ఆయుష్
azadi ka amrit mahotsav

శాస్త్రీయ ఆధారాలు, నాణ్యతా ప్రమాణాలతో సంప్రదాయ వైద్యం ప్రపంచవ్యాప్తంగా ముందస్తు ఆరోగ్య సంరక్షణ, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది: కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఇండో–యూకే హెల్త్ కాన్‌క్లేవ్ 2026ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. ఆయుష్ వైద్య నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి స్వాగతం

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 6:06PM by PIB Hyderabad

సంప్రదాయ వైద్య విధానాల ప్రాముఖ్యతను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ వివరించారు. శాస్త్రీయ పరిశోధనలు, తగిన వైద్య ఆధారాలు, నాణ్యతా ప్రమాణాలు, బాధ్యతాయుతమైన సమన్వయంతో సంప్రదాయ వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా ముందస్తు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి గణనీయంగా దోహదపడగలవని ఆయన అన్నారు.

మారెంగో ఆసియా హాస్పిటల్స్, బాపియో శిక్షణ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఇండో–యూకే హెల్త్ కాన్‌క్లేవ్ 2026 (భారత్‌-బ్రిటన్‌ ఆరోగ్య సదస్సు) రెండో విడతను శ్రీ ప్రతాపరావు జాదవ్ నూఢిల్లీలో ప్రారంభించారు. “ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆవిష్కరణల మధ్య అనుసంధానం” అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. ఇందులో భారత్, బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఆయుష్ వైద్య నిపుణుల కోసం క్రమబద్ధమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని శ్రీ జాదవ్ స్వాగతించారు. శాస్త్రీయ పరిశోధనలు, తగిన వైద్య ఆధారాలు, నాణ్యతా ప్రమాణాలు, బాధ్యతాయుతమైన సమన్వయం ద్వారా సంప్రదాయ వైద్య విధానాలు నివారణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో, ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించగలవని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య విద్యలో పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం ఆరు నెలల వ్యవధి కలిగిన రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. అవి అత్యవసర వైద్య సంరక్షణ, ఎమర్జెన్సీ సహాయక సేవల్లో సర్టిఫికెట్ కోర్సు , జీవనశైలి ఆరోగ్యం, సంపూర్ణ సంక్షేమంపై కౌన్సెలింగ్, ఆచరణలో సర్టిఫికెట్ కోర్సు. క్రమబద్ధమైన బోధన, పర్యవేక్షణలో ప్రాక్టికల్ శిక్షణ ద్వారా వైద్య సహాయక నైపుణ్యాలను, నివారణ ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ కోర్సుల ప్రధాన లక్ష్యం.

భారత్, బ్రిటన్‌లకు ఉన్న పరస్పర పూరకమైన ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ.. వైద్య సేవల నిర్వహణ, రోగుల భద్రత, నాణ్యతా ప్రమాణాల అమలులో బ్రిటన్‌కు ఉన్న అనుభవం.. భారతదేశ వైద్య నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య సేవలందించే సామర్థ్యాలతో కలిస్తే మరింత సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

ఈ సదస్సును నిర్వహించిన సంస్థలను, ఇందులో పాల్గొన్న సంస్థల ప్రతినిధులను శ్రీ జాదవ్ అభినందించారు. ఇక్కడ జరిగే చర్చలు ఇరు దేశాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే దీర్ఘకాలిక భాగస్వామ్యాలుగా, ఆచరణాత్మక ఫలితాలుగా మారుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ సదస్సు ద్వారా భారత్, బ్రిటన్‌ల మధ్య సంస్థాగత సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పరస్పర జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవల అందింపులో ఆవిష్కరణలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2321635) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati