ఆర్థిక మంత్రిత్వ శాఖ
కారులో దాచి ఉంచిన రూ.9 కోట్ల విలువైన 5.8 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనపరుచుకున్న డీఆర్ఐ... బంగారం దొంగరవాణా గుట్టు రట్టు... ఇద్దరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 10:46PM by PIB Hyderabad
వ్యవస్థీకృత బంగారు దొంగ రవాణా ముఠాలకు వ్యతిరేకంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అణచివేత చర్యలను పకడ్బందీగా కొనసాగిస్తోంది.. ఉప్పందిన సమాచారం ఆధారంగా ఈ నెల 8వ, 9వ తేదీల మధ్య విశాఖపట్నంలో ఓ కారును డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. ఇద్దరు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. వారు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. జాతీయ రహదారిలో నిఘాను తీవ్రతరం చేసిన అధికారులు చాలా సేపు వెంబడించి మరీ కారును నిలిపివేశారు.

జప్తు చేసుకున్న 5.8 కిలోల బంగారం
వాహనాన్ని క్షుణ్నంగా సోదా చేయగా, ముందు సీటులో కూర్చొన్న ప్రయాణికుడి ఫుట్‌రెస్ట్ కింద ప్రత్యేకంగా రూపొందించిన ఒక రహస్య అర బయటపడింది. అందులో 24 కేరట్ల విదేశీ బంగారాన్ని ఉంచిన మూడు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం మొత్తం బరువు దాదాపు 5,832.90 గ్రాములు ఉంది. దాని విలువ సుమారు రూ.8.98 కోట్లు ఉంటుంది. ఆ బంగారాన్ని దొంగచాటుగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మార్గంలో నుంచి తీసుకువస్తున్నట్లు, దానిని హైదరాబాద్‌కు తీసుకుపోతున్నట్లు వాహనంలో ఉన్న వారు ఒప్పుకొన్నారు.
బంగారాన్ని కస్టమ్స్ చట్టం-1962కు సంబంధించిన నియమావళి ప్రకారం జప్తు చేశారు. కారులో ఉన్న ఇద్దరినీ అరెస్టు చేశారు.
ఈ కేసుకు గత నెల 18వ, 19వ తేదీల్లో డీఆర్ఐ జప్తు చేసిన మరో పెద్ద స్వాధీన ఘటనతో చాలా పోలికలు ఉన్నాయి. ఆ దాడిలో, అధికారులు ఢిల్లీ సమీపంలో పల్‌వల్ టోల్ ప్లాజా దగ్గర రెండు థార్ వాహనాలను ఆపారు. వాటిలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో నుంచి రూ.23 కోట్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 15 కిలోలకు పైబడిన విదేశీ బంగారాన్ని జప్తు చేశారు. ఆ వ్యవహారంలో ప్రాథమిక రహస్య సమాచారం ప్రకారం.. బంగారాన్ని మయన్మార్ నుంచి చట్టవ్యతిరేకంగా తరలించారని వెల్లడి అయింది.
వ్యవస్థీకృత బంగారు దొంగ రవాణా ముఠాలు రాను రాను వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారని, నిషిద్ధ వస్తువులను దేశంలో వివిధ ప్రాంతాలకు దొంగచాటుగా తరలించడానికి వాహనాల్లో ప్రత్యేకంగా రూపొందించిన గుప్తమైన అరలను ఉపయోగిస్తున్నారని ఈ కేసులు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి గుప్త పద్ధతులను పసిగట్టడానికి, స్మగ్లింగ్ నెట్‌వర్కుల పీచమణచడానికి, దేశ ఆర్థిక ఆదాయ హితాలను పరిరక్షించడానికి డీఆర్ఐ దృఢసంకల్పంతో పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2322097)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7