శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశపు స్వదేశీ క్వాంటమ్ సెక్యూరిటీ టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు క్యూఎన్యూ ల్యాబ్స్‌తో రూ.150 కోట్ల ఆర్డీఐ సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్న టీడీబీ-డీఎస్టీ
భారతదేశ క్వాంటమ్ సెక్యూర్, సెన్సింగ్ నెట్వర్కుల కోసం స్వతంత్ర టెక్నాలజీ స్టాక్‌ను ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 2:50PM by PIB Hyderabad
క్వాంటం టెక్నాలజీలు, సురక్షిత కమ్యూనికేషన్లలో భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తూ.. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) నిధి పరిధిలో రూ.150 కోట్ల ఆర్థిక సాయం కోసం భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగానికి (డీఎస్టీ) చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టీడీబీ), కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన క్యూఎన్యూ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
భారతదేశ క్వాంటమ్ సెక్యూర్, సెన్సింగ్ నెట్వర్క్స్కు (ఐక్యూఎస్ఎన్) స్వదేశీ సాంకేతిక పునాదిని అభివృద్ధి చేయడమే మొత్తం రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ కార్యక్రమం సాంకేతిక సంసిద్ధత స్థాయిలను (టీఆర్ఎల్) 4–5 స్థాయి నుంచి టీఆర్ఎల్-9 దిశగా ముందుకు తీసుకెళుతుంది. అంతే కాకుండా స్వతంత్ర క్వాంటమ్-సెక్యూరిటీ, సెన్సింగ్ టెక్నాలజీ స్టాక్ అభివృద్ధికి, సమగ్రతకు, ధ్రువీకరణకు మద్దతు అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయాన్ని ఆప్షనల్లీ కన్వర్టబుల్ డెట్ (ఓసీడీ) రూపంలో సమకూరుస్తారు.
డిజిటల్ మౌలిక వసతులు క్రమంగా ఒకదానితో ఒకటి అనుసంధానమవుతున్న తరుణంలో పరికరాల ప్రామాణికత, నావిగేషన్ వ్యవస్థల సమగ్రత, కాలానుగుణంగా విశ్వసనీయతను నిర్ధారించడం, సమాచార ప్రసార గోప్యతను పరిరక్షించడం కీలకమైన సాంకేతిక ప్రాధాన్యంగా మారుతోంది. కొత్తగా పుట్టుకొస్తున్న సైబర్, సాంకేతిక ముప్పుల కారణంగా సంప్రదాయ భద్రతా విధానాలకు ఎదురయ్యే పరిమితులను అధిగమించే సరికొత్త మార్గాలను క్వాంటమ్ సాంకేతికతలు అందిస్తున్నాయి. గుర్తింపు భద్రత, లొకేషన్ సమగ్రత, నెట్వర్క్ భద్రత, సమయ సమగ్రత అనే నాలుగు ప్రధానాంశాల ఆధారంగా ఏర్పాటు చేసిన సమీకృత విధానం ద్వారా ఈ అవసరాలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని క్యూఎన్యూ ల్యాబ్స్ ప్రతిపాదించింది. స్వతంత్ర సెక్యూరిటీ, సెన్సింగ్ మౌలిక వసతులకు బలమైన పునాదిని నిర్మించేందుకు అవసరమైన సామర్థ్యాలను ఈ కార్యక్రమం ఒక్కచోటకు తీసుకువస్తుంది.
గుర్తింపు భద్రతా విభాగం పరిధిలో హార్డ్‌వేర్ ఆధారిత పరికరాల గుర్తింపు, ప్రామాణీకరణ, క్రిప్టోగ్రాఫిక్ భద్రతను బలోపేతం చేసేందుకు క్వాంటమ్ సెక్యూర్ ఫిజికల్ అన్క్లోనబుల్ ఫంక్షన్స్ (పీయూఎఫ్), క్వాంటమ్ సేఫ్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫామ్ మాడ్యూల్స్ (టీపీఎం)ను ఈ కార్యక్రమం అభివృద్ధి చేస్తుంది. పరికరాల స్థాయిలో విశ్వసనీయతను బలోపేతం చేయడం, తారుమారు చేసిన లేదా నకిలీ గుర్తింపుల వల్ల ఎదురయ్యే గుర్తింపులకు సంబంధించిన సమస్యలను తగ్గించడమే ఈ టెక్నాలజీల లక్ష్యం. విశ్వసనీయ నావిగేషన్‌కు తోడ్పాటు అందించడం, పొజిషనింగ్ వ్యవస్థలను తారుమారు చేయడం లేదా స్పూఫింగ్ చేసే ప్రయత్నాలను గుర్తించే సాంకేతికతలపై లొకేషన్ సమగ్రత విభాగం దృష్టి సారిస్తుంది. విద్యుదయస్కాంత జోక్యాలను గుర్తించడానికి, జీపీఎస్ లేని పరిస్థితుల్లో నావిగేషన్ సామర్థ్యాల కోసం కాంపాక్ట్ క్వాంటమ్ మాగ్నెటోమీటర్‌లను తయారు చేయడం ఈ ప్రతిపాదిత పనుల్లో భాగంగా ఉంది. వీటిని రక్షణ రంగంతో పాటు ఇతర అత్యంత కీలకమైన వేదికల్లో విస్తృతంగా వినియోగించే అవకాశం ఉంది.
