ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలెండ్ ప్రధానితో కలసి ప్రధానమంత్రి చేసిన సంయుక్త పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 2:38PM by PIB Hyderabad

యువర్ ఎక్సలెన్సీ, గౌరవ ప్రధానమంత్రి,

ఉభయ దేశాల ప్రతినిధులకూ,

మీడియా మిత్రులకూ,

నమస్కారం!

భారత్‌లో పోలెండ్ ప్రధానికి ఆత్మీయ ఆతిథ్యం అందించడం నాకు ఆనందాన్నిస్తోంది.

2024లో పోలెండ్‌లో నేను పర్యటించినప్పుడు... నాకూ, నా ప్రతినిధి బృందానికీ ఆయన ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఆ పర్యటనలో మన సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాం.

ఈ బలమైన పునాది ఆధారంగానే గత రెండేళ్లలో మన భాగస్వామ్యం కొత్త వేగాన్ని సంతరించుకుంది. ప్రధానితో ఈ రోజు జరిగిన సమావేశంలో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా అనేక ముఖ్యమైన నిర్ణయాలను మేం తీసుకున్నాం.

మిత్రులారా,

భారత్, పోలెండ్ మధ్య స్నేహం కేవలం దౌత్యపరమైన సంబంధాల్లోనే కాకుండా మానవత్వం, కరుణ అనే అనే ఉమ్మడి వారసత్వంలో నాటుకొని ఉంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వేలాది మంది పోలిష్ చిన్నారులు, కుటుంబాలకు జామ్ నగర్, కొల్హాపూర్ రాజకుటుంబాలు ఆశ్రయమిచ్చాయి. ఇప్పటికీ పోలెండ్ ప్రజలు జామ్ సాహెబ్‌ను ‘‘దోబ్రీ మహారాజా’’గా గౌరవిస్తారు. అంటే ‘‘మంచి మహారాజు’’ అని అర్థం.

2022లో మన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి రావడానికి సాయపడటం ద్వారా ఈ మానవతా స్ఫూర్తిని పోలెండ్ ముందుకు తీసుకెళ్లింది. జామ్ సాహెబ్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా పోలెండ్ యువకులు భారతదేశాన్ని సందర్శిస్తూ... మన చారిత్రక స్నేహ సంబంధాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాను.

మిత్రులారా,

నేడు ప్రపంచం అనిశ్చితి, మార్పులతో నిండిన కాలం గుండా వెళ్తోంది. ఇలాంటి సవాళ్లతో కూడిన సమయంలో సైతం అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలకు ముఖ్యమైన కేంద్రాలుగా భారత్, పోలెండ్ ఎదుగుతున్నాయి.

గతేడాది పోలెండ్ జీడీపీ ఒక ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. ఇది చరిత్రాత్మకం. ఈ విజయానికి గాను ప్రధానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది. 

భారత్–పోలెండ్ భాగస్వామ్యానికి పెరుగుతున్న మన ఆర్థిక సామర్థ్యం కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఈ అవకాశాలను ఇండియా–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరింత విస్తరిస్తోంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన అనంతరం... యంత్రాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ వస్తువులను పోలెండ్‌కు ఎగుమతి చేయడానికి భారత్‌కు కొత్త అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో రైల్వేలు, మొబిలిటీ, అధునాతన తయారీ, ఆహార శుద్ధి, బయోటెక్నాలజీ రంగాల్లో పోలెండ్ నుంచి కొత్త పెట్టుబడులను సమీకరిస్తాం.

విస్తృతమైన వ్యాపార ప్రతినిధి బృందంతో కలసి గౌరవ ప్రధాని భారతదేశానికి రావడం నాకు సంతోషంగా ఉంది. ప్రపంచం కోసం విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికీ, 2030 నాటికి మన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే మన ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికీ రెండు దేశాల సంస్థలూ కలసి పనిచేస్తాయని మేం విశ్వసిస్తున్నాం.

మిత్రులారా,

రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మా సహకారాన్ని మరింత పెంచుకోవాలని మేం నిర్ణయించాం. ఈ వ్యూహాత్మక రంగాలన్నింటిలోనూ ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తి కోసం భారత్‌తో భాగస్వాములుగా చేరాలని కోరుతూ పోలాండ్ కంపెనీలను మేం ఆహ్వానిస్తున్నాం.

పోలాండ్ నైపుణ్యం సహాయంతో అరుదైన ఖనిజాలు, బొగ్గు గ్యాసిఫికేషన్ రంగాల్లోనూ నూతన భాగస్వామ్యాలను మేం అభివృద్ధి చేస్తాం.

ఐటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మా సంబంధాలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. పలు భారత ఐటీ కంపెనీలు పోలాండ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఇండియా-పోలండ్ స్టార్టప్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసేందుకు మేం అంగీకరించాం.

ఈ కార్యక్రమాలు ఏఐ, సైబర్ భద్రత, ఫిన్‌టెక్, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో మా సహకారానికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. తద్వారా ఇరుదేశాల యువతకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా,

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలే మన బంధానికి అసలైన బలం. పోలాండ్ లో సంస్కృత అధ్యయనం, సింధు నాగరికత అధ్యయనం వంటి గొప్ప సంప్రదాయాలు ఉండటం ఎంతో సంతోషకరం.

క్రాకోవ్ నగరంలో ఇండియన్ స్టడీస్ ఛైర్‌ను మేం ఏర్పాటు చేశాం. సంస్కృతి, విద్యతో పాటు క్రీడలు, పర్యాటక రంగాల్లోనూ మా సహకారాన్ని మరింత బలపరచాలని మేం నిర్ణయించాం.

మిత్రులారా,

ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపైనా మేం విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రజాస్వామ్య విలువలను, చట్టబద్ధమైన పాలనను భారత్, పోలాండ్ బలంగా విశ్వసిస్తాయి. ప్రపంచ పాలనా సంస్థలను బలంగా, ప్రభావవంతంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని మేం భావిస్తున్నాం.

శాంతి స్థాపన దిశగా ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాలు చేసే సమర్థవంతమైన ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది.

గౌరవనీయులారా,

మన ఉమ్మడి చరిత్ర మూలాలు మానవత్వం, కరుణతో బలంగా ఉన్నాయి. మన ఉమ్మడి భవిష్యత్… ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశాలను అందిస్తుంది.

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ పర్యటన నూతనోత్తేజాన్నిచ్చి, ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనే పూర్తి విశ్వాసం ఉంది. మీకు, మీ ప్రతినిధి బృందానికి మరోసారి స్వాగతం పలుకుతున్నా.

ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం.

***


(రిలీజ్ ఐడి: 2327478) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada