శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌-యూకే విజ్ఞాన-ఆవిష్కరణల మండలి 8వ సమావేశంలో సహకార విస్తృతిపై మంత్రులు డాక్టర్ జితేంద్ర సింగ్.. జొనాథన్ రేనాల్డ్స్ నేతృత్వాన చర్చలు


న్యూఢిల్లీలో బ్రిక్-సీడీఎఫ్‌డీ–ఓఎన్‌టీ ఇండియా జెనోమిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన మంత్రులు
పారిశ్రామిక రంగ నేతృత్వంలో గల పరిశోధన-సాంకేతిక పరిజ్ఞాన రూపాంతరీకరణ.. వాణిజ్యీకరణపై భారత్-యూకే భాగస్వామ్యం దృష్టి

ఏఐ.. క్వాంటం టెక్నాలజీ.. అత్యాధునిక పదార్థాలు.. బయోటెక్నాలజీ.. టెలికమ్యూనికేషన్స్.. నెట్-జీరో టెక్నాలజీల దాకా విస్తరించిన సహకారం

వాతావరణ శాస్త్రం.. భూభౌతిక ముప్పులు.. ఆరోగ్య సంరక్షణ.. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాల్లో సమష్టి పరిశోధనతో మరింత సహకారానికి ఆస్కారం

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 4:48PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలో భారత్‌-యూకే విజ్ఞాన-ఆవిష్కరణల మండలి 8వ సమావేశం సందర్భంగా రెండు దేశాల మధ్య  సహకార విస్తృతిపై చర్చలకు ఉభయ దేశాల సహాయ మంత్రులు నేతృత్వం వహించారు. ఈ మేరకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూ విజ్ఞాన (స్వతంత్ర బాధ్యత), సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో పాటు యూకే వ్యాపార-ఆవిష్కరణ-విజ్ఞానశాస్త్ర-వాణిజ్య శాఖల సహాయ మంత్రి జొనాథన్ రేనాల్డ్స్ ఇందులో పాల్గొన్నారు.

విజ్ఞాన శాస్త్ర-ఆవిష్కరణల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడమే కాకుండా పరిశోధన భాగస్వామ్యాల బలోపేతం, అత్యాధునిక సాంకేతికతలలో సహకారం, విజ్ఞాన పరిశోధనల రూపాంతరీకరణకుగల అవకాశాలపై ఈ సమావేశంలో దృష్టి కేంద్రీకరించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రవిజ్ఞాన సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్, విజ్ఞాన-సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేష్ వాఘ్మారే, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస కుమార్ తుమ్మల, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ రాజేష్ పాఠక్‌ సహా సంబంధిత విభాగాలు, సంస్థల ఉన్నతాధికారులు భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు.

అలాగే యూకే ప్రతినిధి బృందానికి- భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ శ్రీమతి లిండీ కామెరాన్, డిప్యూటీ హైకమిషనర్ శ్రీ బెన్ మెల్లర్, వ్యాపార-ఆవిష్కరణ-వాణిజ్య శాఖ మధ్యంతర శాశ్వత కార్యదర్శి శ్రీమతి అమందా బ్రూక్స్, ట్రేడ్ కమిషనర్ శ్రీ హర్జిందర్ కాంగ్, వ్యాపార-ఆవిష్కరణ-వాణిజ్య శాఖ అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ రైస్ బోవెన్ సహా యూకే యొక్క శాస్త్రవిజ్ఞాన-పరిశోధన-ఆవిష్కరణావరణ వ్యవస్థకు చెందిన ఇతర ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు.

ఈ సమావేశంలో భాగంగా ‘బ్రిక్-సీడీపీఎఫ్‌డీ–ఓఎన్‌టీ ఇండియా జెనోమిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌’ను డాక్టర్ జితేంద్ర సిం, జొనాథన్ రెనాల్డ్స్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (బ్రిక్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేష్ ఎస్.గోఖలే, బ్రిక్-సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్థుర్-సీతారామ్, ఆక్స్‌ ఫర్డ్ నానోపోర్ టెక్నాలజీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీ నిక్ కెహర్ తదితరులు కూడా పాలుపంచుకున్నారు.

భారత్‌-యూకే పరిశోధన-ఆవిష్కరణల అవగాహన ఒప్పందం, టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్, భారత్‌-యూకే విజన్-2035 ప్రాతిపదికగా విస్తృత సహకారంపై మండలి చర్చనీయాంశాల జాబితా రూపొందింది. పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ఆవిష్కర్తల మధ్య సహకారానికి ఈ చట్రాలన్నీ పునాదిగా ఉపయోగపడతాయి. శాస్త్రవిజ్ఞాన ప్రగతిపై దృష్టి సారించడంతో పాటు పరిశోధన-సాంకేతికతలను ఆచరణాత్మక స్థాయిలో రూపాంతరీకరించడం కూడా వీటి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.

పారిశ్రామిక రంగ నేతృత్వాన పరిశోధన-సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణ కీలక భాగస్వామ్య రంగాలుగా కొనసాగుతున్నాయి. ‘ఇన్నోవేట్ యూకే’తో భారత శాస్త్ర-సాంకేతిక విభాగం సహకారం ద్వారా నవ్య మేధా సంపత్తి, సాంకేతికతలు, ప్రక్రియలు, నమూనాల రూపకల్పనే లక్ష్యంగా గల సంయుక్త పారిశ్రామిక పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమం కింద అత్యాధునిక తయారీ, పవర్ ఎలక్ట్రానిక్స్, నెట్-జీరో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో 8 ప్రాజెక్టులకు చేయూతపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రస్తుతం వీటి ప్రగతి వివిధ దశలలో ఉంది.

ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, అత్యాధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, నెట్-జీరో టెక్నాలజీ సహా అత్యాధునిక-వ్యూహాత్మక సాంకేతికతలకూ ఈ సహకారం విస్తరించింది. పరస్పరపూరక పరిశోధన సామర్థ్యాల సద్వినియోగానికి, ఆవిష్కరణావరణ వ్యవస్థల బలోపేతానికి, పారిశ్రామిక, సామాజిక అనువర్తన సహిత సాంకేతికతల రూపకల్పనకు మద్దతు దిశగా అవకాశాలను ఈ రంగాలు కల్పిస్తాయి.

యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ-వాతావరణ మార్పు విజ్ఞాన, భూభౌతిక ముప్పులు, ఆధునిక తయారీ, ప్రాథమిక విజ్ఞానశాస్త్రం వంటి రంగాలు కూడా ఉన్నాయి. వాతావరణ-మార్పు సంబంధిత శాస్త్ర సహకారంలో భాగంగా దక్షిణాసియా రుతుపవనాలతో ముడిపడిన సహజ ప్రమాదాలపై పరిశోధన, మెరుగైన మోడలింగ్ సామర్థ్యాలు, ప్రమాద-ఆధారిత అంచనాలు వంటివి భారత-యూకే సంస్థల మధ్య ఉమ్మడి పరిశోధనలో అంతర్భాగంగా ఉన్నాయి.

పరిశోధన, పరిశ్రమ-ఆవిష్కరణావరణ వ్యవస్థల మధ్య నిరంతర సంస్థాగత భాగస్వామ్యం, సన్నిహిత సంబంధాల ప్రాధాన్యాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది. శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల కొనసాగింపు, పరిశోధన భాగస్వామ్యాల బలోపేతానికి, ఉమ్మడి సవాళ్లపై శాస్త్ర సామర్థ్యాలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చడానికి భారత్-యూకేల మధ్య ప్రస్తుత సహకారం తోడ్పడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2322603) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी