 50,000 రుణం తీసుకుని, రెండు కటింగ్ మిషన్లను కొనుగోలు చేశారు. జీడిపిక్కల నుంచి జీడిపప్పును వేరు చేసే ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించి, ఆ పప్పును తునిలోని వ్యాపారులకు విక్రయించడం మొదలుపెట్టారు. కేవలం జీడిపిక్కల వ్యాపారం చేయడం కంటే, వాటిని ప్రాసెస్ చేసి విక్రయించడం ద్వారా ఆమె తన ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చారు. ఇది ఆమె వ్యాపార వృద్ధిలో, ఆదాయం పెరగడంలోనూ కీలకంగా మారింది.

వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా జీడిపప్పు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని పార్వతి గుర్తించారు. ఆమె ప్రయాణంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపు అందించిన ఆర్థిక సహాయం కీలక పాత్ర పోషించింది. ఆ గ్రూపు ద్వారా పొందిన రూ. 2 లక్షల రుణంతో పాటు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద బ్యాంకు ద్వారా లభించిన రూ. 3 లక్షల ఆర్థిక సహాయం ఆమెకు ఎంతో తోడ్పడ్డాయి. ఈ నిధులతో ఆమె ఒక పెద్ద జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పెట్టుబడి ఆమె వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద వ్యాపార సంస్థ యజమానిగా ఆమె ఎదగడానికి సహాయపడింది.

ప్రస్తుతం పార్వతి తమ కస్టమర్ల విభిన్న అవసరాలకు అనుగుణంగా 11 రకాల గ్రేడ్‌లలో జీడిపప్పును ప్రాసెస్ చేస్తున్నారు. ఆమె తన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. కొత్త మార్కెట్లను చేరుకోవడానికి, తన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఆమె వివిధ జాతీయ ప్రదర్శనల్లోనూ పాల్గొంటున్నారు. ప్రారంభంలో కేవలం రూ. 20,000 రుణంతో చిన్న స్థాయిలో మొదలైన ఆమె వ్యాపారం... నేడు సుమారు రూ. 50 లక్షల వార్షిక టర్నోవర్‌తో ఒక పెద్ద సంస్థగా ఎదగడం ఒక విశేషమైన విజయం.

సకాలంలో లభించే ఆర్థిక సహాయం, సంఘం తోడ్పాటు, వ్యాపార పట్టుదల ఉంటే గ్రామీణ మహిళలు ఎంతటి స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకోగలరో చెప్పడానికి పార్వతి విజయ ప్రయాణం ఒక నిదర్శనం. కుటుంబ ఆదాయానికి అదనపు ఆసరా కోసం ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఆమె ప్రయాణం... నేడు నిరంతరం వృద్ధి చెందుతున్న ఒక పెద్ద ప్రాసెసింగ్ పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు పెట్టుబడి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన ఈ వ్యాపారం... ఇప్పుడు ఆమె కుటుంబ ఆర్థిక శ్రేయస్సుకు అత్యంత కీలకమైన వనరుగా మారింది. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలు సరికొత్త ఆర్థిక అవకాశాలను ఎలా సృష్టిస్తాయో, కుటుంబాల జీవనోపాధిని ఎలా బలోపేతం చేస్తాయో ఈ విజయం స్పష్టం చేస్తోంది.

ఈ విజయ ప్రయాణాలన్నింటి వెనక ఉన్న ఒకే విధమైన సూత్రం - ఒక అద్భుతమైన నైపుణ్యం, ఆ నైపుణ్యాన్ని నమ్మిన కొందరు మహిళల బృందం, ప్రతి ప్రదర్శన లేదా ప్రతి ఆర్డర్ ద్వారా విస్తరిస్తూ వచ్చిన మార్కెట్. జాతీయ సరస్ మేళాలో 'లఖ్‌పతి దీదీ పెవిలియన్'ను సందర్శించే వారు నేరుగా ఈ మహిళలను కలిసి వారి అనుభవాలను తెలుసుకోవచ్చు. కేవలం ఒక నైపుణ్యంతో, సంఘంలో ఒకరిగా ప్రయాణం ప్రారంభించి... నేడు ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని, విస్తృతమైన మార్కెట్ పరిధిని, స్థిరమైన ఆదాయాన్ని వారు ఎలా సాధించారో స్వయంగా వారి మాటల్లో తెలుసుకోవచ్చు.

మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 16 అడుగుల భారీ కళాకృతి 'శక్తి - ది స్పిరిట్ ఆఫ్ లఖ్‌పతి దీదీ' కింద నిలబడి ఉన్న ఈ నలుగురు మహిళలు.. ఈ శిల్పం ప్రతిబింబించే ఎందరో లఖ్‌పతి దీదీల అద్భుత విజయాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నారు.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. మహిళలు కేవలం 'లఖ్‌పతి' మైలురాయితోనే ఆగిపోకుండా, తమ వ్యాపారాలను మరింత పెద్దవిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు కేవలం ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా... తమ ఆదాయం, ఆస్తులపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, కొత్త కస్టమర్లను నేరుగా చేరుకోవడానికి వీలుగా ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో 'సరస్ మేళాలు' నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇది మహిళల ఆర్థిక స్వాలంబనను మరింత బలోపేతం చేస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద తొలిసారిగా జరుగుతున్న ఈ 'జాతీయ సరస్ మేళా' 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.

***


(రిలీజ్ ఐడి: 2328820) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil