రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఈఎస్‌టీఐసీ-2026లో 'సెమీకండక్టర్లు, నెక్స్ట్-జెన్ చిప్స్' కార్యక్రమానికి నాయకత్వం వహించనున్న డీఆర్‌డీఓ

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 6:58PM by PIB Hyderabad

ఢిల్లీలోని భారత్ మంటపంలో 2026 అక్టోబర్ 27 నుంచి 29 వరకు నిర్వహించతలపెట్టిన 'ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్'లో (ఈఎస్‌టీఐసీ-2026) 'సెమీకండక్టర్లు, నెక్స్ట్-జెన్ చిప్స్' అంశంపై జరిగే ప్రత్యేక నేపథ్య సెషన్‌కు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) నాయకత్వం వహించనుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు మార్గదర్శకత్వంలో 12 కేంద్ర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా 'వికసిత్ భారత్- 2047' దార్శనికతను ముందుకు తీసుకెళ్లడం, ఆత్మనిర్భరతను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం ఇది.

డీఆర్‌డీఓ నిర్వహించే ఈ సెషన్.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వదేశీ చిప్-అభివృద్ధి వ్యవస్థ, రక్షణ ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఇందులో మైక్రాన్ ఇండియా ఉపాధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్ కీలకోపాన్యాసం చేస్తారు. అనంతరం భారత్ సెమీ సీఈఓ, నేత్రాసెమీ సీఈఓ, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఉపన్యాసాలు ఉంటాయి. సెమీకండక్టర్ సాంకేతికతలలో కీలక పరిణామాలు, ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించిన ఏఐ సిస్టమ్-ఆన్-చిప్‌లు, సిలికాన్ ఎడ్జ్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న మైక్రోప్రాసెసర్ పరిశ్రమ పురోగతిపై ఆయా ప్రసంగాలు దృష్టి సారిస్తాయి.

విభిన్న రంగాల్లో నిపుణులైన వక్తలు సెమీకండక్టర్ తయారీ (ఫ్యాబ్రికేషన్), చిప్ డిజైనింగ్, ఏఐ కంప్యూటింగ్, స్వదేశీ సెమీకండక్టర్ ప్లాట్‌ఫామ్‌లు, పరిశోధన- అభివృద్ధి, వ్యూహాత్మక లేదా రక్షణ రంగ వినియోగాలపై అర్థవంతమైన చర్చించనున్నారు. ఈ సెషన్ పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యూహాత్మక భాగస్వాముల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించడానికి.. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవకాశాలను గుర్తించడానికి, కీలకమైన తదుపరి తరం అప్లికేషన్ల కోసం స్వదేశీ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో బలమైన దేశీయ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.

ఈఎస్‌టీఐసీ-2026లో ఏర్పాటు చేయనున్న ఔట్‌రీచ్ స్టాల్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సాధించిన కీలక ఘనతలు, పరిశోధన కార్యక్రమాలు, శాస్త్ర సాంకేతిక- ఆవిష్కరణల రంగాల్లో అందించిన విశేష సహకారాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రధాన వేదికను అందిస్తుంది. ఈ స్టాల్‌లో డీఆర్‌‍డీఓ పరిశోధనాంశాల ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్వాంటమ్ టెక్నాలజీ ప్రొటోటైప్‌లు, అత్యంత శీతల వాతావరణంలో ధరించే దుస్తులు, మహిళా పూర్తి-శరీర రక్షణ దుస్తులైన ‘ప్రబల్', ప్యాసివ్- పవర్డ్ ఎక్సోస్కెలిటన్లు, ఎక్కడికైనా తీసుకెళ్లగల హైబ్రిడ్ ఇంధన నిర్వహణ వ్యవస్థలు, హై-పవర్ పల్స్ లేజర్ డయోడ్‌లు, స్క్రామ్‌జెట్ ఇంజిన్ సాంకేతికతతో సహా విభిన్న వినూత్న సాంకేతిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి.

ఈ ప్రదర్శనలు స్వదేశీ పరిశోధన- అభివృద్ధిని (ఆర్-డీ) బలపరచడానికి, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి- స్వాలంబనను ప్రోత్సహించడానికి, రక్షణ- ఇతర వ్యూహాత్మక రంగాలలో కీలక అవసరాలను తీర్చడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను ప్రముఖంగా చాటిచెబుతున్నాయి. ఈ స్టాల్ విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకురాలు, పరిశోధనా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు భారత శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంలో మంత్రిత్వ శాఖ పోషిస్తున్న పాత్రపై ప్రజల్లో అవగాహనను పెంచుతుంది.

కర్ణాటకలోని బెంగళూరులో 2026 అక్టోబర్ 13న డీఆర్‌డీఓ నిర్వహించిన 'కర్టెన్ రైజర్' కార్యక్రమానికి విశిష్ట శాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ (ఎలక్ట్రానిక్స్- కమ్యూనికేషన్ సిస్టమ్స్) డాక్టర్ బీ.కే. దాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక పోటీతత్వం, డిజిటల్ సార్వభౌమత్వం.. జాతీయ భద్రత విషయంలో సెమీకండక్టర్లు, నెక్స్ట్-జెన్ చిప్‌ల ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. దేశం 'వికసిత్ భారత్' దిశగా పయనిస్తున్న తరుణంలో టెలికమ్యూనికేషన్లు, ఆటోమోటివ్ వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్, ఏఐ హార్డ్‌వేర్, వ్యూహాత్మక రక్షణ ప్లాట్‌ఫామ్‌లకు శక్తినివ్వడానికి పూర్తిస్థాయి, దృఢమైన మైక్రోఎలక్ట్రానిక్స్ వ్యవస్థను తయారుచేయటం అత్యంత ఆవశ్యకమని ఆయన ప్రముఖంగా చెప్పారు.

ప్రపంచ సరఫరా వ్యవస్థలలో వచ్చే అంతరాయాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, అంతర్జాతీయ సాంకేతిక ఎగుమతి నియంత్రణల నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం అత్యంత కీలకమని డాక్టర్ బీ.కే. దాస్ పేర్కొన్నారు. మైక్రోఎలక్ట్రానిక్స్ విలువ గొలుసులో అధిక విలువ కలిగిన ఎగుమతులను పెంచటంతో పాటు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సాధిస్తూ  ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి ప్రధాన కేంద్రంగా భారత్ ఎదగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఆధునిక యుద్ధ తంత్రంలో సెమీకండక్టర్ల కీలక పాత్రను విశిష్ట శాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ (సాంకేతికత నిర్వహణ) డాక్టర్ అనుపమ్ శర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైనిక కార్యకలాపాలలోని దాదాపు ప్రతి విభాగానికి ఈ సాంకేతికతలు అత్యంత అవసరమని ఆయన తెలిపారు. సెమీకండక్టర్ ఆధారిత విభాగానికి సంబంధించిన వ్యాపారం 2035 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎక్స్‌ట్రామ్యూరల్ రీసెర్చ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఈఆర్-ఐపీఆర్) డైరెక్టర్, సోలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ (ఎస్ఎస్‍పీఎల్) డైరెక్టర్, ఎలక్ట్రానిక్స్- రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎల్ఆర్‍డీఈ) డైరెక్టర్, కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్- ఇంటిగ్రేషన్ సెంటర్ (సీఏఎస్‌డీఐసీ) సెంటర్ హెడ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2323127) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese