హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదంతో ముగిసిన తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశం

అనుసంధానిత, సురక్షిత, సంక్షోభాలను తట్టుకోగల, అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన బిమ్స్‌టెక్‌ ప్రాంత సాధనకు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ఢిల్లీ డిక్లరేషన్‌

బిమ్స్‌టెక్‌ పరిధిలో భద్రతా సహకారాన్ని పెంపొందించే సంస్థాగత వ్యవస్థ అభివృద్ధిలో కీలకమైన తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల తొలి సమావేశానికి ఆతిధ్యమిచ్చిన భారత్‌ కు ప్రశంస

ఎక్కడ, ఎవరు, ఏ ఉద్దేశంతో పాల్పడినప్పటికీ సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, దానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన డిక్లరేషన్

ఐక్యరాజ్యసమితి చార్టర్‌, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని పూర్తిగా, నిరంతరం నిరోధించడం, ఎదుర్కోవడం, నిర్మూలించడం పట్ల దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించిన ఢిల్లీ డిక్లరేషన్‌

సభ్య దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల బాధితులకు, వారి కుటుంబాలకు, ప్రభావిత దేశాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంఘీభావం ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్‌

సంబంధిత దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టి, చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పిలుపు

ఉగ్రవాదానికి దారితీసే ఛాందసవాద ధోరణులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు ప్రధానంగా ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించడాన్ని అరికట్టేందుకు పరస్పర సహకారం అవసరమని స్పష్టీకరణ

2021 మార్చి నుంచి అమల్లోకి వచ్చిన బిమ్స్‌టెక్‌ అంతర్జాతీయ ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు, అక్రమ మాదకద్రవ్యాల రవాణాను ఎదుర్కొనే ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన డిక్లరేషన్

మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, వాటి తయారీలో ఉపయోగించే రసాయనాలు, మనీలాండరింగ్‌ నిరోధం వంటి రంగాలకు సంబంధించి ఖరారు చేసిన కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపు

తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశానికి ఆత్మీయ ఆతిథ్యంతో పాటు సమావేశాన్ని సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన డిక్లరేషన్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘విశ్వమిత్ర’ స్ఫూర్తితోనూ, శాంతి, సహజీవనం, మానవ సంక్షేమం పట్ల నిరంతర నిబద్ధతతోనూ ముందుకు సాగుతున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 8:03PM by PIB Hyderabad

ఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశం నేడు ఢిల్లీ ప్రకటన (డిక్లరేషన్‌) ఆమోదంతో విజయవంతంగా ముగిసింది.

ఢిల్లీ ప్రకటన

బంగాళాఖాత ప్రాంత బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (బిమ్స్‌టెక్‌) సభ్య దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, భారత్, మయన్మార్‌, నేపాల్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాల హోంమంత్రులమైన మేము అక్టోబర్‌ 13న భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశంలో పాల్గొన్నాం.

అనుసంధానిత, సురక్షిత, సంక్షోభాలను తట్టుకోగల, అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన బిమ్స్‌టెక్‌ ప్రాంతాన్ని సాకారం చేసేందుకు, బిమ్స్‌టెక్‌ పరిధిలో ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.

 

సార్వభౌమ సమానత్వం, ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, దురాక్రమణకు పాల్పడకపోవడం, శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం అనే సూత్రాలపై బిమ్స్‌టెక్‌ భద్రతా సహకారం ఆధారపడి ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నాం. సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక, ఉపప్రాంతీయ, ప్రాంతీయ లేదా బహుపాక్షిక సహకారానికి బిమ్స్‌టెక్‌ సహకారం తోడ్పడుతుందే తప్ప, దానికి ప్రత్యామ్నాయం కాదని పునరుద్ఘాటిస్తున్నాం.

ఉగ్రవాదాన్ని, సరిహద్దుల ఆవల జరిగే నేరాలను ఎదుర్కోవడంలో సహకారం, సమన్వయాన్ని పెంపొందించేందుకు బిమ్స్‌టెక్‌ జాతీయ భద్రతా సలహాదారులు/అధిపతుల సమావేశాలతో పాటు హోంమంత్రుల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని 2018 ఆగస్టులో ఖట్మండూలో జరిగిన నాలుగో బిమ్స్‌టెక్‌ శిఖరాగ్ర సమావేశం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాం.

 

భద్రతా రంగంలో వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడంతో పాటు, సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు హోంమంత్రుల సమావేశం (హెచ్ఎంఎం) విధానాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని 2025 ఏప్రిల్‌ 4న బ్యాంకాక్‌లో జరిగిన ఆరో బిమ్స్‌టెక్‌ శిఖరాగ్ర సమావేశం స్వాగతించిన విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్నాం.

 

బిమ్స్‌టెక్‌ పరిధిలో భద్రతా సహకారాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్థాగత వ్యవస్థ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచిన తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన భారత్ చొరవను అభినందిస్తున్నాం.

 

బంగాళాఖాత ప్రాంతం ఉమ్మడి భద్రతా ప్రదేశమని, ఇక్కడి దేశాలు పరస్పరం పంచుకునే భద్రతాపరమైన సవాళ్లకు అంతర్జాతీయ, ప్రాంతీయ కోణాలు ఉన్నాయని గుర్తించాం. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, సైబర్‌ నేరాలు, మనీలాండరింగ్‌, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదానికి ఆర్థిక సహాయం అందించడం, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, సముద్ర దోపిడీలు, అక్రమ వేట, అక్రమ వలసలు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం సైబర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు ఈ సవాళ్లలో భాగంగా ఉన్నాయి.

 

సరిహద్దులు దాటి పనిచేసే నేర ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయని గుర్తించాం. అక్రమ రవాణాకు గురైన బాధితులను ఆన్‌లైన్‌ మోసాలు, స్కామ్‌లకు పాల్పడేలా ప్రభావితం చేస్తూ, వారే నేరాలకు పాల్పడే పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. అలా బాధితులు బలవంతంగా నేరాలు చేయాల్సిన పరిస్థితి, అప్పుల బానిసత్వం, వివిధ రకాల వేధింపులు, దోపిడీలకు గురవుతున్నారు.

 

సైబర్ మోసాల కేంద్రాల్లో (స్కామ్ సెంటర్లు) నిర్బంధంగా నేరాలకు పాల్పడేలా బలైపోతున్న మానవ అక్రమ రవాణా బాధితుల విషయంలో ఆయా మూల ప్రాంతాలు, రవాణా మార్గాలు, గమ్యస్థానాలుగా ఉన్న దేశాలు అత్యంత అత్యవసరంగా సహకరించుకోవాలని స్పష్టం చేస్తున్నాం. ఈ స్కామ్ సెంటర్లు నడుస్తున్న దేశాలు, బాధితులు మోసపోయిన దేశాలు కూడా తమ చట్ట పరిధులు, సరిహద్దుల పరిమితులకు లోబడి అంతర్గత చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాధితుల హక్కులను గౌరవిస్తూ, వారిని కేంద్రబిందువుగా చేసుకునే బాధితుల ఆధారిత విధానం ద్వారా ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నాం.

 

సంక్లిష్టంగా మారుతున్న, నిరంతరం ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లను గుర్తిస్తున్న్నాం. సహకారం, ఉమ్మడి బాధ్యత స్ఫూర్తితో సభ్య దేశాలు ఈ సవాళ్లకు తగిన విధంగా స్పందించాలని కోరుతున్నాం.

 

మన భద్రతకు ఎదురవుతున్న బహుముఖ సవాళ్లను నిరోధించడం, ఎదుర్కోవడం, నిర్మూలించడం కోసం బిమ్స్‌టెక్‌ పరిధిలో భద్రతా రంగంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నాం.

