శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ ఆవిష్కరణల వాణిజ్యీకరణ వేగవంతం, 2047 నాటికి సంపూర్ణ స్వయం-సమృద్ధి సాధించడం లక్ష్యంగా

సామర్థ్యాలను పెంపొందించుకోవాలని పరిశ్రమ వర్గాలకు డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు

శాస్త్రీయ పరిశోధనను వాణిజ్య సంస్థలుగా, ప్రపంచంతో పోటీపడగల సాంకేతికతలుగా మార్చేందుకు పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి పిలుపు

ఎనిమిదేళ్ల లక్ష్యమైన 2,000 కిలోమీటర్లలో... 1,000 కిలోమీటర్ల క్వాంటం-సురక్షిత సమాచార వ్యవస్థను సాధించిన భారత్

195 బిలియన్ డాలర్లు దాటిన భారత బయోఎకానమీ విలువ

2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరడం లక్ష్యం

పీహెచ్‌డీసీసీఐ 121వ వార్షిక సమావేశంలో భారత సాంకేతిక ఆశయాల సాకారం కోసం ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య బలమైన సమన్వయం అవసరమన్న కేంద్ర మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 4:04PM by PIB Hyderabad

జాతీయ లక్ష్యాలను 2047 నాటికల్లా  సాధించి, దేశ వ్యూహాత్మక స్వయం-సమృద్ధిని పటిష్ఠం చేయడం కోసం భారతీయ పరిశ్రమలు ముందుకు రావాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్ శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో సరికొత్త ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ, శాస్త్రీయ పరిశోధనలను లాభదాయక వ్యాపారాలుగా మార్చాలని, భారత సాంకేతిక సామర్థ్యాలను భారీగా పెంచాలని ఆయన స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) 121వ వార్షిక సదస్సునుద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. భారత శాస్త్రీయ నైపుణ్యాలను స్వదేశీ సాంకేతికతలుగా, లాభదాయకమైన వ్యాపారాలుగా, ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలుగా మార్చడం కోసం... ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, అంకురసంస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. భారత వృద్ధి, ఆవిష్కరణల ప్రాధాన్యతలపై చర్చించేందుకు పరిశ్రమ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర వాటాదారులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

భారత సాంకేతిక వృద్ధి తదుపరి దశ కేవలం ఇతర దేశాలు అభివృద్ధి చేసిన సాంకేతికతలను అనుకరించడం లేదా వాడుకోవడంతో ముగిసిపోకూడదనీ... ప్రపంచానికి ఉపయోగపడేలా మన సొంత పరిష్కారాలను సృష్టించే దిశగా ముందుకు సాగాలని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పాలసీ సంస్కరణల తర్వాత అంతరిక్ష రంగం విస్తరణ, వ్యూహాత్మక సాంకేతిక రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయ సామర్థ్యాలకు ప్రభుత్వ అనుకూల విధానాలు, పారిశ్రామికవేత్తల చొరవ తోడైనప్పుడు అద్భుతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈ మార్పు నిరూపిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.

జాతీయ క్వాంటం మిషన్ కింద సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ... 2,000 కిలోమీటర్ల క్వాంటం-సురక్షిత కమ్యూనికేషన్‌ను సాధించాలనే ఎనిమిదేళ్ల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని, మూడేళ్లలోనే 1,000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. క్వాంటం కమ్యూనికేషన్ వ్యూహాత్మక, భద్రతా ప్రాముఖ్యతను... అత్యాధునిక సాంకేతికతల్లో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

2014లో సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత బయోఎకానమీ విలువ... ప్రస్తుతం 196 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. బయోటెక్నాలజీ అంకురసంస్థల రంగం సాధించిన అద్భుతమైన విస్తరణే దీనికి నిదర్శనమన్నారు. ఇది లైఫ్ సైన్సెస్, అధునాతన పరిశోధనల్లో సరికొత్త అవకాశాలను సృష్టిస్తోందని ఆయన వివరించారు. ఈ ప్రగతి ద్వారా కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, దేశీయ సామర్థ్యాలు పటిష్ఠమవుతాయని, దేశానికి మరింత ఆర్థిక విలువ చేకూరుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభమయ్యే తొలి దశ నుంచే పరిశ్రమల భాగస్వామ్యం ఉండాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడం, అవసరమైన సాంకేతికతలను గుర్తించడం, వాణిజ్యపరంగా మార్కెట్లోకి సులభంగా విడుదల చేయగల పరిష్కారాలను అభివృద్ధి చేయడం శాస్త్రవేత్తలకు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాబొరేటరీల్లో జరిగే కొత్త ఆవిష్కరణలను నమూనాలుగా, మార్కెట్‌కు అనుకూలమైన ఉత్పత్తులుగా మార్చడంలో... పరిశోధకులను వ్యాపారవేత్తలతో అనుసంధానించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, బలమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో పీహెచ్‌డీసీసీఐ వంటి పారిశ్రామిక సంస్థలు కీలక పాత్ర పోషించగలవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్‌డీఐ) కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ... శాస్త్రీయ ఆవిష్కరణలను వేగంగా వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడానికి పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం మరింతగా పెరగడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పరిశోధనల ఆధారంగా జరిగే సరికొత్త ఆవిష్కరణల్లో పరిశ్రమలు మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ప్రోత్సహించారు. శాస్త్రీయ నైపుణ్యాలు స్థిరమైన వ్యాపారాలుగా, ప్రపంచస్థాయి ఉత్పత్తులుగా మారేలా ఒక బలమైన వ్యవస్థను నిర్మించడంలో పరిశ్రమలు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

కృత్రిమ మేధ, డేటా మౌలిక సదుపాయాలు, అధునాతన తయారీ రంగాల్లో భారత్ ఆశయాలను నెరవేర్చడానికి స్వదేశీ సాంకేతికతలు, నమ్మకమైన ఇంధన సరఫరా ఎంతో కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వ్యూహాత్మక, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతిక రంగాల్లో సొంత సామర్థ్యాలను పెంపొందించుకోవడంతో పాటు... పరిశ్రమలకు, శాస్త్రీయ పరిశోధన సంస్థలకు మధ్య బలమైన భాగస్వామ్య ఏర్పాటు భారత సాంకేతిక స్వయంసమృద్ధిని, వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని పటిష్ఠం చేయడం కోసం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

నూతన ఆలోచనలను వేగవంతమైన అమలుతో, విజయవంతమైన ఆవిష్కరణలను విస్తరించే సామర్థ్యంతో అనుసంధానించడంపైనే భారత తదుపరి ముందడుగు ఆధారపడి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, అంకురసంస్థల మధ్య బలమైన భాగస్వామ్యాలు... వాణిజ్యీకరణను వేగవంతం చేయడానికి, దేశ ఆవిష్కరణల పునాదిని విస్తరించడానికి, 2047 నాటికి భారత ఆశయాలను సాకారం చేసుకోవడం కోసం అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయని ఆయన తెలిపారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2321967) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil