నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నియమాధారిత సముద్ర రంగ వ్యవస్థ అవశ్యం
సాగరమంథన్ 3వ దఫా సంప్రదింపుల సమావేశానికి పిలుపునిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
అంతర్జాతీయ నిపుణుల సమావేశానికి ప్రపంచ అగ్రనేతలను స్వాగతించిన ప్రధానమంత్రి… ఓడరేవుల అభివృద్ధి-కొత్త సముద్రయాన చట్టాల ప్రస్తావన
ప్రాంతాలు-సముద్రాలంతటా విస్తరించిన భారత సముద్రరంగ దృక్కోణం సహకారం.. విశ్వాసం.. పరస్పర గౌరవం.. ప్రయోజన సహితం
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 7:18PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మూడో విడత ‘సాగరమంథన్: ది గ్రేట్ ఓషన్స్ డైలాగ్’ సదస్సు నేపథ్యంలో నిన్నటి కార్యక్రమానికి అంతర్జాతీయ అగ్రనేతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా గల విధాన రూపకర్తలు, సముద్ర రంగ అగ్రగాములు, నిపుణులు ఇందులో పాల్గొన్నారు. అన్ని దేశాల్లో శాంతి-సౌభాగ్యాగలకు తోడ్పడే “స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సురక్షిత, నియమాధారిత సముద్ర రంగ వ్యవస్థ” అవశ్యమని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
“అందరికీ మరింత ప్రగతి, శాంతి-సౌభాగ్యాలనిచ్చే స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సురక్షిత, నియమాధారిత సముద్ర వ్యవస్థ సాకారం కావాలన్నదే మా దృక్కోణం. ఈ బృహత్తర దార్శనికతను సాగరమంథన్ మరింత బలోపేతం చేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఓడరేవులు-నౌకాయానం-జల మార్గాల మంత్రిత్వశాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఆయనొక లిఖితపూర్వక సందేశం పంపారు.
ప్రపంచంలోని ఒక ప్రాంతంలో సంభవించే పరిణామాలు దాని తీరాల ఆవలగల సుదూర ప్రాంతాలనూ ప్రభావితం చేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు సముద్ర రంగంపై ప్రపంచవ్యాప్త సంప్రదింపులు, సహకారం మునుపటికన్నా ఇప్పుడు మరింత ప్రధానమన్నారు. “సముద్ర మథనం” అనే అర్థమిచ్చే ‘సాగరమంథన్’కు భారతీయ సంప్రదాయంలో ఒక ప్రత్యేక అర్థం ఉందని తెలిపారు. ఈ మథనం కొత్త అవకాశాల ఆవిష్కరణతో ముడిపడి ఉంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు, భూగోళానికి సముద్రాలు “అపార భరోసా” ఇస్తున్నాయని ఆయన అన్నారు.
“సముద్రంతో భారతదేశానికి గల సంబంధం కూడా బాధ్యతకు సంబంధించినదే. మనం బలమైన సముద్ర ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తూనే మన సముద్రాలు, తీరప్రాంత వ్యవస్థల ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. ప్రాంతాలు, సముద్ర రంగమంతటా విస్తరించిన భారత సముద్రరంగ భారత్ దృక్కోణం- సహకారం, విశ్వాసం, పరస్పర గౌరవం-ప్రయోజనాలపై ఆధారపడినది. సముద్రాలు సమష్టి సౌభాగ్యానికి మూలం కావాలని, ప్రతి దేశానికి తనదైన గళం వినిపించగల, అభివృద్ధి చెందగల అవకాశం లభించాలన్నది మా ప్రగాఢ ఆకాంక్ష” అని ప్రధానమంత్రి తన సందేశంలో స్పష్టం చేశారు.
ప్రాచీన రేవు పట్టణమైన లోథాల్ నుంచి చోళ రాజవంశం దాకా… మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నావికాదళ దార్శనికత వరకూ భారత సముద్రరంగ చరిత్ర విస్తరించిందని మోదీ వివరించారు. భారత నావికులు, వ్యాపారులు తమ వస్తువులతో పాటు ఆలోచనలు, కథలు, సంస్కృతిని సుదూర ప్రాంతాలకు విస్తరింపజేశారని ఆయన అన్నారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యం దేశ సముద్రరంగ ఆకాంక్షలుతోనూ ముడిపడి ఉందని ప్రధానమంత్రి విశదీకరించారు.
దేశంలోని ప్రధాన ఓడరేవుల సామర్థ్యం నేడు దాదాపు రెట్టింపు దాటిందని, సరకు రవాణా సమయం గణనీయంగా తగ్గిందని అన్నారు. “భారత్ ఒక వినూత్న లక్ష్యంతో సముద్ర రంగంపై దృష్టి సారించింది. దేశం 2047 నాటికి వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడంలో మరింత పటిష్ట, సమర్థ భారత సముద్రరంగ ప్రస్థానం కూడా కీలకమేనని పేర్కొన్నారు. “నౌకా నిర్మాణం, పర్యావరణ హిత నౌకాయానంలో నవ శకంవైపు మేమిప్పుడు పయనిస్తున్నాం. మా ప్రధాన ఓడరేవుల సామర్థ్యం దాదాపు రెట్టింపును అధిగమిచగా, నౌకలు తిరుగు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది” అని వివరించారు.
దేశంలోని సముద్రాలపై అవగాహనను మరింత పెంచుకోవడానికి, వాటి బాధ్యతాయుత వినియోగానికి వీలుగా సముద్ర శాస్త్రం-అన్వేషణలోనూ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. “ఈ రంగం కోసం ఆధునిక చట్రం రూపకల్పన దిశగా భారత్ నవతరం సముద్రయాన చట్టాలను తెచ్చింది. అలాగే, సముద్రాలపై మరింత అవగాహనతోపాటు వాటి అపార సామర్థ్యాన్ని బాధ్యతాయుతంగా వాడుకోవడానికీ మేం సముద్ర శాస్త్రం-అన్వేషణలో పెట్టుబడులు పెడుతున్నాము” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రపంచంలో రెండో అతిపెద్ద సముద్రరంగ కార్మిక శక్తిగా భారతీయ నావికులను ఇప్పుడు పరిగణిస్తున్నారని, ఆ మేరకు భారత యువత అంతర్జాతీయ జలాల్లో గౌరవాన్ని సముపార్జిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు. బలమైన సముద్రరంగ ఆర్థిక వ్యవస్థ రూపకల్పతోపాటు సముద్ర ఆరోగ్యాన్ని, తీరప్రాంత వ్యవస్థలను భారత్ పరిరక్షిస్తోందని ఆయన చెప్పారు. సహకారం, విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రయోజనాలపై భారత సముద్రరంగ దృక్పథం ఆధారపడి ఉందని ఆయన అన్నారు.
“సముద్రాలు సమష్టి సౌభాగ్యానికి మూలం కావాలని, ప్రతి దేశానికి తన గళం వినిపించగల, పురోగమనం సాధించగల అవకాశం ఉండాలని మేం విశ్వసిస్తున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు. సాగరమంథన్ ఆ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో చర్చలు భావి తరంలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించడమే కాకుండా పటిష్ఠ భాగస్వామ్యాలు, అపార అవకాశాలకు తోడ్పడగలవని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
(రిలీజ్ ఐడి: 2320466)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5