శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఐ ఆధారిత ఔషధాలు, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పెప్‌ట్రిస్‌తో టీడీబీ-డీఎస్‌టీ చేసుకున్న రూ.86 కోట్ల ఒప్పందానికి ఆర్‌డీఐ మద్దతు


భారత ఔషధ ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏఐ ద్వారా కనుగొన్న నాలుగు ఔషధాలను క్లినికల్ దశ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు వీఐజీఓఆర్ కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 10:52AM by PIB Hyderabad

కృత్రిమ మేధ సాయంతో అత్యాధునిక ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగుళురుకు చెందిన పెప్‌ట్రిస్‌ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టీడీబీ) ఒప్పందం కుదుర్చుకుంది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధి ద్వారా ఈ సంస్థకు రూ.86 కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది.

ఈ ప్రాజెక్టు పేరు… వీఐజీఓఆర్: ఏఐ ద్వారా కనుగొన్న ఔషధాలను క్లినికల్ దశలో అభివృద్ధి చేయటం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 172 కోట్లు. నాలుగు ఔషధాలను టెక్నాలజీ రెడీనెస్ లెవల్ (టీఆర్ఎల్)-4 నుంచి టీఆర్ఎల్-6 స్థాయికి తీసుకెళ్లటమే దీని లక్ష్యం. ఇందులో ప్రీ-క్లినికల్ అభివృద్ధి, పరిశీలన, క్లినికల్ పరీక్షల తయారీ ఉంటాయి. అవసరం మేరకు మార్పిడికి అవకాశమున్న రుణం (ఓసీడీ) ద్వారా వీటికి ఆర్థిక సహాయం అందుతుంది.

పరిశోధకులు అద్భుతమైన ఔషధాలను గుర్తించటంలో, వ్యాధి ప్రక్రియల పరిశోధనలో, సాధ్యమైన చికిత్స అన్వేషణను వేగవంతం చేయటంలో ఏఐ సహకరిస్తూ, ఔషధ ఆవిష్కరణల్లో నూతన మార్గాలను కల్పిస్తోంది. సాంకేతికత ద్వారా కనుగొన్న ఔషధాలను, ఆచరణాత్మక ఔషధాలుగా మార్చేందుకు విస్తృతమైన ప్రయోగాత్మక నిర్ధారణ, క్లినికల్ దశకు సంబంధించిన పాత అధ్యయనాలు, క్లినికల్ అభివృద్ధి అవసరం.

పెప్‌ట్రిస్ వీఐజీఓఆర్ కార్యక్రమం సొంత ఏఐ ఆధారిత ఔషధ ఆవిష్కరణ వేదికను ఉపయోగించుకుని, ఔషధాల పోర్ట్‌ఫోలియోను కీలక అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లటం ద్వారా ఈ కీలకమైన పరివర్తనను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గణన సామర్థ్యాలు, శాస్త్రీయ ధ్రువీకరణ, నిరూపితమైన ఔషధ తయారీ ప్రక్రియల కలయిక ద్వారా సరికొత్త చికిత్సలను గుర్తించటం, అభివృద్ధి చేయటంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా తగినంత వైద్య సహాయం లేని ప్రధాన చికిత్సా రంగాలకు ఇది ప్రాధాన్యతనిస్తుంది.

నాలుగు ఔషధాల గురించి ఈ కార్యక్రమం వివరిస్తుంది. పీఈపీఆర్111… ఇది నరాల సంబంధిత రుగ్మతలు, క్యాన్సర్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. పీఈపీఆర్ఎక్స్101… ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. పీఈపీఆర్202… ఇది నరాల బలహీనతను లక్ష్యంగా చేసుకుంటుంది. పీఈపీఆర్112… ఇది డీఎండీపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఔషధం టీఆర్ఎల్-4 స్థాయిలో ఉంది. ఈ ప్రాజెక్టు టీఆర్ఎల్-6 స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంబంధిత శాస్త్రీయ నియంత్రణ అవసరాలకు లోబడి ఈ అభివృద్ధి కార్యక్రమం మూడేళ్లపాటు క్రమబద్ధమైన పురోగతిని ఊహించింది. ఇందులో అధునాతన ప్రీ-క్లినికల్, ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ (ఐఎన్‌డీ)-సామర్థ్యానికి సంబంధించిన అధ్యయనాలు, ఫార్ములేషన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్, తయారీ, ప్రారంభ కార్యకలాపాలుంటాయి.

పెప్‌ట్రిస్ ఏఐ ఆధారిత ఔషధ అన్వేషణ సామర్థ్యాలను, అనుభవాలను మరింత విస్తృతం చేయటానికి వీఐజీఓఆర్ కార్యాక్రమాన్ని రూపొందించారు. నూతన చికిత్సకు ఉపయోగపడే ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేయటమే దీని ఉద్దేశం. ఏఐ ఆధారిత అన్వేషణను, సంప్రదాయ ఔషధ అభివృద్ధి నైపుణ్యాన్ని ఈ విధానం జోడిస్తుంది. ఇందులో అభివృద్ధి, ధ్రువీకరణకు తోడ్పడేందుకు గ్లోబల్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్ఓ) వ్యవస్థలను ఉపయోగిస్తారు. సమన్వయంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా పలు ఔషధాల పురోగతికి మద్దతునిస్తూ, ఏఐ-నేతృత్వంలోని పరిశోధనలను చికిత్సలుగా మార్చటాన్ని ఈ ప్రాజెక్టు బలపరుస్తుంది. సమర్థవంతమైన చికిత్సలు అంతగా అందుబాటులో లేని కొన్ని ప్రత్యేక వ్యాధి విభాగాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారించటం వల్ల, వినూత్న పరిష్కారాలను అందించే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ... "ఔషధ పరిశోధనలో కృత్రిమ మేధను ఉపయోగించటం వల్ల నూతన ఔషధాలను గుర్తించి, అభివృద్ధి చేసే ప్రక్రియ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆశాజనకమైన ఆవిష్కరణలను ప్రామాణిక చికిత్సా పద్ధతులుగా మార్చాలంటే నిరంతర పెట్టుబడులు, కఠినమైన శాస్త్రీయ మూల్యాంకనం, స్పష్టమైన అభివృద్ధి మార్గం అత్యవసరం. ఆవిష్కరణలకు, క్లినికల్ అభివృద్ధికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటంలో, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయటంలో ఆర్‌డీఐ ఫండ్ ద్వారా టీడీబీ ఇలాంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలకు మద్దతిస్తోంది" అని అన్నారు.

పెప్‌ట్రిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడుతూ... "ఆర్‌డీఐ ఫండ్ ద్వారా టీబీడీకి లభించిన మద్దతు వీఐజీఓఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఏఐ-కనుగొన్న ఔషధాలను క్లినికల్ పరీక్షలకు ముందస్తు దశలోని కీలక ఘట్టాల దిశగా నడిపించేందుకు సహాయపడుతుంది. మా విధానం ఏఐ-ఆధారిత అన్వేషణను ప్రయోగాత్మక పరిశీలనతో, నిర్ధారించిన ఔషధ-అభివృద్ధి ప్రక్రియలతో మిళితం చేసి, వైద్య అవసరాలను పరిష్కరిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మా సాంకేతిక ఆవిష్కరణలను క్లినికల్ అభివృద్ధి దశకు చేర్చగల సమర్థవంతమైన ఔషధాలుగా మార్చే మా ప్రయత్నాలకు బలమైన మద్దతు లభిస్తుంది" అని తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 2322300) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil