శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీఎస్టీ, శాస్త్ర - సాంకేతిక మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్... సైన్స్‌ను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యం

· ‘ప్రజలే ప్రథమం’ దృక్పథాన్ని సాకారం చేస్తూ బహుభాషల్లో వెబ్‌సైట్లు

· కొత్తగా పునరాభివృద్ధి చేయబడిన పోర్టల్‌లు,

· ‘ప్రజలే ప్రథమ గణ్యులుగా పాలన’ అనే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు, ‘ప్రజల చేత, ప్రజల కోసం విజ్ఞానం’ అనే సూత్రానికి ఇవి నిదర్శనం

· పరిశోధన గ్రాంట్లు, ఫెలోషిప్‌లు, వైజ్ఞానిక పథకాలు, విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, పౌరులకు అవకాశాల సమగ్ర వేదికగా తాజా వెబ్‌సైట్లు

· డీబీఐఎం 3.0కు అనుగుణంగా పోర్టళ్లు... 22 భాషల్లో అందుబాటులో: సార్వత్రిక వినియోగ సాధనాలు, వివిధ పరికరాల్లో నిరంతరాయంగా వినియోగానుభవం

· బ్రాండింగ్, లభ్యత, భద్రత, ప్రజలే కేంద్రంగా సేవల పంపిణీ కోసం ఉమ్మడి ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ డిజిటల్ వేదికల పునర్నిర్మాణం

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 4:55PM by PIB Hyderabad

శాస్త్రీయ సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సులభంగా అందుబాటులోకి తెచ్చేలా శాస్త్ర సాంకేతిక విభాగం ఈ రోజు సరికొత్తగా ప్రారంభించిన వెబ్‌సైట్లు.. విజ్ఞానాన్ని సమ్మిళితంగాను, ఉపయోగకరంగాను నిలపాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు నిదర్శనమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘పౌరుడే ప్రథమం’ అనే సుపరిపాలన దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.

 

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. సైన్స్ సమాచారం అందరికీ లభ్యమయ్యేలా, సులభంగా అందుబాటులోకి వచ్చేలా, తక్కువ వ్యయంతో ఉండేలా చూడడం లక్ష్యంగా ‘ప్రజల చేత, ప్రజల కోసం సైన్స్’ అనే మార్గదర్శక సూత్రంతో దీనిని రూపొందించామని తెలిపారు. వివిధ శాస్త్రీయ విభాగాలు, పరిశ్రమల మధ్య సాంకేతికతల అనుసంధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకే ఉమ్మడి డిజిటల్ వేదిక ద్వారా వినియోగదారులు తమ అవసరాలకు తగిన విధంగా సమాచారాన్ని, అవకాశాలను గుర్తించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

 

డిజిటల్ బ్రాండ్ ఐడెంటిటీ మాన్యువల్ (డీబీఐఎం) 3.0, భారత ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌ల మార్గదర్శకాలు (జీఐజీడబ్ల్యూ) 3.0 ప్రకారం పునర్నిర్మించిన డీఎస్టీ అధికారిక వెబ్‌సైట్లు www.dst.gov.in, www.most.gov.inలను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేశ్ వి. వాఘ్మారే, డీఎస్టీ ఉన్నతాధికారులు, వెబ్‌సైట్ అభివృద్ధి బృంద ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత శాఖ అంతర్గత విభాగాల ద్వారా వివరాలను సేకరించి, ధ్రువీకరించిన అనంతరం... డీఎస్టీ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), ప్రాజెక్ట్ నిర్వహణ బృందం, అభివృద్ధి ఏజెన్సీలు సంయుక్తంగా ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేశాయి.

డీఎస్టీ పథకాలు, గ్రాంట్లు, ఫెలోషిప్‌లు, శాస్త్రీయ కార్యక్రమాలు, ఇతర అవకాశాలకు సంబంధించి ఏకీకృత సమాచారాన్ని అందిస్తూ.. విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోలు, పరిశోధకులు, విద్యా సంస్థలు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు, సామాన్య పౌరులకు ఈ డిజిటల్ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగా పునర్నిర్మించిన సమాచార వ్యవస్థ ద్వారా అర్హత నిబంధనలు, దరఖాస్తు మార్గదర్శకాలు, నిధుల కోసం ఆహ్వానాలు, పురస్కారాలు, ఫలితాలు, అధికారిక ప్రకటనల వంటి వివరాలను వినియోగదారులు అత్యంత వేగంగా గుర్తించవచ్చు. ఈ సమాచార వనరులన్నింటినీ ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఒక్కచోట చేర్చడం ద్వారా.. ప్రభుత్వ ప్రకటనల నిర్వహణను సులభతరం చేయడమే కాకుండా, దేశ శాస్త్ర సాంకేతిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ పోర్టళ్ల ముఖ్య లక్ష్యమని శ్రీ జితేంద్ర సింగ్ వివరించారు.

 

ఈ వెబ్‌సైట్లలో సంస్థ వివరాలు, విభాగాలు, కార్యక్రమాలు-పథకాలు, సేవలు, అవకాశాలు, పత్రాలు, వార్తలు - తాజా సమాచారం వంటి ప్రధాన విభాగాలతో కూడిన ప్రామాణీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. సులభమైన శోధన వ్యవస్థ ద్వారా పరిశోధన - అభివృద్ధి నిధులు, ప్రతిపాదనల ఆహ్వానాలు, పురస్కారాలు, దరఖాస్తు ఫారాల వివరాలను వేగంగా కనుగొనవచ్చు. అలాగే వివిధ పత్రాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండే కేంద్రీకృత విభాగం ద్వారా మార్గదర్శకాలు, విధాన పత్రాలు, అధికారిక ప్రకటనలు, నివేదికలు, పరిపాలన దరఖాస్తులను సులభంగా పొందవచ్చు.

 

శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థాగత నిర్మాణ క్రమం, అధికారుల సంప్రదింపు వివరాలను వర్గీకరించి అందుబాటులో ఉంచడం ద్వారా సంబంధిత సమాచారాన్ని సులభంగా పొందేందుకు వీలు ఏర్పడింది. అలాగే అంతర్జాతీయ భాగస్వాముల కోసం ద్వైపాక్షిక, బహుపాక్షిక శాస్త్ర సాంకేతిక సహకారాలకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని కూడా ఈ వేదికలో పొందుపరిచారు.

 

ఈ కొత్త వెబ్‌సైట్ల మరో ముఖ్యమైన అంశం ‘భాషిణి’ వేదికను అనుసంధానించడం. దీని ద్వారా శాస్త్రీయ సమాచారాన్ని 22 భారతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తూ, విస్తృత శ్రేణి ప్రజలకు సమాచారం చేరువయ్యేలా చేశారు. అలాగే అందరికీ సులభంగా ఉపయోగపడేలా అక్షరాల పరిమాణాన్ని మార్చుకునే వెసులుబాటు, హై-కాంట్రాస్ట్ డిస్‌ప్లే మోడ్, లింక్‌లను ప్రత్యేకంగా చూపించే సదుపాయం, అక్షరాలు, లైన్ల మధ్య దూరాన్ని సరిచేసే ఆప్షన్లు, స్క్రీన్-రీడర్ సాంకేతికతకు తగిన అనుకూలత వంటి ప్రత్యేక సౌకర్యాలను కూడా ఈ పోర్టళ్లలో పొందుపరిచారు.

 

అన్ని రకాల స్క్రీన్ పరిమాణాలకు అనుకూలంగా ఉండే రెస్పాన్సివ్ డిజైన్‌తో ఈ వెబ్‌సైట్లను రూపొందించడం వల్ల డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్‌లలో కూడా చదవడానికి సులభంగా, స్పష్టంగా ఉంటాయి. వివిధ వర్గాల విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, ప్రజలకు ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా, వేగంగా అందుబాటులోకి తేవడం ఈ సదుపాయాల ముఖ్య ఉద్దేశం.

