ప్రధాన మంత్రి కార్యాలయం
2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ క్రీడాకారుల బృందంతో ముఖాముఖి మాట్లాడిన ప్రధానమంత్రి
మన ఆసియా క్రీడల విజేతలు త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసి దేశ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు: ప్రధానమంత్రి
ప్రతి క్రీడా ప్రాంగణంలోనూ త్రివర్ణ పతాక శోభ, క్రీడారంగంలో భారతదేశపు నూతన గుర్తింపు, ప్రతి క్రీడలోనూ సరికొత్త విజేతలు, మన పేరిట సరికొత్త రికార్డులు.. మనం దీనిని సాధించి తీరుతాం: ప్రధానమంత్రి
ప్రపంచ క్రీడా శక్తికేంద్రంగా అవతరించేందుకు భారత్ సకల సన్నాహాలతో సిద్ధంగా ఉంది: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 7:23PM by PIB Hyderabad
2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముఖాముఖి మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పతక విజేతలను ఒకే చోట కలవడం వల్ల అక్కడ నెలకొన్న అద్భుతమైన వాతావరణాన్ని ఆయన ప్రస్తావించారు. "యువ అథ్లెట్లయిన మీరందరూ.. పట్టుదల విజయం రూపం దాల్చినప్పుడు పతకాలతో పాటు ముఖాల్లో ఎలాంటి కాంతి వెలుగుతుందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలు" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
140 కోట్ల మంది ప్రజలకు అపారమైన గర్వాన్ని అందించినందుకు అథ్లెట్లను ప్రశంసించిన ప్రధాని.. జాతీయ పతాక గౌరవాన్ని, కీర్తిప్రతిష్టలను పునరుద్ఘాటించడమే అంతిమ విజయమని అన్నారు. ఈ సమష్టి జాతీయ విజయం సాధించినందుకు క్రీడాకారులను.. వారి కోచ్‌లను, సహాయ సిబ్బందికి, కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. "కాబట్టి మీ విజయం కేవలం మీది మాత్రమే కాదు.. ఇది దేశంలోని కోట్ల మంది ప్రజల విజయం" అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ కలాం అసాధారణమైన జీవితం, దూరదృష్టిగల ఆలోచనా సరళి దేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తున్నాయో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "ఆయన జీవితం, ఆయన ఆలోచన మనందరికీ స్ఫూర్తిదాయకం" అని ప్రధాని పేర్కొన్నారు.
ఆసియా క్రీడల్లో సాధించిన చారిత్రాత్మక విజయాలను గుర్తు చేసుకుంటూ పురుషుల, మహిళల హాకీ జట్లు సాధించిన డబుల్ గోల్డ్ విజయాన్ని ప్రధానమంత్రి ఘనంగా కొనియాడారు. ఇందులో మహిళల జట్టు 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించగా.. రెండు క్రికెట్ జట్లు వరుసగా పతకాలు సాధించడం, కబడ్డీలో పురుషులు- మహిళల జట్లు స్వర్ణపతకాలు గెలవడం విశేషమని పేర్కొన్నారు. అలాగే విలువిద్యలో సాధించిన ఐదు స్వర్ణాలు.. షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలు.. అథ్లెటిక్స్‌లో కొత్త రికార్డులు, 28 ఏళ్ల తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో లభించిన పతకం, 1982 తర్వాత లభించిన తొలి మారథాన్ విజయాన్ని ఆయన అభినందించారు. "ఈసారి ఆసియా క్రీడలు అనేక కోణాల్లో మనకు చిరస్మరణీయంగా నిలిచాయి" అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ సాధించిన మొత్తం 85 పతకాల్లో 11 స్వర్ణాలతో సహా 38 పతకాలను గెలుచుకున్న మహిళా అథ్లెట్ల అసాధారణ సహకారాన్ని ప్రశంసించిన శ్రీ నరేంద్ర మోదీ.. వారి పతకాల సంఖ్య కేవలం గణాంకాలు మాత్రమే కాదని శక్తిమంతమైన నవ భారతానికి ప్రతీక అని పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, సాఫ్ట్ టెన్నిస్, నిర్దిష్ట సేలింగ్ పోటీలలో భారతదేశ క్రీడాకారులు తొలిసారిగా ఆసియా క్రీడల పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన తీరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "ఆసియా క్రీడల చరిత్రలో గతంలో మనకు ఎన్నడూ పతకం రాని క్రీడల్లో కూడా నేడు భారత్ పతకాలు సాధిస్తోంది" అని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
క్రీడారంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అథ్లెట్లకు పిలుపునిస్తూ ఒక ఉత్తేజపూరితమైన సంకల్పాన్ని ప్రధాని అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల బృందం ఏకగ్రీవంగా ‘మనం దీనిని సాధించి తీరుతాం!’ అని అన్నారు. ప్రతి క్రీడా ప్రాంగణంలోనూ త్రివర్ణ పతాక శోభను కాపాడాలని, దేశానికి నూతన క్రీడా గుర్తింపును తీసుకురావాలని, ప్రతి విభాగంలోనూ కొత్త విజేతలను తీర్చిదిద్దాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. "మన పేరిట మరిన్ని సరికొత్త రికార్డులు.. మనం దీనిని సాధించి తీరుతాం!" అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశం జరిగిన వేదిక విశిష్టతను గుర్తుచేస్తూ.. రాత్రి వేళల్లో సైతం గంటల తరబడి హాకీ సాధన చేసిన దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ పేరు మీద ఈ స్టేడియం నిర్మాణమైందని ప్రధానమంత్రి అథ్లెట్లకు గుర్తుచేశారు. గొప్ప సంకల్పాలు నెరవేరడానికి ఏళ్ల తరబడి నిరంతర ఓపిక, కఠిన శ్రమ అవసరమని వివరించేందుకు ఆ దిగ్గజానికి ఉన్న అంకితభావాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. "ఆయన చేసిన ఈ కఠిన శ్రమ.. సంకల్పాలు, కలలు ఒక్క రోజులో నెరవేరవనే విషయాన్ని మనకు పదే పదే గుర్తుచేస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
గతంలో భారత్ కొన్ని పతకాలను మాత్రమే గెలుచుకునేదని, అనేక క్రీడా విభాగాల పట్ల సరైన అవగాహన కూడా ఉండని పరిస్థితిని ప్రస్తావించిన ఆయన.. గత పుష్కరకాలంగా క్రీడా వ్యవస్థపై చేసిన కృషిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సగానికి పైగా ఒలింపిక్ క్రీడాంశాలలో గతంలో దేశానికి ప్రాతినిధ్యమే లేదని ఆయన గుర్తుచేశారు. అసలు పోటీ బరిలోకి దిగకుండా దేశం పతకాలను ఎలా ఆశించగలదని ఆయన ప్రశ్నించారు. "మనం పోటీలోనే లేనప్పుడు పతకాలను ఎలా తీసుకురాగలం?" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
జాతీయ క్రీడా విధానంలో వచ్చిన నిర్ణయాత్మక మార్పును ప్రస్తావిస్తూ.. గతంలో ఉన్న ఈ ఉదాసీనతను, ఆత్మన్యూనతా భావాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రధాని ప్రముఖంగా చెప్పారు. ఫలితంగా నేడు అంతర్జాతీయ క్రీడా వేదికల్లో భారతీయ అథ్లెట్ల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగడాన్ని ఆయన ప్రశంసించారు. "ఈ నిరాశాజనక మనస్తత్వాన్ని తుడిచిపెట్టాలని మేం సంకల్పించాం!" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఈ పరివర్తనకు గత 10 నుంచి 12 సంవత్సరాల్లో చేపట్టిన దూరదృష్టిగల ఆలోచన, నిజాయితీ గల శ్రమే కారణమని తెలియజేసిన ప్రధాని.. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్), విస్తరించిన 'ఖేలో ఇండియా' కార్యక్రమాల ప్రాతిపదికగా పారదర్శకమైన, ఆధునిక క్రీడా వ్యవస్థ నిర్మాణాన్ని విస్తృతంగా వివరించారు. దేశవ్యాప్తంగా క్రీడా సమాఖ్యలను, గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను బలపరచడానికి ప్రభుత్వం భారీ ఆర్థిక వనరులను కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. "ఖేలో ఇండియాను విస్తరించడానికి, క్రీడా సమాఖ్యలను బలోపేతం చేయడానికి 36 వేల కోట్లకు పైగా రూపాయలను కేటాయించాం" అని ప్రధాని పేర్కొన్నారు.