 

భద్రత, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయి. బిమ్స్‌టెక్‌ పరిధిలో భద్రతా రంగంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం వల్ల భద్రతను నిర్ధారించడమే కాకుండా, అభివృద్ధికి సంబంధించిన ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది.

 

సరిహద్దులు దాటి జరిగే ఉగ్రవాదంతో సహా, ఎక్కడ, ఎవరి ద్వారా, ఏ ఉద్దేశంతో జరిగినప్పటికీ, అన్ని రూపాలు, విధానాల్లోని ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి చార్టర్‌, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్ని సంపూర్ణంగా, నిరంతరం నిరోధించడం, ఎదుర్కోవడం, నిర్మూలించడం పట్ల మా దృఢ నిశ్చయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలను, ముఖ్యంగా 1267 ఆంక్షల కమిటీకి సంబంధించిన ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాం. సభ్య దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల బాధితులకు, వారి కుటుంబాలకు, ప్రభావిత దేశాల ప్రభుత్వాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంఘీభావం ప్రకటిస్తున్నాం. సంబంధిత దేశీయ, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంబంధిత తీర్మానాలకు అనుగుణంగా బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టి, చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం.

 

ఉగ్రవాదానికి దారితీసే ఛాందసవాద ధోరణులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించడాన్ని అరికట్టడానికి పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేస్తున్నాం. ఇందుకోసం, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని నిరోధించేందుకు అంతర్జాతీయంగా అంగీకరించిన ప్రమాణాలు, మనీలాండరింగ్‌ నిరోధక ప్రమాణాలను ప్రోత్సహించాలి. ఈ చర్యలు ఆయా దేశాల చట్టాలు, సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాద ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, ఉగ్రవాద సంస్థల్లోకి వ్యక్తులను చేర్చుకునే ప్రయత్నాలను అరికట్టడం కూడా అవసరమని స్పష్టం చేస్తున్నాం.

 

మన భద్రతకు ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు మన జాతీయ భద్రతా అధిపతులు, సలహాదారులు పోషించిన విశిష్ట పాత్రకు అభినందనలు. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతి, 1.5 ట్రాక్ బిమ్‌స్టెక్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభం, హిమాలయన్ సైన్స్ కౌన్సిల్ స్థాపన దిశగా చేపట్టిన చొరవలను ప్రధాన కార్యదర్శి నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం.

 

అంతర్జాతీయ ఉగ్రవాదాన్నీ, సరిహద్దులు దాటి జరిగే వ్యవస్థీకృత నేరాలనూ, అక్రమ మాదకద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడానికి 2021 మార్చి నుంచి అమల్లోకి వచ్చిన బిమ్స్‌టెక్‌ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం.

 

2022 మార్చిలో కొలంబోలో జరిగిన ఐదో బిమ్స్‌టెక్‌ శిఖరాగ్ర సమావేశంలో సంతకం చేసిన నేర సంబంధిత విషయాల్లో పరస్పర న్యాయ సహకారానికి సంబంధించిన బిమ్స్‌టెక్‌ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కూడా కోరుతున్నాం.

 

నేరస్థుల అప్పగింత, శిక్ష పడిన ఖైదీల బదిలీ, మానవ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించిన ఒప్పందాల ముసాయిదాలను, మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడం, స్వదేశానికి తిరిగి పంపించడం, సమాజంలో తిరిగి కలిసిపోయేలా సహాయపడటం కోసం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని కోరుతున్నాం.

 

మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, వాటి తయారీలో ఉపయోగించే రసాయనాలు, మనీలాండరింగ్‌ నిరోధం వంటి రంగాల్లో ఖరారు చేసిన కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఛాందసవాద ధోరణులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారానికి సంబంధించిన ఉపబృందం (ఎస్జీ-సీసీఆర్టీ) రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను కూడా త్వరగా ఖరారు చేయాలని కోరుతున్నాం.

 

బిమ్స్‌టెక్‌ మాదకద్రవ్యాల నేరాల పర్యవేక్షణ విభాగాన్ని (బీడీఓlఎండీ)) అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. మానవ అక్రమ రవాణా, వలసదారుల అక్రమ తరలింపుపై ప్రతిపాదించిన బిమ్స్‌టెక్‌ ప్రాంతీయ సమాచార మార్పిడి వ్యవస్థకు సంబంధించి సభ్య దేశాల మధ్య మరింత సంప్రదింపులు జరపాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఈ వ్యవస్థ ఆయా దేశాల జాతీయ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. సభ్య దేశాలన్నీ ప్రతి సంవత్సరం మాదకద్రవ్యాలపై వార్షిక నివేదికలను సకాలంలో ప్రచురించాలని కూడా ఆశిస్తున్నాం.

 

ఉగ్రవాదం, ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్‌, ఇతర సరిహద్దులు దాటి జరిగే నేరాలను ఎదుర్కోవడంలో సభ్య దేశాలన్నింటి నుంచి వచ్చే ప్రతినిధులకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలను మా దేశాల్లోని ప్రముఖ శిక్షణా సంస్థల ద్వారా అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ కార్యక్రమాలను బిమ్స్‌టెక్‌ పరిధిలో ప్రాంతీయ కార్యక్రమాలుగా చేపడతాం.

 

భద్రతా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉగ్రవాద నిరోధం, అంతర్జాతీయ నేరాలపై సంయుక్త కార్యాచరణ బృందం, దాని ఉపబృందాలు చేపట్టిన అద్భుతమైన కృషికి అభినందనలు. ఈ ప్రకటనలో పొందుపరిచిన నిర్ణయాలు, ఆదేశాల అమలుపై తదుపరి చర్యలను పర్యవేక్షించే బాధ్యతను ఆ బృందానికే అప్పగిస్తున్నాం.

 

ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల సమావేశాలు జరిగే సందర్భాల్లో, తగిన విధంగా వాటికి అనుబంధంగా బిమ్స్‌టెక్‌ సభ్య దేశాల హోం మంత్రిత్వ శాఖల ప్రతినిధి బృందాల సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నాం. ఆయా సంస్థల ఎజెండాలోని అంశాలపై సమన్వయం సాధించడం, ఉమ్మడి అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఈ సమావేశాల ఉద్దేశం.

 

మనీలాండరింగ్‌పై ఆసియా - పసిఫిక్‌ గ్రూప్‌ (ఏపీజీ)లో పరిశీలక హోదాను పొందేందుకు బిమ్స్‌టెక్‌ సచివాలయం చేసిన కృషిని అభినందిస్తున్నాం. ఈ సమావేశం నిర్వహణకు సన్నాహాలు చేయడంలో సచివాలయం పోషించిన పాత్రను, అందించిన సహకారం ప్రశంసనీయం. బిమ్స్‌టెక్‌ పరిధిలో ప్రాంతీయ భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సచివాలయానికి పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇస్తున్నాం. సభ్య దేశాలు చేపడుతున్న చర్యలకు తోడ్పడుతూ, వాటిని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల కార్యాలయం (యూఎన్ఓడీసీ), అంతర్జాతీయ క్రిమినల్‌ పోలీసు సంస్థ (ఇంటర్ పోల్), ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఇతర సంబంధిత అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించాలని బిమ్స్‌టెక్‌ సచివాలయాన్ని కోరుతున్నాం.

 

తొలి బిమ్స్‌టెక్‌ హోంమంత్రుల సమావేశానికి ఆతిథ్యమివ్వడంతో పాటు, మాకు ఆత్మీయ ఆతిథ్యం అందించి, సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వానికి మా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

 

క్రమం తప్పకుండా తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి, భవిష్యత్తులో జరిగే మా సమావేశాలకు ఆయా దేశాల్లో ఆతిథ్యమివ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం.

 

***


(రిలీజ్ ఐడి: 2323122) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Assamese , Gujarati