రక్షణ మంత్రిత్వ శాఖ
సిడ్మ్ ఛాంపియన్ అవార్డులు (2026) ప్రదానం చేసిన రక్షణ మంత్రి.. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, పరిశోధన - అభివృద్ధి పెట్టుబడులు, రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు పిలుపు
మన రక్షణ దళాలకు అవసరమైన సాంకేతికత, పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, నియంత్రణ సామర్థ్యాలపైనే జాతీయ భద్రత ఆధారపడి ఉంది: రాజ్‌నాథ్ సింగ్
చారిత్రాత్మక మైలురాయిగా 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో రూ.38,424 కోట్లకు చేరిన భారత రక్షణ ఎగుమతులు - గత ఏడాదితో పోలిస్తే 60 శాతానికి పైగా వృద్ధి: రక్షణ మంత్రి
రక్షణ రంగ తయారీదారులు పరిశోధన - అభివృద్ధి పై చేసే వ్యయాన్ని కార్యచరణ సన్నద్ధతను బలోపేతం చేసే, పోటీతత్వాన్ని పెంచే, జాతీయ భద్రతకు తోడ్పడే పెట్టుబడిగా పరిగణించాలి: రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 7:23PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు (అక్టోబర్ 9, 2026) జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐడీఎం-సిడ్మ్) ఎనిమిదో వార్షిక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2026 సంవత్సరానికి సిడ్మ్ ఛాంపియన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఛాంపియన్ అవార్డులను అందజేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఉత్పత్తుల ఆవిష్కరణ, రూపకల్పన, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తుల తయారీ, తయారీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ, ఎగుమతుల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా వివిధ సంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు, రూపకల్పన సామర్థ్యాల పెంపు, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ, ఎగుమతుల వృద్ధికి విశేష కృషి చేసిన అవార్డు గ్రహీతలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
‘స్వయంసమృద్ధి సామర్థ్యాలు – సవాళ్లతో కూడిన సరిహద్దులు: అనిశ్చితుల నడుమ భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వేగవంతం చేయడం’ అనే వార్షిక సమావేశ ఇతివృత్త ప్రాధాన్యాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. మన రక్షణ దళాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, నియంత్రణ సామర్థ్యాలపైనే జాతీయ భద్రత అంతకంతకూ ఆధారపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని ప్రతిభావంతులు, యువ శ్రామికశక్తి, పారిశ్రామిక సామర్థ్యాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతు దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి రక్షణ ఉత్పత్తుల తయారీ దేశాల వరసన నిలబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశీయ రక్షణ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ విధాన రూపకర్తలు, పరిశ్రమల మధ్య చర్చలకు వేదిక కల్పించడంలో సిడ్మ్ పోషిస్తున్న పాత్రను రక్షణ మంత్రి ప్రశంసించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని, పరిశోధన - అభివృద్ధిపై పెట్టుబడులను విస్తరించాలని, అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచే ఏర్పాట్లు చేయాలని, సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేయాలని ఆయన భారత రక్షణ పరిశ్రమలకు పిలుపునిచ్చారు. తద్వారా రక్షణ రంగంలో భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, స్వావలంబనను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
రక్షణ పరికరాల దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశం స్థాయి నుంచి, అత్యాధునిక సైనిక పరికరాలను విశ్వసనీయంగా ఎగుమతి చేసే దేశంగా భారత్ మార్పు చెందడం గణనీయమైన విజయమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60 శాతానికి పైగా వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రైవేటు రంగ భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, భారత రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగం వాటాను ప్రస్తుతమున్న సుమారు 24 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని గతంలో తాను ఇచ్చిన పిలుపును రక్షణ మంత్రి గుర్తుచేశారు. గత 12 ఏళ్లలో రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఈ జాతీయ లక్ష్య సాధనకు పరిశ్రమల ప్రముఖులు ప్రగతిశీల లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నియంత్రణ, భద్రత, నాణ్యత, జవాబుదారీతనానికి సంబంధించిన ప్రమాణాలను పాటిస్తూనే, ప్రైవేటు రంగం అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
యుద్ధ స్వరూపం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ, ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. “రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి కోసం చేసే వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలి. ఇది సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడంతోపాటు, పోటీతత్వాన్ని పెంచి, జాతీయ భద్రతకు దోహదపడుతుంది” అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, అవసరమైనప్పుడు దేశీయ తయారీ కేంద్రాలు ఉత్పత్తిని వేగంగా పెంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు, మారుతున్న సైనిక అవసరాలకు తక్షణమే స్పందించేందుకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని పరిశ్రమలకు పిలుపునిచ్చారు.
2017లో ఏర్పాటైన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) పెద్ద సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహించే సమగ్ర వేదికగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్, డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్, స్వదేశీకరణకు సంబంధించిన పాజిటివ్ లిస్టులు, సృజన్ పోర్టల్, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) వంటి విధానపరమైన సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. భారత ప్రైవేటు రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను విస్తరించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్) ఎ. అన్‌బరసు, ఎస్ఐడీఎం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబా కల్యాణి, ఎస్ఐడీఎం అధ్యక్షుడు అరుణ్ రామ్‌చందాని, ఉన్నతాధికారులు, రక్షణ దళాల ప్రతినిధులు, భారత, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులు హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2321632)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4