ఔషధాల విభాగం
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ : ఫార్మాస్యూటికల్స్ విభాగం
25 ప్రాంతాల్లో క్లినికల్ రిసర్చ్ అవకాశాల బలోపేతానికి
నైపర్ రాయ్‌బరేలీ, అస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామ్యం
భారత్ క్లినికల్ పరీక్షల విస్తారిత అనుబంధ వ్యవస్థను ముందుకు తీసుకు పోవడానికి
‘బయోఫార్మా శక్తి’ పథకంలో భాగంగా
నైపర్ రాయ్‌బరేలీ-అస్ట్రాజెనెకా సహకారానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం మద్దతు
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 3:09PM by PIB Hyderabad

భారత్ క్లినికల్ పరిశోధన సంబంధిత సామర్థ్యాలను పటిష్టపరచడానికి, ప్రపంచ క్లినికల్ పరీక్షలలో భారత్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి రాయ్‌బరేలీ లోని జాతీయ ఔషధ విజ్ఞాన విద్య, పరిశోధన సంస్థ (ఎన్ఐపీఈఆర్.. ‘నైపర్’), అస్ట్రాజెనెకా ఇండియా చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యం మహానగరాల పరిధికి వెలుపల క్లినికల్ పరీక్షల సామర్థ్యాలను విస్తరించనుంది. దీనిలో భాగంగా భారత్ నలుమూలలా 25 పరిశోధన ప్రాంతాలలో సిబ్బందికి శిక్షణను ఇవ్వడమే కాక, పరీక్షల నిర్వహణకు అనువైన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. అవగాహన ఒప్పందంపై ఈ రోజు న్యూఢిల్లీలో రసాయనాలు, ఎరువుల శాఖ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి సమక్షంలో సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన ‘బయోఫార్మా శక్తి’ దృష్టికోణాన్ని సాకారం చేయనుంది. దేశవ్యాప్తంగా 1,000 క్లినికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, బలమైన బయోఫార్మా విస్తారిత అనుబంధ వ్యవస్థ (బయోఫార్మా ఇకోసిస్టమ్)ను నిర్మించడం ‘బయోఫార్మా శక్తి’ లక్ష్యం.
ఈ భాగస్వామ్యం 25 క్లినికల్ పరీక్షా కేంద్రాలతో మొదలు కానుంది. దీనిలో.. ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని మదింపు చేయడం, అవసరాలకు అనుగుణంగా శిక్షణనివ్వడం, మార్గదర్శకత్వాన్ని అందజేయడం, నైతికత, భద్రత, పరీక్షల సాధ్యాసాధ్యాలకు సంబంధించిన దస్తావేజు రచన, సహాయక ప్రక్రియలను బలోపేతం చేయడం వంటివి కలిసి ఉంటాయి. ఫార్మాస్యూటికల్స్ విభాగం ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వాన్ని, సహాయాన్ని అందిస్తుంది. ఫలితంగా ఈ కార్యక్రమాన్ని జాతీయ క్లినికల్ రిసర్చ్ సంబంధిత పరిశోధన ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకు పోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రభుత్వ ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్)లో భాగంగా కార్యక్రమ రూపకల్పన, అమలు కోసం తన క్లినికల్ డెవలప్మెంట్ సంబంధిత ప్రావీణ్యాన్ని అస్ట్రాజెనెకా ఇండియా అందిస్తుంది. భారతీయ, ప్రపంచ నిపుణుల సేవలను కూడగడుతుంది. శిక్షణ, వర్క్‌షాపులు, పాలన, తయారీలో పాలుపంచుకొనే కేంద్రాలకు ఊతాన్ని కూడా అందిస్తుంది.
ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘ప్రపంచ క్లినికల్ పరీక్షల్లో ముఖ్య పాత్రను పోషించే ప్రతిభావంతులు, సమర్థులు మన దేశంలో ఉన్నారు. ప్రధాన మహానగరాలకు ఆవల కూడా క్లినికల్ పరీక్షా సామర్థ్యాలను పటిష్టపరుచుకోవడం వల్ల దేశవ్యాప్తంగా అందె వేసిన వృత్తినిపుణులతో పాటు పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్రాల సంఖ్యను పెంచుకోవడంలోనూ తోడ్పాటు లభిస్తుంది. ఈ సహకారం ప్రభుత్వ, విద్యా రంగ, పారిశ్రామిక రంగాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి క్లినికల్ పరిశోధన సత్తాను వ్యవస్థాగతంగా బలోపేతం చేస్తుంది. అంతేకాదు, బయోఫార్మా శక్తి కీలక లక్ష్యాల సాధన మార్గంలో ముందుముందుకు పయనించడానికి కూడా ఆస్కారం ఉంటుంద’’న్నారు.
నైపర్ రాయ్‌బరేలీ డైరెక్టర్ డాక్టర్ సుభినీ సరాఫ్ మాట్లాడుతూ, ‘‘క్లినికల్ పరిశోధనలో సువ్యవస్థిత శిక్షణతో పాటు ధ్రువపత్రాలను మంజూరు చేయడానికి ఒక ప్రత్యేక వేదికను ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్ అందిస్తుంది. నైపర్ రాయ్‌బరేలీ విద్యా, పారిశ్రామిక రంగాల నైపుణ్యాలను మిళితం చేసి, చేయి తిరిగిన సిబ్బందిని తయారు చేయడంతో పాటు ఇతర భౌగోళిక ప్రాంతాలు, చికిత్స ప్రధాన ప్రాంతాల్లోనూ అమలు చేయదగిన నమూనాను అభివృద్ధిపరచడంలోనూ సాయపడుతుంద’’న్నారు.
అస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా కంట్రీ ప్రెసిడెంటు, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ప్రవీణ్ రావు అక్కినేపల్లి మాట్లాడుతూ, ‘‘కొత్త మందులను రోగుల చెంతకు చేరవేయడంలో క్లినికల్ పరిశోధన పాత్ర కీలకం. ప్రభుత్వ సహకారంతో రాయ్‌బరేలీ లోని నైపర్తో మా సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వెనుక భారతదేశంలో క్లినికల్ పరిశోధన సామర్థ్యాలను బలోపేతం చేసే, పరీక్షలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే, ఒక సుస్థిరమైన, అధిక నాణ్యత కలిగిన పరిశోధన విస్తారిత అనుబంధ వ్యవస్థను రూపొందించే లక్ష్యాలు ఉన్నాయ’’న్నారు.
ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ నమూనాగా రూపొందించారు. దీనిని పెద్ద ఎత్తున ఇతర చోట్లకు కూడా విస్తరింపచేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఫలితాలు రాబట్టే దశను పూర్తి చేసిన తరువాత ఈ నమూనాను కేన్సర్ సంరక్షణ పరిధికి మించి ఇతర భౌగోళిక ప్రాంతాలు, చికిత్స క్షేత్రాలకు కూడా విస్తరించే యోచన ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2323346)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5