గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారం 2026లో పాల్గొన్న గనుల మంత్రిత్వశాఖ, క్షేత్రస్థాయి కార్యాలయాలు

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 5:15PM by PIB Hyderabad

స్వచ్ఛతా హీ సేవా (ఎస్‌హెచ్‌ఎస్‌)ప్రచారం–2026లో గనుల మంత్రిత్వ శాఖ, దాని క్షేత్రస్థాయి కార్యాలయాలు, పరిపాలన నియంత్రణలోని సంస్థలు చురుగ్గా పాల్గొన్నాయి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిర భారత్‌ నిర్మాణం కోసం ‘స్వచ్ఛ భారత్‌’ స్ఫూర్తిని సమష్టి కార్యాచరణగా మార్చాయి. పరిశుభ్రత కార్యక్రమాలు, పరిశుభ్రత లక్ష్య యూనిట్ల (సీటీయూలు) రూపాంతరం, బహిరంగ ప్రదేశాల శుభ్రత, పారిశుద్ధ్య కార్మికుల (సఫాయి మిత్రల) సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల ద్వారా నిత్యజీవితంలో పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత, ప్రజల భాగస్వామ్యాన్ని అంతర్భాగంగా మార్చాలనే తన నిబద్ధతను మంత్రిత్వ శాఖ చాటుకుంది.

 

గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ కేశవ్‌ చంద్ర నేతృత్వంలో స్వచ్ఛత ప్రతిజ్ఞతో ఈ ప్రచారం ప్రారంభమైంది. పరిశుభ్రత, వ్యక్తిగత పారిశుద్ధ్యం, సుస్థిరమైన పద్ధతుల పట్ల మంత్రిత్వ శాఖ సమష్టి నిబద్ధతను ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్‌ రెడ్డి, గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న యశ్వంత్‌ ప్యాలెస్‌ మార్కెట్‌లో స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్లు పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూడటంలో సమష్టి బాధ్యత, ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం తెలియజేసింది.

 

అలాగే న్యూఢిల్లీలోని నేతాజీ నగర్‌, జీపీఓఏ–3లో ఉన్న ఖనిజ్‌ కక్ష్‌లో గనుల మంత్రిత్వ శాఖ సఫాయి మిత్రలు, ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కార్యాలయాల నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న విలువైన సేవలను గుర్తించి, వారికి ఆరోగ్య సేవలు అందించడమే ఈ శిబిరం ఉద్దేశం. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, గౌరవానికి ప్రాధాన్యమివ్వాలనే మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. 

 

చెరువులు, ఇతర జలవనరులను శుభ్రం చేయడంతో పాటు పలు కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాలు నిర్వహించాయి. శ్రమదానం, దేవాలయాలు, మార్కెట్లు సహా బహిరంగ ప్రదేశాల పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాయి. పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, వ్యర్థాలను తిరిగి వినియోగించుకోవడం ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం పాఠశాలల్లో వ్యాసరచన, వ్యర్థ పదార్థాలతో కళాకృతుల తయారీ పోటీలను కూడా నిర్వహించాయి.

 

ఈ ప్రచారంలో భాగంగా 10,723 మంది పాల్గొని 136 పరిశుభ్రత లక్ష్య ప్రాంతాలను రూపాంతరం చేశారు. అలాగే 59 బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయగా, 5,498 మంది ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పరిశుభ్రతను ప్రోత్సహించడం, బహిరంగ ప్రదేశాలను మెరుగుపరచడం, సమష్టి బాధ్యతాయుత భావనను పెంపొందించడం కోసం మంత్రిత్వ శాఖ, దాని క్షేత్రస్థాయి కార్యాలయాలు చేసిన సమష్టి కృషికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.

 

గనుల మంత్రిత్వ శాఖ, దాని క్షేత్రస్థాయి కార్యాలయాలు ‘స్వచ్ఛ భారత్‌’ లక్ష్య సాధనకు తమ నిబద్ధతను చాటుకున్నాయి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన తదేశ నిర్మాణానికి నిరంతర సమష్టి కార్యాచరణ, పర్యావరణ బాధ్యత, ప్రజల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2324789) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil