నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 8:11PM by PIB Hyderabad
ఢిల్లీ కస్టమ్స్ విభాగంలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ (ఏసీసీ) దిగుమతుల కమిషనరేట్ అధికారులు 2026 అక్టోబర్ 21, 22 తేదీల మధ్య రాత్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థపై కొనసాగుతున్న దర్యాప్తులో మరో కీలక పురోగతి సాధించారు. ప్రాథమిక పరీక్షల్లో స్వాధీనం చేసుకున్న పదార్థం హైడ్రోపోనిక్ గంజాయి (హైడ్రో వీడ్)గా నిర్ధారణ అయింది. మొత్తం 23.220 కిలోల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేశారు.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు రూ.8.12 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, దేశంలో వీటి రిటైల్ అక్రమ విక్రయ విలువ దాదాపు రూ.23 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. మాదకద్రవ్యాలతో పాటు వాటిని అక్రమంగా తరలించేందుకు ఉపయోగించిన దాచిపెట్టే, ప్యాకింగ్ సామగ్రిని కూడా 1985 నాటి మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావిత పదార్థాల చట్టం (ఎన్‌డీపీఎస్ చట్టం) నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.
గతంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన 148.675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో సేకరించిన నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, కస్టమ్స్ అధికారులు మరో అనుమానాస్పద దిగుమతి సరుకును అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఈ సరుకులో దీపాలు ఉన్నట్లు ప్రకటించారు. గతంలో జరిగిన స్వాధీన ఘటన ద్వారా పెద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా బయటపడింది. దీంతో మూడు రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో సమన్వయంతో తదుపరి దర్యాప్తు చర్యలు చేపట్టారు.
2026 అక్టోబర్ 15న తొలి స్వాధీన ఘటనలో అరెస్టయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో వ్యక్తిని విచారించిన అనంతరం ఈ సరుకుపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దిగుమతిదారు సమక్షంలో సరుకును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, చెక్క ప్యాలెట్‌పై అమర్చిన పలు దీపాలు కనిపించాయి. పైకి సాధారణ సరుకులా కనిపించినప్పటికీ, ఎక్స్-రే పరీక్షలో అనుమానాస్పద ఆకృతులు గుర్తించారు. దీంతో చెక్క ప్యాలెట్ అడుగు భాగాన్ని తొలగించి పరిశీలించగా, దాని నిర్మాణంలో దాచిన ఆకుపచ్చని ఆకుల పదార్థంతో కూడిన 23 వాక్యూమ్ సీల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిలో ఆ పదార్థాన్ని ఒత్తిడి చేసి నింపి ఉంచారు.
ఈ తాజా ఆపరేషన్‌లో భాగంగా 2026 అక్టోబర్ 22న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అదే రోజు సాయంత్రం అతడిని సంబంధిత న్యాయస్థాన పరిధిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా స్వాధీనంతో కొనసాగుతున్న దర్యాప్తులో ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 172 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో అక్రమ రవాణా వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలింది.
నిఘా సమాచార ఆధారంగా అమలు చర్యలు చేపట్టడం, ప్రమాద అంచనా విధానాలను మెరుగుపరచడం, వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయంతో పనిచేయడం ద్వారా సమాజాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ఢిల్లీ కస్టమ్స్ కట్టుబడి ఉంది. ఇటువంటి నేర ముఠాలను గుర్తించి, వాటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు.
***