ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 4:50PM by PIB Hyderabad

ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్.. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నియంత్రణలో పనిచేసే ఒక షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్. బ్యాంక్ బలహీనమైన ఆర్థిక పరిస్థితి కారణంగా దానికి పదేపదే మూలధనాన్ని సమకూర్చటం (క్యాపిటల్ ఇన్ఫ్యూజన్) అవసరమైంది. ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఎల్‌ఐసీ ఈ పని చేశాయి. బ్యాంక్‌కు ఉన్న నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), నష్టాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆ బ్యాంక్‌ను 2017 మే 5న 'ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్' (పీసీఏ) ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తెచ్చి అనేక ఆంక్షలను విధించింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులలో వచ్చిన మెరుగుదలను పరిశీలించిన అనంతరం కొన్ని షరతులు, నిరంతర పర్యవేక్షణకు లోబడి ఐడీబీఐ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను 2021 మార్చి 10 నాటి లేఖ ద్వారా ఆర్‌బీఐ తొలగించింది.

ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌లోని మొత్తం 60.72 శాతం ఈక్విటీ వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారునికి విక్రయించాలని నిర్ణయించారు. ఇందులో భారత ప్రభుత్వం వాటా 30.48 శాతం కాగా ఎల్‌ఐసీ వాటా 30.24 శాతంగా ఉంటుంది. ఈ విక్రయం తర్వాత భారత ప్రభుత్వానికి బ్యాంక్‌లో 15 శాతం, ఎల్‌ఐసీకి 19 శాతం వాటా ఉంటుంది. 

ఈ సీసీఈఏ నిర్ణయాన్ని రెండు దశల పోటీ వేలం ప్రక్రియ ద్వారా అమలు చేశారు. ఇంటర్‌-మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎంజీ), పెట్టుబడి ఉపసంహరణపై కార్యదర్శుల కోర్ గ్రూప్ (సీజీడీ), ప్రత్యామ్నాయ యంత్రాంగంతో (ఏఎం) కూడిన సాధికారత కలిగిన మంత్రుల బృందంతో కూడిన బహుళ-స్థాయి యంత్రాంగం దీని పర్యవేక్షణ వహించింది.

ఆసక్తి గల పక్షాల నుంచి 'ఆసక్తి వ్యక్తీకరణ'ను (ఈఓఐ) ఆహ్వానిస్తూ 07.10.2022న పీఐఎం (ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) జారీ అయింది. ఆర్‌బీఐ ద్వారా 'ఫిట్ అండ్ ప్రాపర్' అని ధ్రువీకరణ పొంది హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నుంచి భద్రతా క్లియరెన్స్ పొందిన పక్షాలు మాత్రమే బిడ్డింగ్ దశలో పాల్గొనడానికి అర్హత కలిగి ఉన్నాయి. వీటి కోసం అర్హత కలిగిన ఆసక్తిగల పక్షాల (క్యూఐపీలు) నుంచి సాంకేతిక, ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తూ 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్' (ఆర్ఎఫ్‌పీ) జారీ అయింది. ప్రారంభంలో ఈఓఐ సమర్పించిన ఐదు పక్షాల్లో నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు, అనర్హత నిబంధనల ప్రకారం నాలుగు పక్షాలు అర్హత సాధించాయి. వీటిలో రెండు చివరకు తమ టెక్నో-ఫైనాన్షియల్ బిడ్లను సమర్పించి దీనికి అర్హత కలిగిన బిడ్డర్లుగా నిలిచాయి.

డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌‌కు సంబంధించిన కార్యదర్శుల కోర్ గ్రూప్ (సీజీడీ) సమగ్ర మూల్యాంకనం, ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సులను పరిశీలించిన అనంతరం 14/10/2026న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌లోని 60.72 శాతం వాటా కొనుగోలుకు గాను 10955230 కెనడా ఇన్‌కార్పొరేషన్‌ను (మాతృ సంస్థ: ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్) వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఆమోదించింది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ. 52,878.0806181 కోట్లు (అక్షరాలా యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల ఆరు వేల నూట ఎనబై ఒక్క రూపాయిలు). ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం ఈక్విటీ వాటా, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం ఈక్విటీ వాటా ఉన్నాయి.

ఇటువంటి లావాదేవీలలో బిడ్డింగ్ ప్రక్రియకు ముందస్తుగా ఎలాంటి ప్రామాణిక సూచిక ఉండదు. బిడ్డర్లు సొంతంగా విలువను లెక్కించి సీల్ చేసిన కవర్లలో అత్యంత రహస్యంగా తమ బిడ్లను సమర్పించారు. దీనికి సమాంతరంగా సంస్థ‌కు ఉన్న సరైన విలువను నిర్ణయించడానికి స్వతంత్ర ఏజెన్సీలను నియమించారు. సమర్పించిన బిడ్లు సమంజసమేనా అన్న అంచనా వేయడానికి ఈ విలువను ప్రామాణికంగా ఉపయోగిస్తారు.

