సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వ్యక్తిగత కానుకల నుంచి జాతీయ లక్ష్యం దిశగా: ప్రధాని జ్ఞాపికల ఇ-వేలంలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట కానుకలు
కొండపల్లి కొయ్య బొమ్మలు, కలంకారీ కళ మరియు జ్ఞాపికలతో కూడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 పిఎమ్ జ్ఞాపికలు పిఎమ్ జ్ఞాపికల ఇ-వేలంలో భాగమయ్యాయి
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 2:22PM by PIB Vijayawada
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని, కళాకారుల ప్రతిభను చాటిచెప్పే 18 విశిష్ట జ్ఞాపికలు ప్రస్తుతం ప్రధానమంత్రి వేలం కానుకల జాబితాలో మెరుస్తున్నాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్త్రాలు, వివిధ స్మారక బహుమతులతో కూడిన ఈ అరుదైన సేకరణ, ఇప్పుడు వేలం ద్వారా ఒక గొప్ప జాతీయ ప్రయోజనానికి ఉపయోగపడుతోంది.
ప్రధానమంత్రికి వివిధ సందర్భాల్లో అందిన ఈ జ్ఞాపికలను ఇప్పుడు 'పిఎం మెమెంటోస్' బహిరంగ ఇ-వేలం ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జీవన విధానానికి, చేతివృత్తుల నైపుణ్యానికి అద్దం పట్టే కొండపల్లి చెక్క ఎడ్ల బండి, ప్రధాని చిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కలంకారీ నేత, అలాగే శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అందించిన స్మారక జ్ఞాపికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కేవలం సంప్రదాయ కళలే కాకుండా, నేటి సమాజపు పురోగతిని తెలిపే కానుకలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మహిళల సాధనలను కొనియాడే 'స్త్రీ శక్తి ప్రతిభా అవార్డు-2025' జ్ఞాపికతో పాటు; వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమం, మౌలిక వసతుల రంగాన్ని చిత్రీకరించే 'గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా' అక్రిలిక్ పెయింటింగ్ రాష్ట్రాభివృద్ధి ఆకాంక్షలను చాటుతున్నాయి.
ఈ వేలం ద్వారా సేకరించిన నిధులను పవిత్ర గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనం కోసం చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమానికి మళ్లిస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని, సాంస్కృతిక ప్రాముఖ్యతను కాపాడుతూనే, మరోవైపు జాతీయ స్థాయి నదీ సంరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం లభిస్తోంది.
ఈ ఇ-వేలం గడువును 31 అక్టోబర్ 2026 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ 18 జ్ఞాపికలను వీక్షించి, వేలంలో పాల్గొనాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: 🔗 వెబ్‌సైట్: https://pmmementos.gov.in
*****
(రిలీజ్ ఐడి: 2321424)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9