వెయ్యికి పైగా 'ఖేలో ఇండియా కేంద్రాల' ద్వారా గ్రామీణ స్థాయి మౌలిక సదుపాయాలు వేగవంతంగా పెరగటాన్ని వివరిస్తూ.. చిన్న- పెద్ద నగరాలన్నింటిలో నిర్మిస్తున్న వేలాది నూతన స్టేడియంలు, బహుళావసరాల హాళ్లు, అథ్లెటిక్స్ ట్రాక్‌లు, ఫుట్‌బాల్- హాకీ మైదానాలు, ఈతకొలనుల వివరాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. టాప్స్ పథకం కింద అథ్లెట్లకు నేరుగా నెలకు రూ. 50,000 పాకెట్ అలవెన్స్ అందించడం, విదేశీ కోచింగ్ శిక్షణలకు నిధులు సమకూర్చడం వంటి ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన ప్రధానంగా వివరించారు. "ఏదైనా క్రీడలో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం వస్తే ప్రభుత్వం దానికి కూడా పూర్తి వెసులుబాటు కల్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తోంది" అని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
వింటర్ గేమ్స్, సంసద్ ఖేల్ ప్రతియోగితా, నూతన 'ఖేలో భారత్ నీతి' ద్వారా పోటీ అనుభవాన్ని గరిష్ఠం చేసే దిశగా చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ.. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివ్యాంగ అథ్లెట్లను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. తమ సమగ్ర ప్రయాణంలో నిరంతరం దేశం అండగా నిలుస్తుందనే నమ్మకం క్రీడాకారుల్లో ఉన్నప్పుడు ఎలాంటి అద్భుత విజయాలు సాధించవచ్చో అథ్లెట్ల విజయాలే నిరూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "ఈ రోజు ప్రతి క్రీడాకారుడిలోనూ తమ పూర్తి ప్రయాణంలో దేశం తమకు అండగా నిలుస్తుందనే ఆత్మవిశ్వాసం ఉంది" అని ప్రధాని స్పష్టం చేశారు.
క్రీడా బృందంలోని 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనలను ప్రస్తావిస్తూ.. చిన్న వయస్సులోనే సాధన ప్రారంభించడం అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు. 'ఖేలో ఇండియా', 'ఎమర్జింగ్ ఖేలో ఇండియా'ల ద్వారా ఐదు నుంచి పదిహేనేళ్ల వయస్సు గల పిల్లలను గుర్తించి శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. రాబోయే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, భారత్ వేదికగా జరగనున్న 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే జాతీయ ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని ఎర్రకోట వేదికగా తాను చేసిన ప్రకటనను ఆయన గుర్తుచేశారు. "రాబోయే కాలంలో ఈ క్రీడాకారులే భారతదేశానికి పతకాలు తీసుకువస్తారు" అని శ్రీ నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
దేశం చేసుకున్న మహోన్నత సంకల్పాలపై చెక్కుచెదరని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అథ్లెట్లతో కలిసి మరోసారి "మనం దీనిని సాధించి తీరుతాం!" అనే ఉత్సాహపూరిత నినాదాన్ని ప్రధానమంత్రి చేయించారు. ప్రధాన అంతర్జాతీయ క్రీడోత్సవాల నిర్వహణ, ప్రపంచ అగ్రగామి క్రీడా దేశాల సరసన నిలవడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణం, అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దటం వంటి ఉమ్మడి లక్ష్యాల వైపు అథ్లెట్లను ఆయన ప్రేరేపించారు. "భారత్‌లోని ప్రతి మూల నుంచి ఒక విజేత.. మనం దీనిని సాధించి తీరుతాం!" అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడల విజయాన్ని భారతీయ యువత విస్తృత ఆకాంక్షలతో అనుసంధానించిన ప్రధాని.. అంతరిక్షం, శాటిలైట్ సాంకేతికత, రక్షణ రంగం, కృత్రిమ మేధలో నూతన ఆవిష్కరణలు చేస్తూ యువ ఆవిష్కర్తలు భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థగా తీర్చిదిద్దిన తీరును ప్రస్తావించారు. క్రీడల మాదిరిగానే చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువత కూడా ఈ వ్యాపారవేత్తల విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారని.. గత దశాబ్ద కాలంగా చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు వారికి సంపూర్ణ మద్దతును అందిస్తున్నాయని ఆయన చెప్పారు. "తమ కలలను ముందుకు తీసుకెళ్లేందుకు దేశానికి ఉన్న సంపూర్ణ సామర్థ్యం తమకు అండగా నిలుస్తుందనే నమ్మకం వారిలో ఉంది" అని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
క్రీడా విప్లవం ద్వారా చేకూరే విస్తృత ఆర్థిక ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు కేవలం మైదానంలోని క్రీడాకారులకే కాకుండా ఇతరులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా శిక్షణ, ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ వంటి విభిన్న ప్రొఫెషనల్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "ఇది యువతకు నూతన ఉపాధి, వ్యాపార అవకాశాలను సృష్టించింది" అని ప్రధాని పేర్కొన్నారు.
అంతర్జాతీయ అనుభవం ఉన్న పతక విజేతలు తదుపరి తరం క్రీడాకారులకు మార్గదర్శకత్వం వహించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిస్తూ.. వారు పాఠశాలలను సందర్శించాలని, తాము మొదట ఆడిన ప్రాంగణాలకు వెళ్లాలని, తమ స్వగ్రామాలు- నగరాల్లోని పిల్లలతో మాట్లాడాలని ప్రధానమంత్రి కోరారు. తమ కష్టార్జిత అనుభవాలను పంచుకోవడం ద్వారా తమ అడుగుజాడల్లో నడవాలని కలలు కనే యువ ఆశావహుల్లో గొప్ప స్ఫూర్తిని నింపొచ్చని ఆయన చెప్పారు. "బహుశా మీ నోటి నుంచి వచ్చే ఒక చిన్న మాట క్రీడల్లో ముందుకు సాగడానికి ఒక చిన్నారికి కొండంత ధైర్యాన్ని ఇవ్వొచ్చు" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
మైదానానికి ఆవల క్రీడలకు ఉన్న గట్టి విలువను ప్రస్తావిస్తూ... క్రీడలు జీవితాంతం నిలిచే క్రమశిక్షణ, వివిధ పరిస్థితులకు అనుకూలంగా మారటం, సుదీర్ఘ లక్ష్యాల పట్ల నిలకడ, ఓటమి తర్వాత తిరిగి పుంజుకునే సత్తువను నేర్పుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాథమిక గుణాలు సహజంగానే దైనందిన జీవితంలో భాగమై ప్రతి సవాలును ఎదుర్కొనేలా వ్యక్తులకు మార్గదర్శకత్వం వహిస్తాయని ఆయన గుర్తుచేశారు. "ఈ క్రీడా స్ఫూర్తి జీవితాంతం ఉపయోగిపడుతుంది" అని ప్రధాని అభిప్రాయపడ్డారు.
"ఆడేవాడే ఆరితేరుతాడు" అనే తన విశిష్ట నినాదంతో ప్రసంగాన్ని ముగిస్తూ... అథ్లెట్ల ఉత్సాహాన్ని నవ భారతదేశ అతిపెద్ద సామర్థ్యంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి 'వికసిత్ భారత్', ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థ, 'ఆత్మనిర్భర్ భారత్', గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్, సాంకేతిక నాయకత్వం, అంతరిక్ష పరిశోధనలు, ఒలింపిక్స్ నిర్వహణ వంటి మహోన్నత లక్ష్యాలను ఉద్దేశిస్తూ మరోసారి "మనం దీనిని సాధించి తీరుతాం!" అనే అన్నారు. రానున్న పోటీలతో పాటు భవిష్యత్ ప్రయత్నాల్లో విజయం సాధించాలని అథ్లెట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. "ఈ ఆత్మవిశ్వాసంతోనే మనం భారతదేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2324176)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15