 

2025 మార్చిలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ విడుదల చేసిన డీబీఐఎం 3.0 ఆధారంగా ఈ పునర్నిర్మాణ ప్రక్రియ రూపుదిద్దుకుంది. ఈ మాన్యువల్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల రూపకల్పన, సమాచార నిర్మాణం, వివరాల సమర్పణ, మొత్తం డిజిటల్ నిర్వహణలో ఒక ఉమ్మడి ప్రమాణాన్ని అందిస్తుంది. దీనికి అనుబంధంగా జీఐజీడబ్ల్యూ 3.0 మార్గదర్శకాలు.. వెబ్‌సైట్ల నాణ్యత, అందరికీ అందుబాటులో ఉండే సదుపాయాలు, సైబర్ భద్రత, వినియోగ సౌలభ్యం, లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తాయి.

 

ఈ డిజిటల్ పునర్నిర్మాణం భారత ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ప్రణాళికలో ఒక భాగం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వెబ్‌సైట్ల గుర్తింపు, నావిగేషన్, సమాచార నిర్వహణలో ఏకరూపతను తీసుకొస్తూ.. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తేవడం దీని ముఖ్య లక్ష్యం. అందువల్ల ఈ మార్పు కేవలం వెబ్‌సైట్ రూపకల్పనకు మాత్రమే పరిమితం కాకుండా.. సమాచార పునర్నిర్మాణం, మెరుగైన వినియోగదారు అనుభవం, సమర్థమైన డిజిటల్ సమాచార నిర్వహణ వ్యవస్థల రూపకల్పన వరకు విస్తరించింది.

సులభంగా మార్పులు చేసుకోగలిగే 'మాడ్యులర్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్'తో రూపుదిద్దుకున్నాయి. ఇది సమాచారాన్ని నిరంతరం అప్‌డేట్ చేయడమే కాకుండా, భవిష్యత్తు విస్తరణకు, ఇతర బాహ్య శాస్త్ర సాంకేతిక అప్లికేషన్లతో అనుసంధానానికి ఎంతగానో తోడ్పడుతుంది. భద్రతా చర్యల విషయానికొస్తే.. ఎస్ఎస్ఎల్/టీఎల్ఎస్ ఎన్‌క్రిప్షన్, సైబర్ భద్రతా తనిఖీలు, సీఈఆర్‌టీ-ఐఎన్ మార్గదర్శకాలను సమర్థంగా అమలు చేశారు. కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్) అనుసంధానం ద్వారా వెబ్‌సైట్‌లు అత్యంత వేగంగా లోడ్ అవ్వడమే కాకుండా.. పథకాల ఫలితాల ప్రకటనలు లేదా దరఖాస్తు ముగింపు తేదీల వంటి రద్దీ సమయాల్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా స్థిరంగా పనిచేస్తాయి. పునర్నిర్మించిన ‘వార్తలు - తాజా సమాచారం’ విభాగం పత్రికా ప్రకటనలు, ప్రతిపాదనల ఆహ్వానాలు, ఫలితాలు, అధికారిక సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెస్తూ.. వినియోగదారులు శాస్త్రీయ అవకాశాలను సులభంగా పొందేందుకు ఉపకరిస్తుంది.

 

మెరుగైన సమాచార శోధన, వివిధ భాషల్లో అందుబాటులో ఉండడం, అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యాలు, ప్రామాణిక డిజిటల్ వ్యవస్థ ద్వారా... ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచారంలో పారదర్శకతను పెంచడంతోపాటు, ప్రజలకు సులభమైన భాగస్వామ్యాన్ని కల్పించడమే ఈ పునర్నిర్మిత వెబ్‌సైట్ల ముఖ్య లక్ష్యం. వైజ్ఞానిక కార్యక్రమాలు, పరిశోధన అవకాశాలు, సాంకేతిక పరిణామాల్లో మరింత సులభంగా పాల్గొనేలా విద్యార్థులు, పరిశోధకులు, విద్యా సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రజలకు వీలు కల్పిస్తూ... మరింత విస్తృతమైన, ప్రజా కేంద్రిత డిజిటల్ వాతావరణాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.  

***


(రిలీజ్ ఐడి: 2321631) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi