రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకావాణిజ్య శక్తి, నౌకాదళ స్వదేశీ సామర్థ్యాలు, వ్యూహాత్మక సామర్థ్యాలు అంతకంతకూ పెరుగుతున్నాయన్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
భారతీయ నౌకాదళ పోరాట సత్తా విస్తరిస్తోందని,
భారత నౌకావాణిజ్య ప్రయోజనాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్య
జాతీయ సమృద్ధి, ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక శక్తిలను ప్రోత్సహించడానికి
భారత్ విస్తృత నౌకావాణిజ్య సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని
పిలుపునిచ్చిన మంత్రి
ధైర్యసాహసాలు, అంకిత భావం చాటుతూ జాతీయ భద్రతకు నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబాలు అందించిన సేవలకు
నివాళులు అర్పించిన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 10:49PM by PIB Hyderabad
తూర్పు నౌకాదళ కమాండ్ ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ‘బడాఖానా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందితో, నౌకాదళ ఉద్యోగుల కుటుంబాలతో మంత్రి సమావేశమయ్యారు. దేశ సముద్ర సరిహద్దులను రక్షించడంలో నౌకాదళం తిరుగులేని నిబద్ధతను చాటుతోందని ఆయన ప్రశంసించారు. నౌకాదళ ఉద్యోగుల కుటుంబాలు చేస్తున్న త్యాగాలనూ, తోడ్పాటునూ ఆయన స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులందిస్తున్న ప్రోత్సాహం నౌకాదళ సైనికులు అంకితభావంతో, నిబద్ధతతో విధులను నిర్వహించడానికి తోడ్పడుతోందని మంత్రి అన్నారు.
సభను ఉద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, ‘బడాఖానా’ కార్యక్రమం నౌకాదళ సిబ్బందితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పించిందన్నారు. సిబ్బంది అంకితభావంతో చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి తీరుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నావికాదళం ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా నిలుస్తానని ఆయన అన్నారు. దేశ భద్రత పరిరక్షణకు వారు అందిస్తున్న తోడ్పాటును, వారి అంకితభావాన్ని మంత్రి మెచ్చుకున్నారు.
భారతీయ నౌకాదళం ఒక బలవంతమైన సముద్ర శక్తిగా ఎదగడంతో పాటు, దేశానికి ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా జవాబివ్వగల నిరూపిత సామర్థ్యాన్ని సంతరించుకుందని రక్షణ మంత్రి అన్నారు. నౌకాదళ సత్తా ఇండో-పసిఫిక్ అంతటా గుర్తింపు తెచ్చుకొందని మంత్రి చెబుతూ, భారత సముద్ర సరిహద్దుల భద్రతను నౌకాదళ యోధులు పరిరక్షిస్తూ మువ్వన్నెల జెండా సమున్నతంగా ఎగిరేటట్లు చూస్తూ అన్ని రకాల వాతావరణ స్థితుల్లోనూ మొక్కవోని దీక్షతో విధులను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. నౌకాదళ పరాక్రమానికి కీర్తిమంతమైన గత చరిత్ర ఉందని ఆయన గుర్తుచేస్తూ, 1971 యుద్ధ కాలంలో మరీ ముఖ్యంగా ‘ఆపరేషన్ ట్రైడెంట్’ సందర్భాన్ని ప్రస్తావించారు. ఆ ఘట్టంలో.. భారతీయ నౌకాదళ యోధులు కరాచీ ఓడరేవుపై దాడి చేశాయన్నారు. ఈ దాడి.. భారతదేశ సముద్రపుటెల్లలను పరిరక్షించడానికి మాత్రమే నౌకాదళం శక్తియుక్తులు పరిమితం కాకుండా, అవసరమైనప్పుడు శత్రువుపై దాడి చేసే సత్తాను కూడా కలిగివుందని రుజువు చేసిందన్నారు. నౌకాదళ యోధులు ప్రదర్శించిన సాహసం, చేసిన త్యాగం తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తాయంటూ వారికి మంత్రి నివాళులు అర్పించారు.
సముద్ర శక్తిగా భారత్ మార్పు చెందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మారుతున్న 21వ శతాబ్దపు భద్రత స్థితిగతులతో పాటే భారతీయ నౌకాదళం కూడా వేగంగా మారుతూ వస్తోందని ఆయన తెలిపారు. భారత్ స్వదేశీ విమానవాహక నౌకలను, పరమాణు జలాంతర్గాములను, స్టెల్త్ యుద్ధ నావలను, స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గాములు సహా ఆధునిక, దేశవాళీ పోరాట వేదికలను నిర్మించుకుంటూ, నౌకాదళంలోకి చేర్చుకుంటోందన్నారు. నౌకాదళ శక్తి ఒక్క నౌకలు, జలాంతర్గాములు, ఆధునిక సాంకేతికతకే పరిమితం కాదని, అంతకు మించి సిబ్బంది వృత్తికౌశలం, దేశభక్తి, ధైర్య సాహసాలు, నిబద్ధతపై ప్రధానంగా ఆధారపడి ఉంటోందని మంత్రి వివరించారు. భారత్ సముద్ర సరిహద్దులు దేశ సముద్ర శక్తిని ప్రతిబింబించేటట్లుగాను, భారత్ యుద్ధనౌకలు దేశ సాంకేతికతకు నిదర్శనాలు గాను, నౌకాదళ కార్యకలాపాలు పెరుగుతున్న దేశ ఆత్మవిశ్వాసంతో పాటు స్వయంసమృద్ధికి అద్దం పట్టేవిగాను ఉండేటట్లు చూడాలన్నది భారత్ తపన అని ఆయన అన్నారు.
ఒక విస్తృత ప్రాతిపదిక కలిగిన నౌకావాణిజ్య దృష్టికోణం ఎంతైనా అవసరమని రక్షణ మంత్రి అన్నారు. ‘సముద్రాల నుంచి సౌభాగ్యం, శక్తి వైపునకు పయనించాల’న్న భావనతో భారత్ ముందుకు సాగాలని ఆయన అన్నారు. మహాసముద్రాలను కేవలం భద్రత అవసరమయ్యే సముద్రపుటెల్లలుగానే కాకుండా ఆర్థిక అభివృద్ధి, వ్యూహాత్మక ప్రభావం, జాతీయ సౌభాగ్యాలకు సాధనాలుగా కూడా చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు.
నౌకాదళ సిబ్బంది హీరోలనీ, వారు యువతకు స్ఫూర్తిమూర్తులనీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నౌకాదళ ఉద్యోగులు భారత్ భవితకు ప్రతినిధులని, భారత్‌కు శక్తీ, భారత్‌కు గౌరవమని ఆయన పేర్కొన్నారు. వారి నిరంతర అంకితభావం, నిబద్ధత భారత్ మరింత ప్రబలంగా, మరింత సౌభాగ్యవంతంగా, మరింత స్వావలంబనయుక్తమైందిగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రక్షణ బలగాల కుటుంబాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు. నౌకాదళ ఉద్యోగులు దేశానికి సేవ చేయడానికి సముద్రంలో విధినిర్వహణలో ఉంటే, వారి కుటుంబాలు ఇళ్లలో బాధ్యతలను తాము పంచుకుంటూ, తమ వారు కర్తవ్యాన్ని సమర్థంగా నెరవేర్చడానికి సహకారాన్నీ, బలాన్నీ అందిస్తున్నారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సిబ్బంది సేవలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలు దేశానికి అత్యంత విలువైన ఆస్తి అని ఆయన వర్ణించారు.
లాంఛన, పారివారిక భావనకు ‘బడాఖానా’ ప్రతీకని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రక్షణ బలగాల సిబ్బందికి, వారి కుటుంబాలకు, నాయకత్వానికి మధ్య బంధాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. భోజనం చేయడం ఆకలిని తీర్చుకొనేందుకే కాకుండా ఆప్యాయతనీ, కలుపుగోలుతనాన్నీ చాటే సరళమైన, ప్రస్ఫుటమైన అభివ్యక్తీకరణ అని మంత్రి అన్నారు. మనం వ్యక్తిగతంగా విశిష్ట అనుబంధాన్ని కలిగివుండే వారిని ఇంటికి భోజనానికి రండని ఆహ్వానించే సంప్రదాయం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇలాగే ‘బడాఖానా’ కార్యక్రమం రక్షణ బలగాలకు, దేశానికి మధ్య ఉన్న ప్రగాఢ సంబంధాలను సంకేతిస్తుందని, ఈ సందర్భంలో అంతా ఒక పెద్ద రక్షణ పరివారంలో భాగస్తులై ఒక చోట గుమికూడతారని ఆయన అన్నారు.
సోదరత్వానికి, సుహృద్భావానికి, సన్నిహిత స్నేహాలకు ఈ కార్యక్రమం అద్దం పడుతోందని, ఇది రక్షణ బలగాలను, వారి కుటుంబాలను, నాయకత్వాన్ని పరస్పరం జోడిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. కుటుంబాలు పోషిస్తున్న భూమికను ఆయన ప్రస్తావిస్తూ, నౌకాదళ యోధులు దేశ సేవలో నిమగ్నమై సాగరపుటలల మీద కర్తవ్య పాలనలో ఉన్న వేళ వారి కుటుంబ సభ్యులు ఇంటి వద్ద బాధ్యతలను నిర్వర్తిస్తూ తమ వారు విధులను ప్రభావవంతంగా నిర్వహించడానికి తగిన మనోబలాన్ని వారికి సమకూరుస్తుంటారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నౌకాదళ ఉద్యోగుల సేవ, వారి కుటుంబాల త్యాగం ఒకదానితో మరొకటి ముడిపడినప్పుడు అత్యంత విలువైన జాతీయ సంపద పోగుపడుతుందని మంత్రి వర్ణించారు.
****
(రిలీజ్ ఐడి: 2319893)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10