దీని కింద ఆర్థిక సంవత్సరం 2025-26లో ప్రాథమిక బిడ్లను ఆహ్వానించారు. సరిపోలిక కోసం ఆ సమయంలో ప్రతి షేరు రిజర్వ్ ధరను రూ. 94.42గా నిర్ణయించారు. ఈ ధర ప్రత్యక్షంగా, పరోక్షంగా మార్కెట్ ద్వారా ప్రభావితమైంది. 07.10.2022న పీఐఎం లేదా ఈఓఐ జారీ చేయడానికి ముందు చివరి ట్రేడింగ్ రోజున ఐడీబీఐ స్టాక్ విషయంలో ప్రభావితం కాని ముందస్తు ధర ప్రతి షేరుకు రూ. 42.40గా ఉంది. 08.01.2026న ప్రాథమిక బిడ్లను ఆహ్వానించడానికి ముందు చివరి ట్రేడింగ్ రోజున ప్రభావితమైన ధర ప్రతి షేరుకు రూ. 108.12గా ఉంది. ఆ సమయంలో నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే ప్రాథమిక బిడ్లు తక్కువగా ఉన్నందున వాటికి ఆమోదం లభించలేదు. ప్రాథమిక బిడ్లు తిరస్కరణకు గురైనట్లు తెలిసిన వెంటనే మార్కెట్‌లో స్టాక్ ధర సర్దుబాటు అయి బిడ్ ధర అయిన రూ. 75 కంటే చాలా తక్కువకు పడిపోయింది.

తదనంతరం సామూహిక నిర్ణయాత్మక యంత్రాంగానికి ఇచ్చిన అధికారాలను ఉపయోగిస్తూ ఈ లావాదేవీ విలువను సాధ్యమైనంత వరకు పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన బిడ్డర్ల నుంచి వారి అత్యుత్తమ ఆఫర్లను వెల్లడించే సీల్డ్ బిడ్లను ఆహ్వానించారు. 18.05.2026న అత్యుత్తమ ఆఫర్ల బిడ్లను ఆహ్వానించడానికి ముందు చివరి ట్రేడింగ్ రోజున ఐడీబీఐ స్టాక్ ధర ప్రతి షేరుకు రూ. 70.38గా ఉంది. 

పరిమిత స్థాయిలో ట్రేడింగ్ జరిగే ఐడీబీఐ స్టాక్ ధర తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. మూల్యాంకన వ్యవధిలో ఈ ధర గరిష్ఠంగా రూ. 118.38 కనిష్ఠంగా రూ. 61.01 మధ్య ఉంటూ నిర్ణయించిన ధర కంటే భిన్నంగా ఉంది. ఈ మార్కెట్ ధర సంస్థకు ఉన్న సహజమైన విలువతో సరిపోలనందున  దానిని ప్రామాణికంగా పరిగణించలేదు. దీనికి బదులుగా ఈ సమస్యను అధిగమించేందుకు 'మార్కెట్ మల్టిపుల్ మెథడ్' ద్వారా సాపేక్ష మూల్యాంకనాన్ని ఉపయోగించి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల 2026 మార్చి 31 నాటి ముగింపు ఖాతాల ఆధారంగా సంస్థ‌కు ఉన్న న్యాయబద్ధమైన మార్కెట్ విలువను నిర్ణయించారు. దీనితో పాటు ఐడీబీఐ బ్యాంక్‌ 2026 మార్చి 31 నాటి ఆడిట్ అయిన ఖాతాల ప్రకారం భూములు, ఆస్తులతో సహా దృశ్య, అదృశ్య (ట్యాంజిబుల్, ఇన్‌ట్యాంజిబుల్) ఆస్తులు, అప్పులను పరిగణనలోకి తీసుకునే 'అసెట్ వ్యాల్యుయేషన్ పద్ధతి' ద్వారా సంస్థ‌కు ఉన్న న్యాయబద్ధమైన నికర ఆస్తి విలువను నిర్ణయించారు.

దీనికి అనుగుణంగా పైన చెప్పిన విధంగా రెండు స్వతంత్ర పద్ధతులను ఉపయోగిస్తూ రెండు ప్రొఫెషనల్ వ్యాల్యూయేషన్ ఏజెన్సీలు సంస్థ‌కు ఉన్న న్యాయబద్ధమైన విలువను లెక్కించాయి. ఈ రెండు నివేదికల సగటు విలువ ప్రకారం ప్రతి షేరు ప్రామాణిక ధర రూ. 75.99గా నిర్ణయించారు. బిడ్డర్ సమర్పించిన అత్యుత్తమ బిడ్ ధర ప్రతి షేరుకు రూ. 81గా ఉంది. ఇది ప్రామాణిక ధరతో పాటు రెండు స్వతంత్ర ఏజెన్సీల మూల్యాంకనం కంటే ఎక్కువగా ఉండటంతో దీనిని అత్యంత సమంజసమైనదిగా భావించి ఆమోదించారు.

విజయవంతమైన బిడ్డర్ తన వివరాలను 'ఆసక్తి వ్యక్తీకరణ' (ఈఓఐ) దశలో నిర్వహించిన 'ఫిట్ అండ్ ప్రాపర్' అంచనాకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది. అందులో నిర్దేశించిన నియంత్రణ నిబంధనల అమలుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మన ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక రంగంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి‌గా (ఎఫ్‌డీఐ) ఇది నిలుస్తుంది.

ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం బహిరంగ మార్కెట్ ద్వారా భారత ప్రభుత్వానికి మిగిలిన మైనారిటీ వాటాను (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ మొత్తం వాటాలో 15 శాతం) విక్రయించడానికి ప్రత్యామ్నాయ యంత్రాంగానికి సీసీఈఏ అధికారాలు ఇచ్చింది. నియంత్రణ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఎల్ఐసీ తన వద్ద ఉన్న మిగిలిన వాటాను (19 శాతం) తన అంతర్గత విధానాల ప్రకారం నిర్వహించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2323592) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam