నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2026 6:53PM by PIB Hyderabad
భారత నావికాదళం జలాంతర్గామి రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక మహోన్నత ఘట్టం నమోదైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు(డీఆర్‌డీఓ) చెందిన 'నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ' (ఎన్ఎంఆర్ఎల్).. సంపూర్ణ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (ఏఐపీ) వ్యవస్థ ఎనర్జీ మోడ్యూల్ ‘సెట్టింగ్ టు వర్క్ ఫేజ్ (ఎస్టీడబ్ల్యూ)-2’ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ అత్యాధునిక ఏఐపీ వ్యవస్థ.. ఆక్సిజన్ కోసం డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు ఉపరితలానికి రావాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా నీటి లోపల సుదీర్ఘకాలం పాటు ఆటంకం లేకుండా సంచరించే వాటి సామర్థ్యం విశేషంగా పెరుగుతుంది.
2026 అక్టోబర్ 24న గుజరాత్‌లోని హజీరాలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్‌టీ) 'ఏఎమ్ నాయక్ హెవీ ఇంజనీరింగ్ కాంప్లెక్స్'లో ఈ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన- అభివృద్ధి విభాగ కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. భారత నావికాదళ చీఫ్ ఆఫ్ మెటీరియల్స్ వైస్ అడ్మిరల్ బి. శివకుమార్, డీఆర్‌డీఓ నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్. బాలమురళీకృష్ణన్ గుజరాత్‌లోని ఎల్అండ్‌టీ హజీరా ప్రాంగణంలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డీఆర్‌డీఓ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్వదేశీ ఏఐపీ ప్రాజెక్టును షాప్ ఫ్లోర్‌పై ప్రత్యక్ష కార్యాచరణ రూపంలోకి తెచ్చిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను, పారిశ్రామిక భాగస్వాములను అభినందించారు.శాస్త్రపరంగా వారికి ఉన్న పట్టుదల, పారిశ్రామిక సహకారాన్ని ఆయన విశేషంగా కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ప్రతి దశలోని ట్రయల్స్‌తో పాటు పరీక్షలు, ప్రామాణీకరణలలో డీఆర్‌డీఓకు భారత నావికాదళం అందించిన సంపూర్ణ సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్ వ్యవస్థలకు అవసరమైన కఠినమైన భద్రతా ప్రమాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నావికాదళం నిర్దేశించిన కాలపరిమితిలోగా ఏఐపీ వ్యవస్థను జలాంతర్గాముల్లో ప్రవేశపెట్టేందుకు ప్రాజెక్టు తదుపరి దశలను వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తదుపరి దశలో విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ఏఐపీ ఎనర్జీ మోడ్యూల్‌ను కార్యాచరణలోకి తెచ్చి భారత నావికాదళం నిర్దేశించిన కఠినమైన నిబంధనలు, ప్రోటోకాల్స్ ప్రకారం క్షుణ్ణంగా పరీక్షించనున్నారు. అనంతరం 2027 ప్రారంభంలో 'కల్వరి-క్లాస్' జలాంతర్గామిలో ఈ వ్యవస్థను అమర్చడానికి గాను దీనిని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌కు (ఎండీఎల్) అప్పగిస్తారు.
***