కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ డిటాక్స్ ప్రచారం: విమాన ప్రయాణాల్లోనూ ఉత్తరాల జ్ఞాపకాలను పరిచయం చేస్తున్న ఇండియా పోస్ట్, ఇండిగో


30 వేల అడుగుల ఎత్తులో విమానంలో ప్రయాణిస్తూ డిజిటల్ తెరల నుంచి విరామం తీసుకుని చేత్తో ఉత్తరాలు రాయడంలోని ఆనందాన్ని, మనుషుల మధ్య అర్థవంతమైన అనుబంధాల విలువను ఆస్వాదించిన ప్రయాణికులు

జాతీయ తపాలా వారోత్సవాల్లో ఫిలాటెలీ డే సందర్భంగా ఇండియా పోస్ట్, ఇండిగో వినూత్న ప్రచారం

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 3:42PM by PIB Hyderabad

పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో చేతిరాత లేఖల ఆనందాన్ని పునరుద్ధరించేందుకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఇండిగో విమాన సంస్థతో కలిసి అక్టోబర్ 12న ఒక వినూత్న 'డిజిటల్ డిటాక్స్' ప్రచారాన్ని నిర్వహించింది. జాతీయ పోస్టల్ వారోత్సవాల్లో (అక్టోబర్ 9 - 15) భాగంగా ఫిలాటెలీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులు తమ డిజిటల్ పరికరాలకు కొంత విరామం ఇచ్చి, తమ ఆలోచనలను కాగితంపై పెడుతూ లేఖల ద్వారా ప్రియమైనవారితో అనుబంధాన్ని పంచుకునేలా ఈ చొరవ ప్రోత్సహించింది.     

(చేతిరాత ఉత్తరాల ద్వారా సమాచార మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రయాణికులకు డిజిటల్‌ డిటాక్స్‌ కిట్ల పంపిణీ)

ఈ ప్రచారంలో భాగంగా, ఎంపిక చేసిన ఇండిగో విమానాల్లో ప్రయాణికులకు ప్రయాణ సమయంలో పోస్ట్‌కార్డులతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన 'డిజిటల్ డిటాక్స్' కిట్‌లను అందించారు.

బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల మధ్య ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఈ ప్రచారం అనుసంధానించింది. చేతిరాత లేఖల అనుభవాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము రాసిన లేఖలను గమ్యస్థాన విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియా పోస్ట్ లెటర్ బాక్సుల్లో వేశారు. ఆయా నగరాల విశిష్ట ముఖద్వారాలు, చారిత్రక ఘట్టాలను ప్రతిబింబించే ప్రత్యేక పోస్ట్‌కార్డులను ఈ ప్రచారం కోసం రూపొందించారు.

     

(30 వేల అడుగుల ఎత్తులో డిజిటల్‌ తెరలకు విరామం ఇచ్చి, ఆత్మీయులకు మనసులోని మాటలను ఉత్తరాలుగా రాసిన విమాన ప్రయాణికులు.)

ఈ అనుభూతిపై స్పందిస్తూ విమానంలోని ఒక ప్రయాణికుడు "బ్లూ టిక్‌ల కాలంలో, నేను 30 వేల అడుగుల ఎత్తులో ఒక పోస్ట్‌కార్డ్ రాశాను! మేఘాలు, ప్రశాంతత మధ్యలో నా జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తుల కోసం నా ఆలోచనలను కాగితంపై పెట్టడానికి అది ఒక అద్భుతమైన క్షణం" అని పేర్కొన్నారు. 

ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో, మానసిక ప్రశాంతతను పెంచడంలో, మానవ అనుబంధాలను బలోపేతం చేయడంలో 'డిజిటల్ డిటాక్స్' ప్రాముఖ్యతను ఈ ప్రచారం చాటిచెప్పింది. ఈ చొరవ ద్వారా చేతిరాత లేఖల శాశ్వతమైన ఆకర్షణను పునరుద్ఘాటించిన ఇండియా పోస్ట్ అర్థవంతమైన సమాచార మార్పిడి ద్వారా ప్రజలను మరింత చేరువ చేయడానికి తన అంకితభావాన్ని చాటుకుంది.

సోషల్ మీడియా లింక్స్ :
1. https://www.instagram.com/p/DeZPSrTkjrX/?srtk=MWZhejBwNWtibnd5cQ==

***


(రిలీజ్ ఐడి: 2322837) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Malayalam