రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రధాన వంతెనలు, జాతీయ రహదారులపై కీలక నిర్మాణాల డిజైన్లను స్వతంత్రంగా తనిఖీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్హెచ్ఏఐ
జాతీయ రహదారులపై కీలక నిర్మాణాల భద్రత, ప్రమాణాలు, మన్నికను పెంపొందించే లక్ష్యంతో ఏకరూప విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నూతన చొరవ
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 5:02PM by PIB Hyderabad
జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో నిర్మాణ భద్రత, మన్నిక, నాణ్యతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక ముందడుగు వేసింది. తన ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న ప్రధాన వంతెనలు, ఇతర కీలక నిర్మాణాల డిజైన్లు, డ్రాయింగులను స్వతంత్రంగా తనిఖీ చేసేందుకు ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానం ప్రకారం గుర్తించిన కీలక నిర్మాణాల డిజైన్లను ఎన్హెచ్ఏఐ జాబితాలో చోటు పొందిన భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (ఐఐటీలు), ప్రముఖ ప్రభుత్వ సాంకేతిక సంస్థలు, వంతెనల ఇంజినీరింగ్, జలవనరుల అధ్యయనాల్లో అనుభవం కలిగిన ఇతర సాంకేతిక సంస్థలు స్వతంత్రంగా తనిఖీ చేస్తాయి.
ప్రధాన వంతెనలు, సంక్లిష్ట నిర్మాణాల విషయంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. డిజైన్లలో తలెత్తే లోపాలను తొలిదశలోనే గుర్తించేందుకు స్వతంత్ర తనిఖీలు దోహదపడతాయి. భారత రహదారుల కాంగ్రెస్ (ఐఆర్సీ) నిర్దేశించిన ప్రమాణాలు, సాంకేతిక ప్రామాణికాలు (స్పెసిఫికేషన్లు), ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండేలా ఈ విధానం భరోసా కల్పిస్తుంది.
తనిఖీల పరిధిలోకి వచ్చే నిర్మాణాలు
ఈ విధానం ప్రధాన వంతెనలు, వయాడక్ట్లను కవర్ చేస్తుంది. సెకనుకు 3,000 క్యూబిక్ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రవాహ సామర్థ్యం కలిగిన ప్రధాన నదీ వంతెనలు, పిల్లర్ల మధ్య 40 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం కలిగిన నిర్మాణాలను, వంతెనలను ఇందులో చేర్చారు. ఎన్హెచ్ఏఐ గుర్తించే ప్రత్యేకమైన, సంక్లిష్టమైన నిర్మాణాలకు కూడా ఈ విధానం వర్తిస్తుంది.
స్వతంత్ర తనిఖీల్లో నిర్మాణ రూపకల్పనకు సంబంధించిన లెక్కలు, నిర్మాణ విశ్లేషణ, డిజైన్ డ్రాయింగులతో పాటు అవసరమైన చోట జలవిజ్ఞాన (హైడ్రోలాజికల్), జలగతిక (హైడ్రాలిక్) అధ్యయనాలు కూడా ఉంటాయి. ఈ అధ్యయనాల ద్వారా నీటి ప్రవాహం, వరద మట్టాలు, నీరు సజావుగా వెళ్లేందుకు కల్పించిన మార్గాల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. నదీ ప్రవాహం కారణంగా నదీగర్భం కోతకు గురైనప్పుడు పునాదుల భద్రత ఎలా ఉంటుందో కూడా పరిశీలిస్తారు.
కొత్త విధానం ఎలా అమలవుతుంది?
సవరించిన విధానం ప్రకారం, ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టర్ లేదా రాయితీ పొందిన సంస్థ డిజైన్లు, డ్రాయింగులను పరిశీలన లేదా ఆమోదం కోసం సమర్పించాలి. అనంతరం ఎన్హెచ్ఏఐ గుర్తింపు పొందిన సంస్థలు, సాంకేతిక సంస్థల జాబితా నుంచి మూడు సంస్థలను ప్రతిపాదిస్తారు. ప్రాజెక్టు అవసరాలను బట్టి వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంస్థలను ఎంపిక చేసి స్వతంత్ర ధ్రువీకరణ బాధ్యతలు అప్పగిస్తారు.
ఎంపిక చేసిన సంస్థ లేదా సాంకేతిక సంస్థ డిజైన్లను స్వతంత్రంగా పరిశీలించి, తన అభిప్రాయాలు, సిఫారసులతో నివేదిక సమర్పిస్తుంది. ఈ సూచనలను పరిశీలించిన కాంట్రాక్టర్ లేదా రాయితీ పొందిన సంస్థ అవసరమైన మేరకు డిజైన్లలో మార్పులు చేస్తుంది. అనంతరం సంబంధిత ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా ఎన్హెచ్ఏఐ డిజైన్లను సమీక్షించి ఆమోదిస్తుంది.
ఈ విధానం 2026 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్తగా చేపట్టే ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (ఈపీసీ) ప్రాజెక్టులు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం), నిర్మించి - నిర్వహించి - –బదిలీ చేసే (బీఓటీ) విధానంలోని అన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. డిజైన్ల ధ్రువీకరణ లేదా సాంకేతిక తనిఖీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని ప్రాజెక్టులకు కూడా ఈ విధానం వర్తించనుంది.
డిజైన్ల ధ్రువీకరణ లేదా సాంకేతిక తనిఖీ ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులకు సాధారణంగా ఈ విధానం వర్తించదు. అయితే, ప్రధాన వంతెనలు, సంక్లిష్టమైన లేదా అత్యంత కీలకమైన ప్రత్యేక నిర్మాణాల విషయంలో అదనంగా స్వతంత్ర ధ్రువీకరణ చేపట్టవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారులపై కీలక నిర్మాణాల నాణ్యతకు భరోసా కల్పించేలా ఏకరీతి, పటిష్ఠమైన విధానాన్ని ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా మరింత సురక్షితమైన, బలమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ విధానం దోహదపడనుంది.
***
(రిలీజ్ ఐడి: 2324003)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14