కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీమాంతర టెలికాం మోసాలపై ‘ఐటీయూ’ సంయుక్త విచారణ ప్రతిపాదనకు భారత్‌ ఆమోదం

కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని వెల్లడి

· ‘ఏఎస్‌టీఆర్‌’ ద్వారా 82 లక్షలకు పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్ల తొలగింపు… 2.5 కోట్లకు పైగా సంచార్ సాథీ అనువర్తనం డౌన్‌లోడ్‌

· దేశవ్యాప్తంగా 15 నెలల్లో ₹5,000 కోట్లకు పైగా అనుమానిత నష్ట నిరోధానికి దోహదం చేసిన ఆర్థిక మోసం ముప్పు సూచీ

· మోసపూరిత కమ్యూనికేషన్ల బెడద నిరోధానికి సాంకేతికత.. నియంత్రణ.. ప్రపంచ సహకారం కీలకం: డాక్టర్ పెమ్మసాని స్పష్టీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 5:32PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ 100 కోట్లకు పైగా ప్రజలను అనుసంధానించిందని కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. ఈ అనుసంధానం విశ్వసనీయతతో కొనసాగేలా చూడటమే తదుపరి కర్తవ్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ ‘మోసపూరిత కమ్యూనికేషన్ల నిరోధానికి ‘ఐటీయూ’ ప్రమాణాల అమలు” అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 8న యశోభూమి వేదికగా ప్రారంభించి ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2026(ఐఎంసీ)లో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా- అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను స్పష్టం చేస్తూ- ‘మోసం అనేది ఒక నెట్‌వర్క్ సమస్య. కాబట్టి, ఆ నెట్‌వర్క్ ద్వారానే అది పరిష్కృతం కావాలి. అయితే, నెట్‌వర్కులు ప్రపంచవ్యాప్తం కనుక పరిష్కారాన్వేషణ కూడా అంతర్జాతీయంగానే ఉండాలి” అని డాక్టర్‌ శ్రీ పెమ్మసాని విశదీకరించారు. నకిలీ గుర్తింపు పత్రాలతో మోసాలు, డిజిటల్ అరెస్టు పేరిట కుంభకోణాలు, కృత్రిమ మేధ (ఏఐ)తో వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్‌ సృష్టి సహా వ్యవస్థీకృత, సీమాంతర మోసాల ముప్పు నానాటికీ పెరుగుతోందని ఆయన అప్రమత్తం చేశారు. ఇలాంటి మోసాల ఫలితంగా 2024లో భారతీయులు ₹22,800 కోట్లకు పైగా నష్టపోయారని గుర్తుచేశారు. ఈ బెడద నివారణకు ఎలాంటి చర్యలు అవసరమో గ్రహించిన ప్రభుత్వం నేడు అంచెలవారీ రక్షణ వ్యవస్థలను రూపొందించుకున్నదని తెలిపారు.

 

భారత్‌ అనుసరిస్తున్న ఈ అంచెలవారీ విధానాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇందులో “నకిలీ అంతర్జాతీయ కాల్స్‌ తక్షణ నిరోధం, సి-డాట్ (C-DOT) పరిధిలోని ఏఐ-ఆధారిత ‘ఏఎస్‌టీఆర్’ ఉపకరణంతో మోసపూరిత మొబైల్ కనెక్షన్ల గుర్తింపు, సంచార్ సాథీ ద్వారా పౌరుల భాగస్వామ్యం, డిజిటల్ ఇంటెలిజెన్స్ వేదిక (డీఐపీ) ద్వారా నిఘా సమాచార ఆదానప్రదానం, కొత్త మోసాల నివారణ చర్యలు” వంటి ఉన్నాయని డాక్టర్‌ పెమ్మసాని విశదీకరించారు.

వీటిలో ప్రధానంగా ‘ఏఎస్‌టీఆర్’ 82 లక్షలకు పైగా మోసపూరిత కనెక్షన్ల తొలగింపులో తోడ్పడగా, సంచార్ సాథీ అనువర్తనాన్ని సుమారు 2.5 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులు, చట్టాల అమలు వ్యవస్థలు సహా 1,600కు పైగా సంస్థలను ‘డీఐపీ’ అనుసంధానిస్తోంది. మరోవైపు 15 నెలల్లో ₹5,000 కోట్లకు పైగా అనుమానిత ఆర్థిక నష్టాల నివారణలో ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ దోహదం చేసింది.

 

సీమాంతర మోసాల నిరోధంలో జాతీయ పరిష్కారాల పరిమితులను అంగీకరిస్తూ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో కాలర్ గుర్తింపును డిజిటల్‌గా ధ్రువీకరించడంలో ‘ఐటీయూ’ప్రమాణాల ప్రాధాన్యాన్ని డాక్టర్ పెమ్మసాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, ఆపరేటర్లు, టెక్నాలజీ కంపెనీల భాగస్వామ్యంతో సంయుక్త ప్రయోగాలు నిర్వహించాలన్న ‘ఐటీయూ’ ప్రతిపాదనను స్వాగతిస్తూ, ఈ దిశగా సహకారానికి భారత్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

 

ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాన్వేషణకు సుముఖత తెలిపే దేశాల మధ్య ప్రయోగాలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. వివిధ నెట్‌వర్క్ టెక్నాలజీల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని, ‘ఐటీయూ’ ప్రమాణాల నిరంతర రూపకల్పనలో ఈ అనుభవ సారాన్ని జోడించాలని కోరారు. నేడు 6జీ నెట్‌వర్కుల రూపకల్పన నేపథ్యంలో ఆదినుంచే విశ్వసనీయతకు ప్రాముఖ్యమివ్వాలని మరింత స్పష్టం చేశారు.

 

చివరగా- మోసపూరిత సమాచార ఆదానప్రదాన నిరోధానికి సాంకేతిక, నియంత్రణ, సహకారం సమ్మిళితం కావాలని డాక్టర్ పెమ్మసాని చెప్పారు. “దేశీయంగా ప్రతిచర్యలకు బదులు నివారణకే భారత్‌ ప్రాధాన్యమిస్తోంది. ఇకపై ‘ఐటీయూ’తో సంయుక్తంగా జాతీయ పరిష్కారాల నుంచి అంతర్జాతీయ విశ్వసనీయత వైపు పయనిద్దాం” అని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2321552) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati