ఆర్థిక మంత్రిత్వ శాఖ
అక్రమ బంగారం రవాణా వ్యవస్థను ఛేదించిన డీఆర్ఐ.. 6.2 కిలోల విదేశీ బంగారం స్వాధీనం, ముగ్గురి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 6:28PM by PIB Hyderabad
వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) చర్యలు నిరంతరం కొనసాగిస్తోంది. తాజాగా డీఆర్ఐ అధికారులు జరిపిన దాడుల్లో ఒక కొత్త, పకడ్బందీ అక్రమ రవాణా పద్దతి గుట్టురట్టు చేశారు. ప్రయాణికులు లేకుండా విడిగా వచ్చే విమాన కార్గో సామాను మార్గాన్ని ఆసరాగా చేసుకుని ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి సరుకుల రూపంలో అక్రమంగా వచ్చిన బంగారాన్ని బయటకు తీసేందుకు గిడ్డంగిలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు స్మగ్లర్లకు సహకరించారు. కార్గో నుంచి ఆ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసి, దాన్ని కోరుకున్న వ్యక్తులకు చేరవేయడంలో ఈ లోపలి వ్యక్తులే కీలక పాత్ర పోషించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడి చేశారు.


పక్కా సమాచారం ఆధారంగా డీఆర్ఐ అధికారులు తిరువనంతపురంలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్లో ప్రయాణికులు లేకుండా విడిగా పంపిన లగేజీ సరుకును అడ్డుకుని తనిఖీ చేశారు. లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా, వివిధ హార్డ్వేర్ వస్తువుల్లో అత్యంత చాకచక్యంగా దాచిన విదేశీ మూలానికి చెందిన 6.28 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ రూ.9.18 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఫ్లోర్ స్ప్రింగ్, మెటల్ తాళాలు, గ్రీజ్ గన్, డోర్ క్లోజర్ వంటి వివిధ హార్డ్వేర్ వస్తువుల్లో దుండగులు బంగారాన్ని దాచారు. ఈ అక్రమ రవాణా విధానంలో భాగంగా బంగారం దాచిన హార్డ్వేర్ వస్తువులతో పాటు ఇతర వస్తువులను నంబర్ లాక్ ఉన్న ట్రాలీలో ప్యాక్ చేశారు. ఆ లాక్ తెరవడానికి అవసరమైన నంబర్ కలయికను స్మగ్లింగ్ ముఠా సభ్యులు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ ట్రాలీని దుబాయ్ నుంచి తిరువనంతపురానికి ప్రయాణికులు లేకుండా విడిగా పంపే లగేజీగా రవాణా చేశారు. సామాను తిరువనంతపురానికి చేరుకున్న తర్వాత గిడ్డంగి సిబ్బందిలోని ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించిన నంబర్ కలయికను ఉపయోగించి ట్రాలీని తెరిచేవాడు. అందులో బంగారం దాచిన హార్డ్వేర్ వస్తువులను బయటకు తీసి మధ్యవర్తికి అప్పగిస్తే.. అతడు వాటిని బంగారం అందుకోవాల్సిన వ్యక్తికి చేరవేసేవాడు.

ఈ ఆపరేషన్కు సంబంధించి ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో, అక్రమ రవాణా ముఠాతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బంగారం దాచిన హార్డ్వేర్ వస్తువులను గిడ్డంగి నుంచి బయటకు తీసే బాధ్యత నిర్వహించిన గిడ్డంగి సిబ్బంది, మధ్యవర్తిగా వ్యవహరించిన కస్టమ్స్ బ్రోకర్, బంగారాన్ని స్వీకరించేందుకు తిరువనంతపురానికి వచ్చిన వ్యక్తి ఉన్నారు. ఈ ముగ్గురినీ కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
నూతన, అధునాతన పద్ధతుల్లో సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, నిఘా సమాచార ఆధారంగా చేపట్టే చర్యల ద్వారా స్మగ్లింగ్ వ్యవస్థలను పూర్తిగా అణచివేయడంలో డీఆర్ఐ తన నిబద్ధతను చాటుకుంటూనే ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2324302)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6