చిప్-ఆధారిత క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ), ఉపగ్రహ ఆధారిత క్యూకేడీ, క్వాంటమ్-సురక్షిత కమ్యూనికేషన్ మాడ్యూల్స్, ఎన్క్రిప్షన్ వ్యవస్థల వంటి అనుబంధ సాంకేతికతల ద్వారా క్వాంటమ్-సురక్షిత సమాచార వ్యవస్థను నెట్వర్క్ భద్రతా విభాగంలో ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. భూతల, సుదూర వ్యవస్థల్లో సురక్షితమైన సమాచార మార్పిడి కోసం క్షేత్రస్థాయిలో అమలు చేయగల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
నాలుగో విభాగమైన సమయ సమగ్రత... అత్యంత కచ్చితత్వంతో కూడిన సమయ నిర్ధారణ మౌలిక వసతులపై దృష్టి సారిస్తుంది. దీనిలో అటామిక్ క్లాక్ సాంకేతికత పరిజ్ఞానం, క్యూకేడీ ద్వారా ధ్రువీకరించిన సమాచారాన్నిఉపయోగించిన సురక్షితమైన టైం సింక్రోనైజేషన్ భాగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, కీలక మౌలిక వసతులు, రక్షణ రంగ అవసరాలకు నమ్మదగిన, తారుమారు చేయడానికి వీలులేని టైం సింక్రోనైజేషన్ ఎంతో కీలకం. పరికరాల ప్రామాణికత, సురక్షిత సమాచార వినిమయం, విశ్వసనీయమైన నావిగేషన్, పటిష్టమైన టైం సింక్రోనైజషన్కు తోడ్పడే విశ్వసనీయమైన సమగ్ర క్వాంటమ్ వ్యవస్థను రూపొందించడానికి ఈ నాలుగు విభాగాలు దోహదపడతాయి. తద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానాల సన్నద్ధతను, అమలును మరింత ఉన్నత స్థాయులకు చేర్చే దిశగా విస్తృత అధ్యయనం, ఇంజినీరింగ్ మెరుగుదల, వ్యవస్థల ఏకీకరణ, ధ్రువీకరణ చేపడతారు.
టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ: ‘‘సైబర్ భద్రత, సమాచార రంగం, నావిగేషన్, కీలక మౌలిక సదుపాయాల్లో ఎదురయ్యే సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి క్వాంటమ్ సాంకేతికతలు సరికొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఈ రంగాల్లో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవడం... భారతదేశ సాంకేతిక స్వావలంబనకు, దీర్ఘకాలిక భద్రతను పటిష్టం చేయడానికి ఎంతో ముఖ్యం. పరిశోధన, ఇంజనీరింగ్ దశల నుంచి వీటిని సమగ్రమైన, వినియోగించదగిన వ్యవస్థలుగా తీర్చిదిద్దడానికి నిరంతర పెట్టుబడులు అవసరం. అలాంటి ఆధునిక సాంకేతికతల అభివృద్ధికి ఆర్డీఐ నిధి ద్వారా టీడీబీ తోడ్పాటు అందిస్తోంది’’ అని తెలిపారు.
క్యూఎన్యూ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ: "దేశాలు తమ సమాచార వ్యవస్థలు, పరికరాలు, నావిగేషన్, టైం సింక్రనైజేషన్ వ్యవస్థలను ఎలా రక్షించుకోవాలో క్వాంటమ్ సాంకేతికతలు నిర్దేశిస్తాయి. ఆర్డీఐ నిధి ద్వారా టీడీబీ అందిస్తున్న మద్దతు క్వాంటం సెక్యూరిటీ స్టాక్ పరిధికి మించి మా ఆర్ అండ్ డీ కార్యాచరణను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. పరస్పర అనుసంధానమైన నాలుగు రంగాలపై మేం దృష్టి సారిస్తాం. పరికరాల గుర్తింపు, లొకేషన్ సమగ్రత, నెట్వర్క్ భద్రత, సమయ సమగ్రత... వీటి ద్వారా హార్డ్‌వేర్ స్థాయి నుంచే మౌలిక వసతుల్లో విశ్వసనీయత ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం క్వాంటమ్ భద్రతా పునాదిని చిప్-ఆధారిత, శాటిలైట్-ఆధారిత క్యూకేడీ, క్వాంటమ్ సెన్సింగ్, ఏఐ రంగాలకు విస్తరిస్తుంది. ఈ భాగస్వామ్యాన్ని బాధ్యతగా మేం భావిస్తున్నాం. భారతదేశ రక్షణ, టెలికాం, ఆర్థిక, కీలకమైన మౌలిక వసతులకు చెందిన రంగాలకు విశ్వసనీయమైన స్వదేశీ సామర్థ్యాలను అందించడం, విద్యాసంస్థలు, అంకురసంస్థలు, పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ విస్తృత క్వాంటమ్ వ్యవస్థను బలోపేతం చేయడాన్ని ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం" అని తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2324571)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9