ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని చెన్నైలో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
మన యువతలోని శక్తి, ఉత్సాహం దేశ భవిష్యత్తుపై ఎంతో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి: ప్రధానమంత్రి
నేటి యువత ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు చోదకశక్తిగా నిలవాలని ఆకాంక్షిస్తోంది; వికసిత భారత్ నిర్మాణానికి అవసరమైన వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు భారత్ భవిష్యత్తునే కాకుండా, యావత్ ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దనున్నాయి: ప్రధానమంత్రి
భారత్ లో నేడు అందుబాటులో ఉన్న అపారమైన అవకాశాలతో యువతీయువకులంతా ఆ విస్తృత అవకాశాల ప్రపంచంలో తమ భవిష్యత్తును చూసుకోవాలన్నది నా ఆకాంక్ష: ఇది మీ సమయం.. ఇది మీకు లభించిన సువర్ణావకాశం: ప్రధానమంత్రి
విద్యార్థులందరికీ ఎంతో విలువైన బోధనలు అందించిన మహనీయుడు, గొప్ప తత్వవేత్త సంతు తిరువళ్ళువర్ ఈ సందర్భంగా స్మరణీయులు; ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తిరుక్కురళ్ గ్రంథం రష్యన్ అనువాద ప్రతిని అందించే అవకాశం నాకు లభించింది: ప్రధానమంత్రి
జీవితాంతం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలనుకునే వారందరికీ తిరుక్కురళ్ గొప్ప మార్గదర్శి: ప్రధానమంత్రి
తిరువళ్ళువర్ తన ప్రసిద్ధ నీతి పద్యాల్లో (కురళ్) ఒకదానిలో... విద్యను అభ్యసించడంతో పాటు, దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టడం కూడా అంతే ముఖ్యమని బోధించారు: ప్రధాని
2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే కలను సాకారం చేసుకునే దిశగా కూడా ముందుకు సాగుతున్నాం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 7:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తమిళనాడులోని చెన్నైలో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. నేటి రోజుకున్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ, నవరాత్రుల తొలి రోజున శివ, శక్తుల పవిత్ర భూమిని సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సరస్వతీ మాత భక్తులను కలుసుకుంటూ, యువతలోని సానుకూల శక్తిని, ఉత్సాహాన్ని, ఉల్లాసభరితమైన చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ఈ పర్వదినానికి అత్యంత శుభప్రదమైన ఆరంభమని ఆయన అన్నారు. “మీ అందరి కళ్లలోనూ నాకు భారతదేశ భవిష్యత్తు కనిపిస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
యువతలో అపారమైన సామర్థ్యం ఉందని నేటి యువత ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు చోదకశక్తిగా నిలవాలనే బలమైన ఆకాంక్షను కలిగి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ జాతీయ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నూతన ఆలోచనలు, వినూత్న పరిష్కారాలు మన దేశ భవిష్యత్తునే కాకుండా, యావత్ ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “నేడు ప్రపంచం వివిధ సమస్యలకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోంది. ఆ పరిష్కారాలను అందించే సామర్థ్యం మీలో ఉంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
విద్యార్థులు విశాలమైన లక్ష్యాలతో కలలు కనాలని ప్రోత్సహిస్తూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న అపారమైన అవకాశాల నేపథ్యంలో ప్రతి యువకుడు, యువతి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అపూర్వమైన అవకాశాలు అందుబాటులో ఉన్న ఈ కాలంలోదేశం సమష్టిగా కంటున్న జాతీయ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం యువత చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. “మనమంతా కలిసికట్టుగా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం!” అని శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు.
తన పర్యటన వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రేరణను వివరిస్తూ ప్రధాని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కొద్ది నెలల క్రితం నాగర్‌కోయిల్‌లో గిరిజా అమ్మతో పాటు పలువురు పిల్లలను కలుసుకున్న సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. "దేశ భవిష్యత్తు పట్ల ఆమెకు ఉన్న అద్భుతమైన అంకితభావం, ఆత్మవిశ్వాసం, నిశ్చలమైన నిష్ఠ నా మనస్సుపై చెరగని ముద్ర వేశాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఆ తొలి సమావేశంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గిరిజా అమ్మ చూపిన ఆప్యాయత, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విద్యాసంస్థ పట్ల తనకున్న గౌరవం కారణంగా స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కావాలన్న ఆమె ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. “విజయవంతంగా సాగిన ఈ 50 ఏళ్ల ప్రస్థానానికి గాను విశ్వ హిందూ విద్యా కేంద్రానికి, హిందూ విద్యాలయ కుటుంబం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ విద్యాసంస్థ సాగించిన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని వివరిస్తూ, చెన్నైలోని వెస్ట్ మాంబళంలో 1975లో కేవలం ఏడుగురు విద్యార్థులతో, పరిమిత వనరులతో విశ్వ హిందూ విద్యా కేంద్రం ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలు, శాశ్వత భవనం కూడా అందుబాటులో లేని ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వ్యవస్థాపకులు తమ దృఢ సంకల్పంతో, అచంచలమైన సేవాభావంతో వాటిని అధిగమించి సంస్థను ముందుకు నడిపించారని ఆయన ప్రశంసించారు. “ ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ విద్యాసంస్థ తన ప్రస్థానాన్ని నిరంతరం కొనసాగించింది” అని శ్రీ మోదీ అన్నారు.
నిరాడంబరంగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థ కాలక్రమేణా భారీ విద్యా ఉద్యమంగా విస్తరించిన తీరును ప్రధానమంత్రి ప్రశంసించారు. దశాబ్దాలుగా సాగిన ఈ ప్రస్థానంలో సంస్థ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించిందని పేర్కొన్నారు. “నేడు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో మీకు 15 విద్యాసంస్థలు ఉన్నాయి” అని శ్రీ మోదీ తెలిపారు.
ఈ విద్యాసంస్థకు పునాదులు వేసిన ప్రముఖుల సేవలను గుర్తు చేస్తూ, పాఠశాల భవన నిర్మాణంలో శ్రీ జైగోపాల్ గరోడియా ఎనలేని సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. హిందూ విద్యాలయ విజయవంతమైన ప్రస్థానం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “యాభై ఏళ్ల అంకితభావం.. యాభై ఏళ్ల నిబద్ధత.. యాభై ఏళ్లుగా యువత జీవితాలను తీర్చిదిద్దుతున్న ప్రస్థానం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
విద్యాబోధనతో పాటు బలమైన దేశభక్తి విలువలను కూడా ఈ విద్యాసంస్థ విద్యార్థుల్లో పెంపొందిస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశ సైనికుల కోసం ప్రతిరోజూ కేవలం ఒక రూపాయి చొప్పున పొదుపు చేసేలా పిల్లలను అద్భుతంగా ప్రోత్సహించిన గిరిజా అమ్మ గురించి తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. వేలాది మంది పిల్లలు ఈ సంకల్పంలో భాగస్వాములై, సమష్టిగా రూ.40 లక్షలు సమీకరించడం విశేషమని ప్రశంసించారు. “నిజంగా, ఎంతటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ!” అని శ్రీ మోదీ కొనియాడారు.
చిన్నచిన్న ప్రయత్నాలు సమాజంపై ఎంతో గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపగలవని ప్రధానమంత్రి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆపన్నులకు అండగా నిలవడం, పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా విలువలతో కూడిన గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తున్న హిందూ విద్యాలయ కుటుంబాన్ని ఆయన ప్రశంసించారు. “ఒక చిన్న ప్రయత్నం కూడా ఎంతో గొప్ప ప్రభావాన్ని సృష్టించగలదు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రాచీన జ్ఞాన సంపద గురించి ప్రస్తావిస్తూ, ప్రముఖ సంతు తిరువళ్ళువర్‌కు ప్రధానమంత్రి ఘనంగా నివాళులర్పించారు. నేటి విద్యార్థులకు కూడా ఆయన బోధనలు ఎంతో అర్థవంతమైనవని, వాటికి ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసినప్పుడు, తిరుక్కురళ్ గ్రంథం రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు అందించడం గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. “విద్యార్థులైన మీ అందరికీ ఆయన బోధనలు ఎంతో ముఖ్యమైనవి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
తిరుక్కురళ్‌లోని శాశ్వత జీవన సందేశాలను వివరిస్తూ, జీవితాంతం కొత్త విషయాలను నేర్చుకోవాలనుకునే వారందరికీ ఈ గ్రంథం ఒక అద్భుతమైన మార్గదర్శి అని ప్రధానమంత్రి ప్రశంసించారు. తిరువళ్ళువర్ రచించిన ప్రసిద్ధ కురళ్లలో ఒకటి - నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో ఆచరించడం ఎంతైనా అవసరమని బోధిస్తుందని - ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఈ ముఖ్యమైన సందేశాన్ని జీవితంలో అనుసరించాలని సూచించారు.
దేశాన్ని ఏకం చేసే ప్రగాఢమైన సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ, మహాకవి భారతీయార్ కాశీలో అనుభవించిన ఆధ్యాత్మిక, జాతీయ చైతన్యంతో ఎంతో ప్రభావితమయ్యారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతీయార్ విశాలమైన జీవితం, తత్వచింతనను విద్యార్థులు చదివి, వాటి నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. “ఆధ్యాత్మిక, జాతీయ చైతన్యంతో నిండిన కాశీ వాతావరణం ఆయన ఆలోచనలపై గాఢమైన ప్రభావం చూపింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీని ఈ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానిస్తూ, మహాకవి భారతీయార్‌ను కాశీ ప్రజలు నేటికీ ఎంతో ఆప్యాయంగా స్మరించుకుంటున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కవి ప్రసిద్ధ నినాదమైన ‘అచ్చమిల్లై, అచ్చమిల్లై’ (భయం లేదు.. భయం లేదు) అనే సందేశాన్ని యువత తమ జీవితాల్లో ఆచరించాలని, తమ ఆలోచనలు, కలలను సాకారం చేసుకునే దిశగా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. “ఉన్నతమైన కలలు కనండి.. విభిన్నంగా ఆలోచించండి.. నిర్భయంగా ముందుకు సాగండి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
తన జీవితానుభవాలను గుర్తుచేసుకుంటూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం, ఆయా ప్రాంతాల ప్రజలతో నేరుగా మమేకమై వారి నుంచి నేర్చుకోవడం ద్వారా భారతదేశంపై తనకు సమగ్రమైన అవగాహన ఏర్పడిందని ప్రధానమంత్రి వివరించారు. 1990వ దశకం ప్రారంభంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన ఏక్తా యాత్రలో పాల్గొన్న సందర్భాన్ని ఆయన స్మరించుకున్నారు. ఆ యాత్రలోనే గిరిజా అమ్మతో తనకు తొలిసారిగా పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు.“అప్పటి నుంచి మా పరిచయం, అనుబంధం కొనసాగుతూనే ఉన్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.
తమిళనాడు రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా తాను చేసిన విస్తృత పర్యటనలు భారతదేశంలోని అపారమైన వైవిధ్యాన్ని దగ్గరగా అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “తమిళ భాషపట్ల, తమిళ సంస్కృతిపట్ల నా జీవితంలో ఉన్న ప్రేమ కూడా ఈ అనుభవాల నుంచే పుట్టుకొచ్చింది” అని శ్రీ మోదీ తెలియచేశారు.
జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో క్రియాశీలక భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిస్తూ, యువత దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని, తాము ఎక్కడికి వెళ్లినా తమిళ సంస్కృతిని గర్వంగా చాటిచెప్పాలని ప్రధానమంత్రి సూచించారు. తమిళ కవిత్వం, కథలు, సంప్రదాయాలను ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయం చేయడంతో పాటు, విభిన్న నేపథ్యాలకు చెందిన వారితో స్నేహసంబంధాలను పెంపొందించుకోవాలని ఆయన హితవు పలికారు. ఇటువంటి స్నేహబంధాలే దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. “మీరు ఏర్పరచుకునే స్నేహబంధాలే మన దేశ ఐక్యతకు పునాది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
దేశ విద్యారంగంలో అసాధారణ స్థాయిలో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులను వివరిస్తూ, నేటి యువతకు అందుబాటులో ఉన్న విద్యావకాశాలు గణనీయంగా విస్తరించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014లో దేశంలో 750 విశ్వవిద్యాలయాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,300 దాటిందని తెలిపారు. ఇదే సమయంలో కళాశాలల సంఖ్య 38,000 నుంచి 52,000కు పైగా పెరిగిందని వెల్లడించారు. వీటితో పాటు అనేక కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, ఎయిమ్స్ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయని వివరించారు. “నేడు దేశంలో విద్యారంగం సమగ్రంగా మార్పు చెందుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కొత్త విద్యా విధానం ద్వారా విద్యారంగంలో చోటుచేసుకుంటున్న నాణ్యతాపరమైన ప్రమాణాలను ప్రస్తావిస్తూ, భారతీయ విద్యాసంస్థలకు అంతర్జాతీయంగా గుర్తింపు వేగంగా పెరుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య 2015లో కేవలం 14 ఉండగా, తాజా ర్యాంకింగ్స్‌లో ఆ సంఖ్య 52కు పెరిగిందని వివరించారు. దీనివల్ల విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని సంస్థలు, విస్తృతమైన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. “మరిన్ని విద్యాసంస్థలు.. మరిన్ని ఎంపికలు.. మీకు మరిన్ని అవకాశాలు” అని శ్రీ మోదీ అన్నారు.
యువతలోని విభిన్న ఆకాంక్షలను ప్రస్తావిస్తూ, చాలామంది విద్యార్థులు సంప్రదాయబద్ధమైన వృత్తులకు భిన్నంగా, ముఖ్యంగా క్రీడారంగంలో తమ కెరీర్‌ను ఎంచుకోవాలని ఆసక్తి చూపుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా, ఒక వృత్తిగా ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు దేశంలో నూతన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, మెరుగైన శిక్షణతో పాటు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ చర్యల ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ కూడా పెరుగుతోందని తెలిపారు. “యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, మరింత సహకారం లభిస్తున్నాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దేశ క్రీడారంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను వివరిస్తూ, 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పెద్దఎత్తున సన్నద్ధమవుతోందని ప్రధానమంత్రి ప్రకటించారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే మహత్తర స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా కూడా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు భారత్ వేదిక కానున్న నేపథ్యంలో యువత తమ ప్రతిభను చాటుకునేందుకు అత్యుత్తమ వేదిక, అపారమైన సామర్థ్యం, ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “అవకాశాలకు అంతులేదు. క్రీడారంగంలోనూ మీ తరం భారత్‌ను ప్రపంచంలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
యువత శక్తియుక్తులపై తనకున్న అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, విద్యార్థులతో మమేకమై, వారి ఉత్సాహభరితమైన కలలను తెలుసుకోవడం వల్ల దేశ ఉజ్వల భవిష్యత్తుపై తన నమ్మకం మరింత బలపడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలాన్ని తీర్చిదిద్ది, దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అసలైన కథానాయకులు యువతేనని ఆయన స్పష్టం చేశారు. “భారతదేశ భవిష్యత్తు అత్యంత ఉజ్వలంగా ఉండబోతోంది. ఆ భవిష్యత్తుకు అసలైన కథానాయకులు మీరే” అని శ్రీ మోదీ అన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలపై తనకున్న సంపూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామర్థ్యం ఉన్నాయని ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహత్తరమైన, చారిత్రాత్మకమైన జాతీయ సంకల్పాలను నెరవేర్చడంలో తనతో కలిసి ముందుకు సాగాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. “నేడు మీ అందరితో కలిసి కొన్ని గొప్ప సంకల్పాలను మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సభలో అత్యంత ఉత్సాహాన్ని నింపుతూ తన ప్రసంగాన్ని ముగించిన ప్రధాని... పలు బృహత్తర జాతీయ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉండేలా సభకు హాజరైన అపార జనసమూహంతో “మనం సాధిద్దాం!” (వి విల్ డూ ఇట్!) అంటూ నినాదం చేయించారు. 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించడం, ప్రపంచంలోని మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను నిలపడం, స్వయం సమృద్ధితో కూడిన ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా దేశాన్ని అభివృద్ధి చేయడం, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం, భారతీయుడిని చంద్రుడిపైకి పంపించడం వంటి మహత్తర జాతీయ లక్ష్యాల సాధన కోసం యువత అంకితభావంతో, దృఢ సంకల్పంతో కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2322093)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam